తలుపులు పగులగొట్టి..పైపులు ఎత్తుకెళ్లి..!

తలుపులు పగులగొట్టి..పైపులు ఎత్తుకెళ్లి..!
  •      జర్నలిస్టుల పేరుతో కట్టిన ఇండ్లు ఖరాబైతనయ్‍
  •     ఖాళీగా ఉండటంతో దొంగలు, మందుబాబుల పాలవుతున్న ఇంటి సామగ్రి
  •     ఏడాది కిందటే వరంగల్‍ తూర్పు దేశాయిపేటలో 200 ఇండ్లు పూర్తి
  •     దొంగలు ఇండ్ల తలుపులు విరగ్గొడుతున్రు.. పైపులు ఎత్తుకెళ్తున్రు
  •     కేటీఆర్‍ రిబ్బన్‍ కట్‍ చేసినా.. పంపిణీ ఆపిన మాజీ ఎమ్మెల్యే నరేందర్‍

వరంగల్‍, వెలుగు: అక్కడ ఇండ్ల నిర్మాణాలు పూర్తై ఏడాది గడుస్తున్నా నిరుపయోగంగానే ఉన్నాయి. దీంతో దొంగలు తలుపులు, కిటికీలు పగులగొట్టి, నీళ్ల పైపులను ఎత్తుకెళ్తున్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్​దేశమే ఆశ్చర్యపోయేలా జర్నలిస్టులకు ఇండ్లు కడతామని, మోడల్​ కాలనీ నిర్మిస్తామని ఎనిమిదేండ్లు గడిపాడు. చివరకు మీడియా పేరుతో కోట్లాది రూపాయలతో నిర్మించిన ఇండ్లను వరంగల్‍ తూర్పు మాజీ ఎమ్మెల్యే తన మనుషులకు ఇచ్చుకోవాలన్న ఉద్దేశంతో అధికారులు వాటిని పంపిణీ చేయకుండా ఆపాడు. దీంతో సిటీకి కిలోమీటర్​ దూరంలో ఉన్న జర్నలిస్ట్​ కాంప్లెక్స్​ ఇప్పడు మందుబాబులకు అడ్డాగా మారింది. 

కట్టిన్రు పక్కన పెట్టిన్రు..

తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణం చేపడతామన్న హామీ నీటిపై రాతలా మారింది. దీనిపై అప్పటి మున్సిపల్‍ మంత్రికి కూడా విషయాన్ని గుర్తు చేసినా, చలనం లేకపోవడంతో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో అప్పటి బీఆర్‍ఎస్‍ వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ వరంగల్‍ సమీపంలోని దేశాయిపేటలో ప్రభుత్వ స్థలం కేటాయించారు. 2021 ఏప్రిల్‍ 12న కేటీఆర్‍ గ్రేటర్‍ పర్యటనలో వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం రూ.10.60 కోట్లతో నిర్మించతలపెట్టిన ఇండ్లకు నాటి మంత్రి శంకుస్థాపన చేశారు. ఆపై మరింత బడ్జెట్‍ పెంచారు. ఆరు నెలల్లో వాటిని పూర్తిచేసి పంపిణీ చేస్తామన్నారు. మొత్తంగా ఇండ్ల నిర్మాణానికి రెండున్నరేండ్లు పట్టింది.

అనుకూలంగా పనిచేస్తేనే ఇస్తాం..! 

తూర్పు జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణాన్ని అప్పటి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. జర్నలిస్టుల పేరుతో అవసరాన్నిమించి మరో 40 వరకు ఎక్కువ ఇండ్లు కట్టించాడు. జర్నలిజం, యూనియన్‍ నేతలు ఇచ్చిన జాబితాతో సంబంధం లేకుండా సొంతవారి పేర్లు అందులో చేర్చాడు. కమర్షియల్‍ ఏరియా కావడంతో ఇంకొన్నింటికి లోలోపల ధర ఫిక్స్​చేశాడు. 

మొత్తంగా కేటీఆర్‍ చేతులమీదుగా కేవలం ఆరుగురికి మాత్రమే ఇండ్ల పేపర్లు అందించిన మాజీ ఎమ్మెల్యే, జర్నలిస్టుల కాలనీని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. యూనియన్ల వారు ఇచ్చిన అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇవ్వకుండా, అసెంబ్లీ ఎలక్షన్లలో తనకు అనుకూలంగా పనిచేసిన వారికే ఇస్తానని ఇన్‍డైరెక్ట్​గా బ్లాక్‍మెయిల్‍ చేశాడు.  

మందుబాబులకు అడ్డాగా..

జర్నలిస్ట్​లను ముందుపెట్టి సొంత లాభం చూసుకుందామనుకున్న మాజీ ఎమ్మెల్యే ఓటమితో, ఆయన స్కెచ్‍ పారలేదు. అర్హులైనవారికి ఇండ్ల పంపిణీని చూసుకోవాల్సిన కలెక్టర్, ఇతర అధికారులు పట్టించుకోలేదు. దీంతో జర్నలిస్ట్​ల ఇండ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తూ, మందుబాబులకు అడ్డాగా మారాయి. ఇదే అదనుగా దొంగలు తలుపులు, కిటికీలు పగులగొట్టి సామగ్రిని ఎత్తుకెళ్తున్నారు.