చూపు దూరం చేసిన సర్కారు స్కీమ్

చూపు దూరం చేసిన సర్కారు స్కీమ్

వరంగల్, వెలుగు : కండ్ల సమస్యతో సతమతమవుతున్న వారు బాగవుతుందని కంటి వెలుగు పథకంలో ఆపరేషన్‍ చేయించుకుంటే ఉన్న చూపూ పోయింది. ఏకంగా 18 మంది కండ్లు కనిపించక నాలుగేండ్లుగా బతుకులీడుస్తున్నారు. అప్పట్లో డాక్టర్ల నిర్లక్ష్యం, ఆపరేషన్‍ థియేటర్‍ పరిసరాలు సరిగ్గా లేకపోవడమే కారణమని తేల్చిన అధికారులు హాస్పిటల్‍ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటివరకు బాధితులకు పరిహారం కూడా ఇవ్వలేదు. బాధితుల్లో ఇద్దరు చనిపోగా..మిగతావారు జీవితాలు ఆగమై ప్రభుత్వం పరిహారం ఎప్పుడిస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

2018  సెప్టెంబర్ ​26...చీకటి రోజు 

రాష్ట్రంలో కండ్ల సమస్యలతో బాధపడేవారికి ఆపరేషన్లు చేయించి చూపును ప్రసాదించాలని రాష్ట్ర సర్కారు 2018 ఆగస్టు 15న కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఖర్చుతోనే క్యాంపుల్లో పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు ఇస్తామని, అవసరమైన వారికి ఆపరేషన్లు చేయిస్తామని చెప్పింది. దీంతో ఉమ్మడి వరంగల్‍ జిల్లాల్లో ఎక్కడెక్కడి నుంచో జనాలు క్యాంపులు పెట్టినచోటుకు వచ్చారు. డాక్టర్లు టెస్టులు చేసి ఆపరేషన్​అవసరమైన వారిని సెప్టెంబర్​26న హన్మకొండలోని జయ హాస్పిటల్‍కు తరలించారు. అక్కడ సర్జరీలు చేయగా ఆపరేషన్లు వికటించి 18 మంది ఉన్నచూపు కోల్పోయారు. ఆఫీసర్లు అందరినీ హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్‍ కంటి హాస్పిటల్​కు తరలించారు. మరో రెండు, మూడుసార్లు సర్జరీలు చేయించినా ఉపయోగం లేకుండా పోయింది. 

మాటమార్చిన అధికారులు 

18 మందికి చూపుపోవడంతో  అధికారులు మాట మార్చారు. బాధితులు కంటి వెలుగు పథకంలో సర్జరీలు చేయించుకోలేదని ప్రకటించారు. నేషనల్‍ ప్రోగ్రాం ఫర్‍ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్​నెస్​, జిల్లా అంధత్వ నివారణ సంస్థ తరఫున ఆపరేషన్లు చేయించుకున్నారని కవర్‍ చేశారు. కాగా, జయ హస్పిటల్​లో వికటించిన ఆపరేషన్లకు కంటి వెలుగుతో సంబంధం లేనప్పుడు.. ప్రభుత్వ క్యాంపులకు వచ్చిన బాధిత 18 మందిని హనుమకొండలోని జయ హాస్పిటల్​కు ఎందుకు పంపారనేదానికి సమాధానం చెప్పలేదు. 

థియేటర్ సీజ్.. ఇష్యూ క్లోజ్‍ 

వరంగల్​లో జరిగిన ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో డీఎంహెచ్ఓ విచారణ చేపట్టారు. దవాఖానాలోని ఆపరేషన్‍ థియేటర్, ఇతర వసతులు సరిగా లేవని చెప్పారు. అపరిశుభ్ర వాతావరణంలో సర్జరీలు చేయడానికి తోడు డాక్టర్ల నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. అక్టోబర్ 13న షోకాజ్‍ నోటీసులు జారీ చేశారు. ఆపై ఆపరేషన్‍ థియేటర్‍ సీజ్‍ చేశారు. తమ పని పూర్తయిందన్నట్లుగా అంశాన్ని పక్కనపెట్టారు. 

బాధితుల జీవితాలు ఆగం

కండ్లు పోగొట్టుకున్న 18 మంది జీవితాలు ఆగమయ్యాయి. చూపు లేకపోవడంతో కూలీ పనులకు పిలిచేవారు కరువయ్యారు. దీంతో బాధితులు ఇండ్లకే పరిమితమై ఆర్థికంగా చితికిపోయారు. కొందరికి ఒక కన్ను పోగా మరోకన్నుపై దాని ప్రభావం పడి ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. న్యాయం జరగడంలేదనే మనోవేదనతో భూపాలపల్లికి చెందిన ముడిక రాజయ్య అప్పట్లోనే చనిపోయారు. కొద్ది రోజులకే వరంగల్‍ క్రిస్టియన్‍ కాలనీకి చెందిన బొమ్మకల్లు వెంకటయ్య కూడా కన్నుమూశారు. ప్రభుత్వం బాధితులకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. హాస్పిటల్‍ మేనేజ్‍మెంట్‍, డాక్టర్లపై ఎటువంటి చర్యలు లేవు. ఇంజక్షన్ ఆర్డర్‍ తెచ్చుకుని హాస్పిటల్‍ నిర్వాహకులు తిరిగి ఆపరేషన్‍ థియేటర్ ఓపెన్‍ చేసుకున్నారు.  బాధితులకు న్యాయం చేయాలని వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో పలుమార్లు కలెక్టర్‍ డీఎంహెచ్ఓలను కలిశారు. అయినా వారిని పట్టించుకున్నవారు కరువయ్యారు.  

వరంగల్‍ ఘటనతో పథకానికి బ్రేక్ 

కంటి వెలుగు పథకంలో భాగంగా 9887 గ్రామాల్లో దాదాపు 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 6,42,290 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు, మరో 3,16,976 మందికి ఉన్నత స్థాయి చికిత్సలు అవరమని తేల్చింది. రూ.2 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 19 గవర్నమెంట్‍ హాస్పిటల్స్​లో ఆపరేషన్లు నిర్వహించేలా థియేటర్లను ఆధునీకరించనున్నట్లు తెలిపింది. అప్పుడే వరంగల్‍ ఘటన జరిగింది. 18 మంది కంటిచూపు పోవడానికి, కంటి వెలుగు స్కీంకు సంబంధం లేదని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు.. రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకాన్ని ఆపేశారు. 

క్యాంపుకు పోతే కన్ను పోయింది 

నేను ఇస్త్రీ పని చేసుకుని బతికేటోన్ని. కండ్లు మసకగ కనబడితే కంటి వెలుగు క్యాంపు దగ్గరికి పోయిన. డాక్టర్లు ఆపరేషన్​ చేసుకోవాలని జయ హాస్పిటల్ కి రాసిన్రు. ఫారం పట్టుకుని పోతే ఆపరేషన్ చేసిన్రు. తెల్లారి కన్ను కనపడలే. వాళ్లకు చెప్తే ఇంకో రెండు ఆపరేషన్లు చేసిన్రు. అయినా కన్ను పని చేయలే. హైదరాబాద్ పంపించి ఇంకో రెండుసార్లు ఆపరేషన్లు చేసినా కన్ను రాలే. కూలో..నాలో  చేసుకోకుండా నా బతుకు ఆగం చేసిన్రు. - కందుల మల్లయ్య (హనుమకొండ)  

ఉన్న కన్ను పొగొట్టిన్రు

నేను పొద్దుగాల పప్పు ప్యాకింగ్ చేయడానికి పోయేది. రాత్రి బీడీలు చుట్టేది. కన్ను మసక మసక ఉండడంతో.. కంటి వెలుగు క్యాంపుకు పోయిన. ఫ్రీ ఆపరేషన్ అని జయ హాస్పిటల్ కు పంపిన్రు. అక్కడ ఉన్న కన్ను పోగొట్టిన్రు. ఇప్పుడు పప్పు ప్యాకింగ్ పని లేదు. బీడీలు చుట్టడానికి కూడా రాదు. మాకు న్యాయం జరగలేదు. సర్కారు స్పందించి మాకు ఏదన్నా ఒకటి చేయాలె. - కక్కెర్ల సరోజన (మచిలీ బజార్, హనుమకొండ)