తిరుమల శ్రీవారి దర్శనానికి 2 రోజులు : పోటెత్తిన భక్తులు.. ఎందుకంటే..

తిరుమల శ్రీవారి దర్శనానికి 2 రోజులు : పోటెత్తిన భక్తులు.. ఎందుకంటే..

తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. పవిత్రమైన పెరటాసి నెల, వరుస సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఐదు కిలోమీటర్ల దూరం క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు మొత్తం భక్తులతో నిండిపోయాయి.

నందకం విశ్రాంతి భవనం దాటి ఐదు కిలోమీటర్లకు పైగా క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 

తిరుమలకు భక్తులు పోటెత్తడంతో అలిపిరి దగ్గర ఉన్న పార్కింగ్  ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. అలిపిరి నుండి ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వరకు తమిళనాడు రాష్ట్రం నుండి వచ్చిన బస్సులను పార్కింగ్ చేశారు. శుక్రవారం(సెప్టెంబర్ 29) నుంచి ఈరోజు(సెప్టెంబర్ 30) వరకు అలిపిరి రహదారికి ఇరువైపులా బస్సులు బారులు తీరాయి.

Also Read :- 13 రోజులు దసరా సెలవులు ఇచ్చిన ఏపీ సర్కార్

మరోవైపు భక్తుల రాక నేపథ్యంలో టీటీడీ అధికారులకు ఈవో ధర్మారెడ్డి పలు సూచనలు చేశారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. క్యూ లైన్ లలో వేచి ఉన్న భక్తులకు  అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగలను టీటీడీ నిరంతరాయంగా అందించాలన్నారు. 

వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్లు, లగేజీ కౌంటర్లు, లడ్డూ కౌంటర్లు, అన్నప్రసాదం, రిసెప్షన్, కల్యాణకట్ట, ఆలయంలోపల క్యూ లైన్ల నిర్వహణ, చెప్పుల  స్టాండ్‌లు మొదలైన వాటి దగ్గర వివిధ షిఫ్టుల్లో దాదాపు 2500 టీటీడీ సిబ్బంది సేవలందిస్తున్నారు. వివిధ శాఖలు.. యాత్రికుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ.. సౌకర్యాలు కల్పిస్తున్నారు.