సుధా చంద్రన్‌కు సారీ చెప్పిన సీఐఎస్ఎఫ్

సుధా చంద్రన్‌కు సారీ చెప్పిన సీఐఎస్ఎఫ్

న్యూఢిల్లీ: నాట్యమయూరి, నటి సుధా చంద్రన్‌కు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) క్షమాపణలు చెప్పింది. ఎయిర్‌పోర్ట్‌‌‌లో చెకింగ్ సమయంలో ప్రొస్థెటిక్ లింబ్ (కృత్రిమ కాలు)ను తీసి చూపించాలంటూ సీఐఎస్ఎఫ్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రధాని మోడీతోపాటు పలువురు నేతల దృష్టికి సుధా చంద్రన్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ సీఐఎస్‌ఎఫ్ ట్వీట్ చేసింది. ‘సుధా చంద్రన్‌కు కలిగిన అసౌకర్యానికి మేం క్షమాపణలు చెబుతున్నాం. ప్రోటోకాల్ ప్రకారం.. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ప్రొస్థెటిక్స్‌ తొలగించాలని భద్రతా సిబ్బందికి సూచించాలి. అయితే సుధా చంద్రన్‌ను ప్రొస్థెటిక్స్‌ను తీసేయమని ఆ మహిళా అధికారి ఎందుకు చెప్పారో తెలుసుకుంటాం. భవిష్యత్‌లో ప్రోటోకాల్స్ విషయంలో సున్నితంగా ఉంటూ.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా సిబ్బందికి అవగాహన కల్పిస్తాం’ అని సీఐఎస్‌ఎఫ్ ట్వీట్‌లో పేర్కొంది. 

అసలేం జరిగిందంటే.. 

కృత్రిమ అవయవదారులకు మన దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో జరుగుతున్న అవమానాలు, ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్తూ సుధా చంద్రన్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన లాంటి సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి.. తనిఖీల పేరుతో అధికారుల నుంచి వేధింపులు ఎదురవ్వకుండా చూడాలని మోడీని ఆమె కోరారు. కృత్రిమ అవయవాల్లో పేలుడు పదార్థాల వంటివి తీసుకొస్తారనే అనుమానం ఉంటుంది, కాబట్టి చెకింగ్స్ సమయంలో అభ్యంతరం లేదన్నారు. అయితే సీఐఎస్‌ఎఫ్ ఆఫీసర్లు తనిఖీ చేసే ప్రతిసారి కృత్రిమ కాలును చూపించాలని ఒత్తిడి తీసుకొస్తారని ఆమె వాపోయారు. దీనిపై తాజాగా సీఐఎస్‌ఎఫ్ స్పందించింది. ఆమెకు సారీ చెప్పింది. 

మరిన్ని వార్తల కోసం: 

సీఎంలకు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేదు: తమ్మినేని 

సీసీటీవీ ఫుటేజీ ఇస్తే దునియాకు నిజాలు చూపిస్తాం: ప్రకాశ్‌ రాజ్

పాక్‌తో మ్యాచ్‌‎కు టీమిండియాలో వీళ్లు ఉండాల్సిందే