
రాష్ట్రవ్యాప్తంగా వేల స్కూళ్లు, కాలేజీల్లో కనిపించని టాయిలెట్లు
ఉన్నచోట కూడా క్లీన్ చేసే దిక్కు లేదు
సరూర్‌నగర్ జూనియర్ కాలేజీలో 700 మందికి ఒకటే టాయిలెట్.. రోడ్డెక్కిన స్టూడెంట్లు
యూరిన్ వస్తదని నీళ్లు కూడా తాగుతలేమని ఆవేదన
ఎల్బీ నగర్/ హైదరాబాద్, వెలుగు : ఏడు వందల మంది స్టూడెంట్లు.. ఒక్కటే టాయిలెట్. అది కూడా అబ్బాయిలు, అమ్మాయిలకు కలిపి. ఇది ఊహించుకుంటేనే ఎంతో నరకంగా ఉంటుంది. అలాంటి నరకాన్నే చవిచూసిన పిల్లలు ఇక తమ వల్ల కాదని రోడ్డెక్కారు. ఎక్కడ యూరిన్ వస్తుందోనన్న భయంతో నీళ్లు కూడా తాగడం లేదని, పీరియడ్స్వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. పీరియడ్స్ రాకుండా ఇంటి దగ్గర ట్యాబ్లెట్లు వేసుకొని వస్తున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కాలేజీ ఉన్నది ఎక్కడో కాదు.. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్‌లో ఉంది. ఈ ఒక్క కాలేజీలోనే కాదు.. రాష్ట్రంలో అనేక గవర్నమెంట్ కాలేజీల్లో, స్కూళ్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. పలు కాలేజీల్లో, స్కూళ్లలో వందల మందికి ఒకటీ రెండు టాయిలెట్లే ఉండటంతో వాటి ముందు పిల్లలు క్యూ కడుతున్నారు. మరికొన్నిట్లో ఉన్నకొన్ని టాయిలెట్లలో కూడా సగానికిపైగా పనిచేయడం లేదు. దీంతో స్టూడెంట్లు అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి తమ పిల్లలు యూరిన్‌ను ఆపుకోవడంతో రోగాల బారినపడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం.. ప్రతి 20 మంది స్టూడెంట్లకు ఒక మూత్రశాల, 40 మందికి ఒక మరుగుదొడ్డి ఉండాలి. స్టాఫ్‌కు ప్రత్యేకంగా ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్, ప్రైవేటువి కలిపి 43 వేల స్కూళ్లు, జూనియర్ కాలేజీలుండగా.. వాటిలో 35వేల స్కూళ్లు, కాలేజీల్లో టాయిలెట్ల ఫంక్షనింగ్ ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లలో టాయిలెట్లు సక్కగా లేవు.
సరూర్‌నగర్ కాలేజీలో 4ఏండ్లుగా ఇదే దుస్థితి
సరూర్‌నగర్ జూనియర్ కాలేజీలో 400 మంది అమ్మాయిలు, 300 మంది అబ్బాయిలు చదువుతున్నారు. ఇక్కడ ఒక్కటే టాయిలెట్ ఉండడంతో గత్యంతరం లేక దాన్ని అమ్మాయిలకు కేటాయించి, అబ్బాయిలు ఆరు బయట యూరిన్‌కు వెళ్తున్నారు. ఒక్క టాయిలెట్ సరిపోక, నీళ్లు తాగకుండా కాలేజీకి వస్తున్నామని, దాహం వేసినా నీళ్లు తాగ డం లేదని అమ్మాయిలు తెలిపారు. తమ పరిస్థితి కూడా అంతే ఉందని అబ్బాయిలు అంటున్నారు. కాలేజీలో టాయిలెట్ లేకపోవడం వల్ల, బయటకు వెళ్తున్నామన్నారు. చుట్టుపక్కల యూరిన్ పాస్ చేసేటప్పుడు స్థానికులు చూస్తే, తమను రాళ్లతో కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము కూడా అమ్మాయిల మాదిరిగానే నీళ్లు తాగడం మానేస్తున్నామన్నారు. ఈ దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్టూడెంట్లు తెలిపారు. నాలుగేండ్లుగా ఇదే పరిస్థితి నెలకొందని, కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వందల మంది స్టూడెంట్లు ఒక్క టాయిలెట్ ఎలా ఉపయోగించాలో విద్యాశాఖ మంత్రి చెప్పాలని స్టూడెంట్లు ప్రశ్నించారు. ఆ ఒక్క టాయిలెట్‌ను కూడా క్లీన్ చేసేవాళ్లు లేరన్నారు. కాలేజీలో మంచి నీటి సౌకర్యం లేదని తెలిపారు. కాంపౌండ్ వాల్ లేకపోవడంతో, రాత్రిళ్లు మందుబాబులకు అడ్డాగా మారుతోందని, క్లాసు రూముల్లో బీరు బాటిళ్లు ఉంటున్నాయని తెలిపారు. తమ ధర్నాతో ఆఫీసర్లు వచ్చి నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారని, గతంలో కూడా ఇట్లనే చెప్పి తప్పించుకున్నారని మండిపడ్డారు. వెంటనే సౌలత్లు కల్పించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. సోమవారం దాదాపు 3 గంటల పాటు ఆందోళన నిర్వహించారు. స్టూడెంట్లకు అండగా కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి రాంరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డితో పాటు స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి అంజన్ బైఠాయించి ధర్నా చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో విద్య వ్యవస్థ పూర్తిగా అధ్వాన్నంగా మారిపోయిందని, స్టూడెంట్లకు కనీస వసతులు కూడా ప్రభుత్వం కల్పించడం లేదని కాంగ్రెస్ లీడర్లు మండిపడ్డారు. ఒక మహిళ మంత్రి ఉండి కూడా కాలేజీల్లో అమ్మాయిల దుస్థితిపై స్పదించకపోవడం దారుణమని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని విమర్శించారు.
ట్యాబ్లెట్లు వేసుకుని వస్తున్నాం
కాలేజీలో ఉన్నదొక్కటే టాయిలెట్. అది కూడా చాలా డర్టీగా ఉంటుంది. యూరిన్ వస్తుందేమోనన్న భయంతో నీళ్లు కూడా తాగడం మానేస్తున్నాం. పీరియడ్ వస్తే ఎక్కడికి వెళ్లాలో తెలియని దుస్థితిలో ఉంటున్నాం. ఆ భయంతో ట్యాబ్లెట్లు వేసుకుని కాలేజీకి వస్తున్నాం. బాయ్స్ యూరిన్ కోసం బయటకు వెళ్తే లోకల్ వాళ్లు కొడుతున్నారు. నాలుగేండ్ల నుంచి ఇదే పరిస్థితి. ఎన్నాళ్లు భరించాలి? ప్రభుత్వం స్పందించి వెంటనే మా కాలేజీలో టాయిలెట్స్, కాంపౌండ్ వాల్ నిర్మించాలి. లేకపోతే ఆందోళన కంటిన్యూ చేస్తాం.
- సెకండ్ ఇయర్ విద్యార్థిని, సరూర్‌నగర్ జూనియర్ కాలేజీ
నిర్వహణ లేక లాక్
సర్కారు స్కూళ్లలో గతంలో స్వచ్ఛ కార్మికులు పనిచేసేవారు. వారికి రూ.2వేలు జీతం ఇచ్చేవారు. కరోనా తర్వాత వారిని బడుల్లోకి తీసుకోలేదు. దీంతో క్లీన్ చేసే వాళ్లే కరువయ్యారు. పంచాయతీ, మున్సిపల్ వర్కర్లకు ఆ బాధ్యతలు అప్పగించినా, వారు చేయడం లేదు. దీంతో టీచర్లు, పిల్లలే క్లీన్ చేస్తున్నారు. చాలా స్కూళ్లలో టాయిలెట్లు బ్లాక్ కావడంతో, వాటిని క్లీన్ చేసే వారే కరువయ్యారు. టాయిలెట్ల క్లీనింగ్ కోసం సరిపడా నీళ్లు లేక, కొన్ని చోట్ల యూజ్ చేయడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్లు లేక స్టూడెంట్లు ఆరుబయటకు వెళ్తున్నారు. పట్టణాల్లో సరిపడా టాయిలెట్లు లేక అమ్మాయిలు నీళ్లు కూడా సరిగా తాగడం లేదని అనేక సర్వేలు వెల్లడించారు.