కాలం మారింది.. కొత్తగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్

కాలం మారింది.. కొత్తగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్

ప్రేక్షకుల అభిరుచి మారిపోతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త కథలు కావాలని కోరుకుంటున్నారు. ఇది ఫిల్మ్ మేకర్స్‌‌‌‌కి చాలా పెద్ద చాలెంజ్. రొటీన్ కథలకు ఫుల్‌‌‌‌స్టాప్ పెట్టక తప్పని పరిస్థితి. ఏదో ఒక వెరైటీ స్టోరీ చెప్పకపోతే సినిమా గట్టెక్కని గడ్డు స్థితి. దీన్నుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దొరికింది.. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్. ఊహించని ట్విస్టులతో, ఊహకే అందని మలుపులతో సాగే ఈ టైమ్ ట్రావెలింగ్‌‌‌‌ మంచి ఫలితాన్నే ఇస్తోంది. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి. ఫోన్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం పెరుగుతుంది. ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత సడెన్‌‌‌‌గా తెలుస్తుంది.. వాళ్లిద్దరూ వేర్వేరు కాలాలకు చెందినవా రని. ఓ టైమ్‌‌‌‌ లూప్‌‌‌‌లో చిక్కుకు పోయారని. దాన్నుంచి ఎలా బయటపడాలి, ఎలా కలుసుకోవాలి అని వాళ్లు పడే తపన ప్రేక్షకుల్ని టెన్షన్ పెట్టే స్తుంది. ప్లేబ్యాక్, అద్భుతం సినిమాలు రెండూ ఈ కాన్సెప్ట్‌‌‌‌తో వచ్చినవే. ‘గేమ్ ఓవర్’ క్లైమాక్స్‌‌‌‌లో తాప్సీ కూడా టైమ్‌‌‌‌ లూప్‌‌‌‌లో చిక్కుకుంటుంది. ‘కుడి ఎడమైతే వెబ్ సిరీస్‌‌‌‌లో అమలాపాల్, రాహుల్ విజయ్ పరిస్థితీ అదే. అక్షయ్ కుమార్ ‘యాక్షన్ రీప్లే’, విష్ణు విశాల్ ‘ఇండ్రు నేట్రు నాళ్’, సిద్ధార్థ్ మల్హోత్రా ‘బార్ బార్ దేఖో’ లాంటి సినిమాలు కూడా ఈ కోవకి చెందినవే. రీసెంట్‌‌‌‌గా వచ్చిన కళ్యాణ్ రామ్ ‘బింబిసార’, తాప్సీ ‘దొబారా’ కూడా ఇలాంటివే.

కొత్తేమీ కాదు...
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌‌‌‌తో ఇప్పుడు ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. అంత మాత్రాన ఇది మనకి తెలియని కొత్త కాన్సెప్టేమీ కాదు. చాలా యేళ్ల క్రితమే ఈ కాన్సెప్ట్‌‌‌‌తో బాలకృష్ణ ‘ఆదిత్య 369’ సినిమా చేశారు. భారీ హిట్టు కొట్టారు. హీరోయిన్ తండ్రి ఓ సైంటిస్ట్. ఆయన ఓ టైమ్ మెషీన్ తయారు చేస్తారు. అందులోకి కొందరు పిల్లలు అనుకోకుండా అడుగుపెడతారు. వాళ్లని కాపాడే ప్రయత్నంలో హీరో హీరోయిన్లిద్దరూ మెషీన్‌‌‌‌లో చిక్కుకుపోతారు. అది వాళ్లని శ్రీకృష్ణ దేవరాయలు కాలానికి తీసుకుపోతుంది. అక్కడి నుంచి తిరిగొచ్చే క్రమంలో కొన్ని దశాబ్దాలు ముందుకు తీసుకెళ్లిపోతుంది. చివరికి వాళ్లు తమ కాలానికి ఎలా తిరిగొచ్చారనేది కథ. స్ట్రాంగ్ స్టోరీ, సూపర్బ్ స్క్రీన్‌‌‌‌ప్లే, అద్భుతమైన సంగీతం ఈ సినిమాని ఎవర్‌‌‌‌‌‌‌‌గ్రీన్ హిట్‌‌‌‌గా నిలబెట్టాయి. మనదేశంలో టైమ్‌‌‌‌ ట్రావెల్, టైమ్ లూప్ కాన్సెప్టులతో సినిమాలు రావడం కాస్త అరుదు. కానీ హాలీవుడ్‌‌‌‌లో మాత్రం ఇలాంటి మూవీస్ కోకొల్లలు. ‘టెర్మినేటర్’ సిరీస్‌‌‌‌లోని ప్రతి పార్ట్‌‌‌‌లో టైమ్ ట్రావెల్ ఉంటుంది. రష్యన్ డాల్, బిఫోర్ ఐ ఫాల్, ద ఎండ్‌‌‌‌లెస్, ద ఫైనల్ గాళ్స్, సోర్స్ కోడ్, హ్యాపీ డెత్‌‌‌‌ డే, గ్రౌండ్‌‌‌‌హాగ్ డే, పామ్ స్ప్రింగ్స్ లాంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రపంచం చూపుని ఈ కాన్సెప్ట్‌‌‌‌ వైపు తిప్పాయి. 

కన్‌‌‌‌ఫ్యూజ్ అయ్యారో..
టైమ్ ట్రావెల్ కాన్సెప్టుల్లో ఉండే పెద్ద రిస్క్.. కన్‌‌‌‌ఫ్యూజన్‌‌‌‌. అసలు ఎవరైనా అన్నేళ్లు వెనక్కి, ముందుకి ఎలా వెళ్తారు అనే ప్రశ్నకి సమాధానం వెతుకుతుంటాడు ప్రేక్షకుడు. ఒక పర్టిక్యులర్ టైమ్‌‌‌‌లో ఎలా చిక్కుకుపోతారు, ఎవరి లైఫ్‌‌‌‌లో అయినా ఒకే రోజు ఎలా రిపీట్ అవుతుంది అనే డౌట్‌‌‌‌కి క్లారిఫికేషన్ కావాలనుకుంటాడు. అయితే ఈ విషయాల్లో క్లారిటీ ఇవ్వాలి. లేదంటే గ్రిప్పింగ్ నేరేషన్‌‌‌‌తో వాళ్లని కన్విన్స్ చేయగలగాలి. లేదంటే పాత్రలు టైమ్‌‌‌‌ లూప్‌‌‌‌లో చిక్కుకున్నట్టు ఆడియెన్స్‌‌‌‌ కన్‌‌‌‌ఫ్యూజన్‌‌‌‌లో చిక్కుకుపోతారు. ‘గేమ్ ఓవర్’ మూవీ విషయంలో ఇదే జరిగింది. సినిమా అంతా ఆసక్తికరంగానే అనిపించినా.. క్లైమాక్స్‌‌‌‌ని తాప్సీ తనకు నచ్చినట్టుగా మార్చుకునే సన్నివేశాలు చాలామందికి అర్థం కాలేదు. సూర్య ‘24’ మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ రేసులో వెనుకబడింది కూడా ఇలాంటి కన్‌‌‌‌ఫ్యూజన్‌‌‌‌ వల్లే. ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్‌‌‌‌ అయితే ప్రేక్షకుల పేషెన్స్‌‌‌‌కి పెద్ద పరీక్షే పెట్టింది. ప్రతి ఎపిసోడ్‌‌‌‌లోనూ ఒకే రకమైన సీన్స్ కనిపిస్తూ ఉండటంతో చాలామంది కన్‌‌‌‌ఫ్యూజ్ అయిపోయారు. లేదంటే ఇవి టెక్నికల్‌‌‌‌గా చాలా బెస్ట్ అనిపించుకుని ఉండేవి. కదలని తెరపై ముందుకీ వెనక్కీ కదులుతున్న కాలాన్ని అర్థం చేసుకునే పరిణతి ప్రేక్షకులకి ఎప్పుడో వచ్చింది. అందుకే టైమ్‌‌ ట్రావెల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అయితే అది అన్నిసార్లూ  వర్కవుట్ కాకపోవచ్చు. కొన్ని సార్లు మెప్పించవచ్చు, కొన్నిసార్లు కన్‌‌ఫ్యూజ్ చేసి కంగారుపెట్టొచ్చు. కానీ ‘బింబిసార’ లాంటి సినిమాలు వచ్చినప్పుడల్లా ఆ కాన్సెప్ట్‌‌కి క్రేజ్ పెరుగుతుంది. ఆ జానర్ సినిమాలు తీసేలా మరికొందరు ఫిల్మ్‌‌మేకర్స్‌‌ని ఇన్‌‌స్పైర్ చేస్తుంది.

టైమ్ బాగుంటే అంతా మంచే జరుగుతుంది...
టైమ్ బాగుంటే అంతా మంచే జరుగుతుంది. టైమ్ ట్రావెల్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌ పక్కాగా ఉంటే సినిమా హిట్టు కొట్టి తీరుతుంది. దానికి ‘బింబిసార’ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎప్పుడో పాలించిన బింబిసార చక్రవర్తి 2022లోకి ఎలా వస్తాడు? లక్ష్య సాధన కోసం తన కాలానికి వెళ్లి మళ్లీ ఎలా ఈ కాలానికి తిరిగొస్తాడు? అసలు లాజిక్‌‌‌‌కి అందని విషయమిది. అయినా ప్రేక్షకులు దాన్ని యాక్సెప్ట్ చేశారంటే కారణం.. బిగి సడలని స్క్రీన్‌‌‌‌ ప్లే. అవును. దుర్మార్గుడైన బింబిసారుడు అనుకోకుండా ఈ కాలానికి వచ్చిపడటం, మనిషంటే ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడం, మంచివాడిగా మారిపోయి తన ప్రాణాన్నే త్యాగం చేయడం.. ఈ మొత్తం జర్నీని చాలా ఇంటరెస్టింగ్‌‌‌‌గా తీశాడు దర్శకుడు. అలాగే శింబు నటించిన ‘మానాడు’ కూడా. ఫ్రెండ్ పెళ్లికని ఇండియాకి వచ్చిన హీరో లైఫ్‌‌‌‌లో ఒకే రోజు రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ రోజులో ఓ క్రైమ్ జరుగుతుంది. దాన్ని ఆపడానికి అతడు పడే తపనే సినిమా. అతనెలా సక్సెస్ అవుతాడో చూడాలనే క్యూరియాసిటీతో ప్రేక్షకులు తెరలకు కళ్లు, సీట్లకి ఒళ్లు అప్పగించేశారు. దాంతో ఇలాంటి సినిమాలు తీసేందుకు మరికొందరు రెడీ అయ్యారు, అవుతున్నారు. తమిళ కమెడియన్ యోగిబాబు హీరోగా రానున్న ‘పెరియాండవర్‌‌‌‌‌‌‌‌’ మూవీ కూడా ఇలాంటి కథతోనే రూపొందుతోంది. బాలీవుడ్ సూపర్‌‌‌‌‌‌‌‌ హిట్ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న ‘క్రిష్ 4’ కూడా టైమ్ ట్రావెల్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లోనే ఉంటుందట.