యానిమల్ ఆస్ట్రోనాట్స్

యానిమల్ ఆస్ట్రోనాట్స్

అంతరిక్షానికి వెళ్లిన ఆస్ట్రోనాట్ల గురించి అందరికీ తెలుసు. కానీ మనుషుల కంటే ముందుగా స్పేస్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన యానిమల్ ఆస్ట్రోనాట్స్ గురించి తెలుసా? అంతరిక్షంలో మనుషులు అడుగు పెట్టక ముందే జంతువులు స్పేస్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటరయ్యాయి. అందరికంటే ముందుగా స్పేస్‌‌‌‌‌‌‌‌కు వెళ్లింది ఒక కుక్క. దాని పేరు లైకా. 1957లో రష్యా  తొలిసారిగా ఈ ప్రయోగం చేపట్టింది. అంతరిక్షంలో జీవుల మనుగడ సాధ్యమా? కాదా? అని తెలుసుకోవడం కోసం లైకాను స్పేస్‌‌‌‌‌‌‌‌లోకి పంపారు. దానికి పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వదిలారు. రాకెట్‌‌‌‌‌‌‌‌లో  లైకా ఆకాశానికైతే  బాగానే దూసుకెళ్లింది కానీ  కక్ష్యలోకి చేరగానే అయోమయానికి గురైంది. పాపం 15 సెకన్లలోనే చనిపోయింది. తిరిగి భూమికి రాలేకపోయింది. కానీ లైకా వల్ల సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌లు స్పేస్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు.  లైకా త్యాగం కొంతవరకూ ఉపయోగపడింది.

ఇక  ఆ తర్వాత మరో రెండు కుక్కలు స్పేస్‌‌‌‌‌‌‌‌ను చుట్టి వచ్చాయి. 1960లో బెల్కా, స్ట్రెల్కా అనే రెండు కుక్కలను స్పేస్‌‌‌‌‌‌‌‌లోకి వదిలారు. ఇవి మాత్రం విజయవంతంగా ప్రాణాలతో తిరిగి వచ్చాయి. ఇవి చేసిన స్పేస్ ట్రిప్ సక్సెస్ అవ్వడంతో తర్వాత యూరీ గగారిన్ అంతరిక్ష యాత్రకు లైన్ క్లియర్ అయింది. ఇదిలా ఉంటే రష్యాకు పోటీగా అప్పట్లో అమెరికా కూడా చింపాజీలను స్పేస్‌‌‌‌‌‌‌‌లోకి పంపింది. వీటిని ముద్దుగా ‘ఆస్ట్రోచింప్స్’ అనేవాళ్లు. 1961 లో అమెరికా.. చింపాజీలు, కోతులను అంతరిక్షంలోకి పంపి, అవి అక్కడి వాతావరణాన్ని తట్టుకుంటున్నాయో లేదో ప్రయోగం చేసింది.  వాటిలో కొన్ని  ప్రాణాలతో తిరిగి రాగా.. కొన్ని స్పేస్‌‌‌‌‌‌‌‌లోనే  ప్రాణాలు విడిచాయి. అలాగే ఫ్రాన్స్ కూడా 1967లో రెండు కోతులను అంతరిక్షంలోకి పంపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. ‘హెక్టర్’ అనే ఎలుక, ‘ఫెలిక్స్’ అనే పిల్లి, ‘అరబెల్లా’, ‘అనిత’ అనే రెండు సాలీడ్లు, ఒక జెల్లీ ఫిష్, ఒక తొండ,  రెండు కోడిపిల్లలు.. ఈ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. మొత్తానికి  మనుషులు తమ స్వార్థం కోసం అప్పట్లో జంతువులను ఉపయోగించుకున్నారన్నమాట.