ఉద్యోగుల సమస్యలపై ఎంపీ గడ్డం వంశీకృష్ణను కలిసిన టీఎన్జీవో నాయకులు

ఉద్యోగుల సమస్యలపై ఎంపీ గడ్డం వంశీకృష్ణను కలిసిన టీఎన్జీవో నాయకులు

మంచిర్యాల, వెలుగు: జిల్లా కేంద్రంలోని ఐటీఐ సెంటర్ ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం విజిట్​చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించగా.. కేబినెట్ సబ్ కమిటీతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్ పాల్గొన్నారు.

బస్సు సౌకర్యం కల్పించాలి 

లక్సెట్టిపేట: చందారం, హనుమంతుపల్లి, రంగపేట గ్రామాలకు రెగ్యులర్ గా బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ లీడర్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కుమార్ దీపక్ ను కోరారు. శుక్రవారం లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ పరిధిలోని వెంకటేశ్వర కాటన్ మిల్లులో పత్తి కొనుగోలును పరిశీలించేందుకు వచ్చిన ఎంపీకి నాయకుడు తోట మల్లేశ్​ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు.

 మూడు గ్రామాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని మంచిర్యాల డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్తే.. రోడ్డుకిరువైపులా పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు ఉన్నాయని, వాటిని తొలగిస్తే బస్సు వేస్తామని చెప్పారన్నారు. ఎంపీ వంశీకృష్ణ సూచనతో కలెక్టర్ అక్కడే డిపో మేనేజర్ తో ఫోన్​లో మాట్లాడారు. రోడ్డు వెంట ఉన్న పిచ్చిమొక్కలు తొలగిస్తామని చెప్పగా.. బస్సు నడిపిస్తామని మేనేజర్​హామీ ఇచ్చారు.

స్టోన్​ డస్ట్​ ధర తగ్గించాలి

ఫ్లైయాష్ బ్రిక్స్ తయారీకి ఉపయోగించే స్టోన్ డస్ట్ ధర ఒకేసారి టన్నుకు 3 రెట్లు పెరగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫ్లైయాష్ బ్రిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. స్టోన్​డస్ట్​ధర తగ్గించేందుకు కృషి చేయాలని కోరుతూ శుక్రవారం ఎంపీ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.