చంద్రాపూర్ ఫారెస్ట్లో మూడు పులులు మృతి

చంద్రాపూర్ ఫారెస్ట్లో మూడు పులులు మృతి

మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రం అటవీ ప్రాంతంలో మూడు పులులు ఒకేసారి మృతి చెందాయి. చంద్రాపూర్ జిల్లా చిమ్ముర్ తాలూకా పరిధిలోని మెటేపార్ ఊరి దగ్గర ఓ పులి, రెండు పులి పిల్లలు చనిపోయినట్టు స్థానికులు సోమవారం గుర్తించారు. అటవీ అధికారులకు సమాచారమివ్వగా వాళ్లు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఓ నీటి కుంట దగ్గర తల్లి మృతదేహం, కొంచెం దూరంలో రెండు పిల్లలు పడి ఉన్నట్టు గుర్తించారు. పులులను శవ పరీక్షకు పంపామని చంద్రాపూర్‌‌‌‌ అటవీ డీఎఫ్‌‌‌‌వో కుల్‌‌‌‌రాజ్‌‌‌‌సింగ్‌‌‌‌ తెలిపారు. ఒకేసారి 3 పులులు ఎలా మృతి చెందాయో విచారణ జరపుతున్నామని చెప్పారు. విష ప్రభావంతోనే పులులు చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. అవి చనిపోయిన ప్రాంతంలో ఆవు కళేబరం ఆనవాళ్లను అధికారులు గుర్తించినట్టు తెలిసింది. బ్రహ్మపురి రేంజ్‌‌‌‌ పరిధిలో పులుల సంచారాన్ని గుర్తించిన వేటగాళ్లు వాటిని చంపేందుకు ఆవు కళేబరానికి విషం పెట్టినట్టు భావిస్తున్నారు.