ఈ అభివృద్ధి మోడీకే అంకితం

ఈ అభివృద్ధి మోడీకే అంకితం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014లో పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాథమిక సౌలతులు కల్పించేందుకు, స్వయం సమృద్ధ భారత నిర్మాణానికి కృషి చేస్తున్నారు. దీంతో నవ భారత ఆవిర్భావంలో అభివృద్ధి వేగం, స్థాయి ప్రధాన అంశాలుగా మారాయి. సామర్థ్యం, పారదర్శకతకు పెద్దపీట వేయడంతోపాటు వేగంగా, సజావుగా చిట్టచివరి స్థాయిదాకా సేవలు అందజేయడంలో మోడీ ప్రభుత్వం ఎంతో ముందంజ వేసింది. తదనుగుణంగా ‘సబ్‌‌కా సాథ్‌‌.. సబ్‌‌కా వికాస్‌‌’ స్ఫూర్తితో 2024–-25 కల్లా దేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం, సహకారంతో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. 
 

ప్రగతి బాటలు పరిచే ప్రణాళిక
మోడీ 2021లో ‘పీఎం గతిశక్తి జాతీయ బృహత్‌‌ ప్రణాళిక’కు శ్రీకారం చుట్టారు. నవ భారత నిర్మాణంలో మౌలిక సదుపాయాల రంగంలోని ‘గతి’(వేగం)కి గొప్ప ‘శక్తి’ని సమకూర్చడమే ఈ ప్రణాళిక లక్ష్యం. ఇది రాబోయే 25 ఏళ్లలో ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో సమగ్ర, సమ్మిళిత సామాజిక-, ఆర్థిక ప్రగతికి తగిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక. అమలులో సమన్వయం దిశగా నేను నిర్వహించే రోడ్డు రవాణా- జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సహా 16 కేంద్ర మంత్రిత్వ శాఖలను ఒకచోట చేర్చిన డిజిటల్‌‌ వేదిక ఇది. అన్ని యాస్పిరేషనల్ జిల్లాలు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఈశాన్య భారతంలో ప్రగతి బాటలు పరిచే ప్రణాళిక ఇది.  

ప్రాజెక్టులపై స్వయంగా పర్యవేక్షణ
కేంద్ర మంత్రి మండలి సమావేశాల సందర్భంగా నేను సమర్పించే వివిధ ప్రతిపాదనలకు ప్రధాని మోడీ ఎప్పుడూ వినూత్న ఆలోచనలతో విలువను జోడిస్తారు. అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విషయంలో పురోగతిని పరిశీలిస్తుంటారు. ఇక సాగరమాల, ప్రత్యేక రవాణాపారిశ్రామిక కారిడార్లు, జాతీయ రవాణా సౌకర్యాల విధానం, ఉడాన్- ఆర్‌‌సీఎస్, భారత్‌‌నెట్, డిజిటల్ ఇండియా, పర్వతమాల, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి  ప్రధానమంత్రి తలపెట్టిన ఇతర ముఖ్య కార్యక్రమాలు కూడా చెప్పుకోదగ్గ ప్రగతిని సాధిస్తున్నాయి. 

ఈ అభివృద్ధి మోడీకే అంకితం..
మోడీ దార్శనికత, చురుకైన నాయకత్వ తోడ్పాటు లేనిదే నా మంత్రిత్వ శాఖ పరిధిలో రోడ్లు-, రహదారుల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పురోగతి, అభివృద్ధి సాధ్యమయ్యేవి కావనడంలో సందేహం లేదు. నవ భారత సాకారం కోసం నిరంతరం మనకు దిశానిర్దేశం చేస్తుంటారు. ప్రధాని మోడీ ఈ శనివారం 72వ జన్మదిన వేడుక చేసుకోబోతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నా మంత్రిత్వ శాఖ పరిధిలో అన్నిరకాల అభివృద్ధిని, ప్రగతిని ఆయన గౌరవార్థం అంకితం చేస్తున్నాను. తద్వారా మేమంతా ఒక ప్రత్యేక పద్ధతిలో ఆయన జన్మదిన వేడుక నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. 

ప్రధాని మోడీ 72వ జన్మదినం 
సందర్భంగా సంక్షిప్త కథనం
- నితిన్‌‌ గడ్కరీ, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి