మేం అమ్ముడుపోయామని ఎట్లంటరు: ఉద్యోగ సంఘాల లీడర్లు ఫైర్

మేం అమ్ముడుపోయామని ఎట్లంటరు: ఉద్యోగ సంఘాల లీడర్లు ఫైర్
  • ఉద్యోగుల సమస్యలు ఏం పరిష్కారం కాలేదో చెప్పాలి
  • రాష్ట్ర ఆర్థికస్థితి బాలేకే జీతాలు లేట్​
  • తమను కేసీఆర్​ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారని కామెంట్​
  • ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఉద్యోగుల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఆయన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. సోమవారం నాంపల్లిలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తర్వాత మీడియాతో ఉద్యోగుల జేఏసీ చైర్మన్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ మాట్లాడారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు పైరవీలు చేస్తున్నారని, అమ్ముడుపోయారని సంజయ్ ఎలా అంటారని మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో తమకు ఉద్యమ కాలం నుంచి బంధం ఉందన్నారు. ఉద్యోగులను ఉద్దేశించి ఇప్పటికి సంజయ్ మూడు సార్లు వ్యాఖ్యలు చేశారని, ఉద్యమంలో ఆయన ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలు ఏం పరిష్కారం కాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్, చంద్రబాబు ఏమయ్యారో తెలుసుకోవాలన్నారు.

317 జీవోతో ఉద్యోగులకు న్యాయం

“రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేట్ అవుతున్న మాట వాస్తవమే. 20వ తేదీ దాకా కొన్ని జిల్లాల్లో జీతాలు పడుతున్నాయి. ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందుకే జీతాలు లేట్ అవుతున్నయి. ఏపీలో 2 నెలలు జీతాలు లేట్ అయ్యాయి’’ అని చెప్పారు. జీతాల అంశంపై సీఎస్ సోమేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ను కలిసి.. ప్రతి నెల 5 కల్లా ఇవ్వాలని కోరామని రాజేందర్ అన్నారు. 317 జీవో వల్ల 80 శాతం ఉద్యోగులకు న్యాయం జరిగిందని, మిగతా 20% మంది ఉద్యోగులకు ఇబ్బంది జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత 317 జీవోను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తాము ఎలా పనిచేశామో.. ఉద్యోగుల చరిత్ర ఏంటో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, దత్తాత్రేయను అడిగి తెలుసుకోవాలన్నారు.

ఓటు వేయమని మేమెవరికీ చెప్పలే

బై పోల్‌‌‌‌లో ఫలనా పార్టీకి ఓటు వేయమని తాము ఎవరికి చెప్పలేదని రాజేందర్ స్పష్టం చేశారు. ఆడియో, వీడియో క్లిప్​లు, పత్రికా ప్రకటనలు ఉంటే తమపై కేసు పెట్టుకోవాలన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు కూడా ఓటు ఉందని గుర్తుచేశారు. కోడ్ అమల్లో ఉన్నందున డీఏలు ఇవ్వలేదని, ఉద్యోగుల సమస్యలపై సీఎంను కలుస్తామన్నారు. సీపీఎస్​ను రద్దు చేస్తామని కేంద్రం ప్రకటిస్తే కేసీఆర్​ను ఒప్పించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తామన్నారు. వచ్చే ఏడాది పీఆర్సీకి త్వరలోనే కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని సీఎంను కోరుతామన్నారు.

ఉద్యోగులను కేసీఆర్​ కడుపులో పెట్టుకుని కాపాడుతున్నడు: మమత

ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, అవమానించేలా సంజయ్ మాట్లాడారని, క్షమాపణలు చెప్పాలని ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్, టీజీవో ప్రెసిడెంట్ మమత డిమాండ్ చేశారు. కోడ్ ఆఫ్ కండక్ట్‌‌‌‌ను లెక్క చేయకుండా పొలిటికల్ జేఏసీతో కలిసి తెలలంగాణ ఉద్యమం చేశామని చెప్పారు. ప్రభుత్వం అడిగిన దాని కంటే ఎక్కువే ఇచ్చిందని, ఉద్యోగును కేసీఆర్​ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నారన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా 30% పీఆర్సీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వంతో తాము పనిచేస్తున్నామని, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారంటే ఎలా అని ప్రశ్నించారు.