రాష్ట్రంలోని  జీవ వైవిధ్య సంరక్షణ కేంద్రాలు ఇవే

రాష్ట్రంలోని  జీవ వైవిధ్య సంరక్షణ కేంద్రాలు ఇవే

ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతులను అవే సహజసిద్ధ పరిసరాల్లో సంరక్షించడాన్ని ఆవాసాంతర రక్షణ అంటారు. ఇందులో భాగంగా బయోస్పియర్​ రిజర్వులు, జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని  జీవ వైవిధ్య సంరక్షణ కేంద్రాల గురించి తెలుసుకుందాం.. 

జాతీయ పార్కులు: వన్యప్రాణుల సంరక్షణ కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. అమెరికాలో 1872లో మొదటి జాతీయ పార్కు ఏర్పాటైంది. భారతదేశంలో 1927లో ఉత్తరాఖండ్​లో జిమ్​కార్బెట్ నేషనల్​ పార్కు ఏర్పాటు చేశారు. దేశంలో మొత్తం 104 జాతీయ పార్కులు ఉన్నాయి. తెలంగాణలో 3 జాతీయ పార్కులు ఉండగా వాటి విస్తీర్ణం 20 చ.కి.మీ.  

కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయపార్క్​: 1998 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు. చిరాన్​ ప్యాలెస్​గా పిలిచే ఈ పార్క్​ హైదరాబాద్​లోని జూబ్లిహిల్స్​లో ఉంది. భారత ప్రభుత్వం 2020లో ఎకో సెన్సిటివ్​ జోన్​గా ప్రకటించింది. 

మహావీర్​ హరితవనస్థలి పార్క్​: జైనమత గురువు మహావీరుడు నిర్వాణం పొంది 2500 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దీన్ని 1975లో రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ‘కృష్ణజింక’ లు సంరక్షిస్తున్నారు. 

మృగవని జాతీయపార్క్​: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలం చిలుకూరులో ఏర్పాటు చేశారు.  భారతకుందేలు, అడవిపిల్లి, అడవిపంది, పైథాన్​ వంటి జీవజాతులు ఇందులో సంరక్షిస్తున్నారు. 

అభయారణ్యాలు

ఇవి అరుదైన వన్యప్రాణి సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డాయి. ప్రస్తుతం భారతదేశంలో 566 అభయారణ్యాలు ఉన్నాయి. తెలంగాణలో 9 అభయారణ్యాలు ఉన్నాయి. వీటి మొత్తం విస్తీర్ణం 5672 చ.కి.మీ.  

పాకాల అభయారణ్యం: ములుగు జిల్లా పాకాలలో 860 చ.కి.మీ. లలో ఉంది. మారేడు, ఉసిరి, రోజ్​వుడ్​, చిరుత, కృష్ణజింక సంరక్షించబడుతున్నాయి. 
ఏటూరునాగారం అభయారణ్యం: ఇది ములుగు జిల్లాలో విస్తరించి ఉంది. 1999 సంవత్సరంలో దీన్ని వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటించారు. ఇక్కడ ఎక్కువగా పెరిగే వృక్షం టేకు, మద్ది, వెదురు, ఎర్రచందనం. కృష్ణ జింక, మొసలి, పైథాన్​, చిరుత వంటి వృక్ష, జంతు జాతులు సంరక్షించబడుతున్నాయి. 

ప్రాణహిత అభయారణ్యం: మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతంలో ఉంది.  1980లో 136 చ. కి.మీల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇది అంతరించే దశలో ఉన్న రక్షిత ప్రదేశం. 

కవ్వాల్​ అభయారణ్యం: 1956లో ఏర్పాటైన ఈ అభయారణ్యం నిర్మల్​, ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, మంచిర్యాల జిల్లాలో కేంద్రీకృతమైంది. 1999లో దీన్ని అభయారణ్యంగా ప్రకటించారు. కేంద్ర క్యాబినెట్​ 2012లో 40వ టైగర్​ రిజర్వ్​గా ప్రకటించింది. 

శివ్వారం అభయారణ్యం: ఇది 30 చ.కి.మీ. విస్తీర్ణంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో విస్తరించి ఉంది. ఇక్కడ మొదటి డైనోసర్​ అస్థికలు లభించాయి. టేకు, మొసళ్లు, చిరుత జీవజాతులు సంరక్షించబడుతాయి. 

మంజీరా అభయారణ్యం: ఇది సంగారెడ్డి జిల్లాలో మంజీరా నది ఒడ్డున 20 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఇది మగ్గర్​ మొసళ్లు, పక్షులకు కేంద్రం. 

పోచారం అభయారణ్యం: ఇది 130 చ.కి.మీ. విస్తీర్ణంలో మెదక్​, కామారెడ్డి జిల్లాలో విస్తరించి ఉంది. ఇది అనేక పక్షుల సంరక్షణకు కేంద్రం. 

కిన్నెరసాని అభయారణ్యం: ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 635 చ.కి.మీల విస్తీర్ణంలో ఉంది. కిన్నెరసాని నది దీని గుండా ప్రవహిస్తుంది. 

ఆమ్రాబాద్​ పులుల సంరక్షణ కేంద్రం: దీనినే రాజీవ్​గాంధీ వైల్డ్​లైఫ్​ శాంక్చువరి అంటారు. 1978 సంవత్సరంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా గుర్తించారు. 1983 సంవత్సరంలో పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. 2,166 చ.కి.మీ.ల విస్తీర్ణంలో నల్గొండ, నాగర్​కర్నూల్​ జిల్లాల్లో వ్యాపించి ఉంది. 

బయోస్పియర్​ రిజర్వ్​లు: బయోస్పియర్​ రిజర్వ్​లను యునెస్కో 1971లో మానవుడు, జీవగోళంలో భాగంగా 1974 లో ప్రవేశపెట్టారు. వీటిలో వన్యప్రాణులతో పాటుగా, మచ్చిక చేయబడ్డ జంతువులు, వృక్షాలు అక్కడ నివసించే గిరిజనుల జీవన విధానం పరిరక్షించబడుతుంది. భారతదేశంలో 1986లో నీలగిరి బయోస్పియర్​ రిజర్వ్​ను ఏర్పాటు చేశారు. దేశంలోని 18 బయోస్పియర్​ రిజర్వ్​లో 12 మాత్రమే యునెస్కో గుర్తించింది. బయోస్పియర్​ రిజర్వులో 3 జోన్స్​ ఉంటాయి. అవి కేంద్ర మండలం, బఫర్​ ప్రాంతం, పరివర్తన మండలం.

రక్షిత అడవులు: 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అడవులు, వన్యప్రాణులకు రక్షణ కల్పించబడుతుంది. అడవుల నరికివేతను నిషేధించడమైంది. చట్టవిరుద్ధమైన వేటను జంతువులు పట్టడాన్ని వాటిని అతిక్రమించిన వారిని శిక్షించడం తదితర చర్యలను చేపడుతున్నారు. 1980లో అడవుల రక్షణ ఉత్తర్వులను జారీ చేశారు. 

ప్రాజెక్ట్​ టైగర్​: భారత ప్రభుత్వం ప్రాజెక్ట్​ టైగర్​ను 1973 ఏప్రిల్​ 1న ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును జిమ్​ కార్బెట్​ జాతీయ పార్కులో ప్రారంభించారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద పులుల సంరక్షణ ప్రాజెక్ట్​. మనదేశంలో మధ్యప్రదేశ్​ లో 6 టైగర్ రిజర్వులున్నాయి. పులులు అధికంగా గల మధ్యప్రదేశ్​ని ‘పులుల రాష్ట్రం’ గా పిలుస్తారు. ప్రపంచం మొత్తంలో పులుల సంఖ్య 3820. భారతదేశంలో 2967 పులులు ఉన్నాయి. పులుల సంరక్షణ వాటి గణనకు సంబంధించి జాతీయ పులుల సంరక్షణ, సాధికారిక సంస్థని 2005లో ఏర్పాటు చేశారు. పులుల గణన ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది.