ప్రియురాలితో సెటిలయ్యేందుకు.. ఫ్యామిలీని ఇంట్లనే పూడ్చిండు

V6 Velugu Posted on Sep 03, 2021

మూడేండ్ల తర్వాత పోలీసులకు దొరికిన నిందితుడు
ఉత్తరప్రదేశ్​లోని గ్రేటర్​ నోయిడాలో ఘటన

నోయిడా:ప్రియురాలితో సెటిలయ్యేందుకు ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు. అంతటితో ఆగకుండా లవర్​తో కలిసి మరో వ్యక్తిని హత్య చేశాడు. తల లేకుండా చేసి తన బట్టలు వేసి, అక్కడే ఐడీ కార్డు పడేసి తాను కూడా చనిపోయినట్లు అందరినీ నమ్మించాడు. వేర్వేరు పేర్లతో రాష్ట్రాలు తిరిగి ఎట్టకేలకు మూడేండ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్​లోని నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గ్రేటర్​నోయిడాకు చెందిన రాకేశ్(34)కు రత్నేశ్(27) అనే మహిళతో 2012లో వివాహం జరిగింది. వీరికి రెండు, మూడేండ్ల వయసు గల ఇద్దరు పిల్లలున్నారు. 2018లో రాకేశ్​గ్రేటర్​నోయిడాలోని ఓ ప్రైవేటు ల్యాబ్​లో పాథాలజిస్టుగా పని చేస్తున్నప్పుడు యూపీకి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్​పరిచయమైంది. వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే ప్రియురాలితో సెటిలయ్యేందుకు ఎలాగైనా భార్య, పిల్లలను వదిలించు 
కోవాలనుకున్నాడు. 
ఇంట్లోనే పాతి పెట్టి..
2018 ఫిబ్రవరి 14న భార్యను పిల్లలను చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు. తర్వాత తన భార్య, పిల్లలు కనిపించడంలేదంటూ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. అల్లుడిపై అనుమానంతో రత్నేశ్​ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు చోట్లా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా రాకేశ్ ​ప్రియురాలితో కలిసి కస్గంజ్‌‌‌‌లోని మరొకరిని హత్య చేశాడు. తల, చేతులు వేరు చేసి ఆ రెండింటినీ తగుల బెట్టాడు. తర్వాత శవానికి తన బట్టలు తొడిగాడు. అందరూ దాన్ని రాకేశ్ డెడ్​బాడీ అని అనుకోవాలని ఐడెంటి కార్డును కూడా అక్కడే వదిలేశాడు. ఆ డెడ్​బాడీకి పోలీసులు డీఎన్​ఏ పరీక్ష చేయించగా.. అది రాకేశ్​ది కాదని తేలింది. దీంతో రాకేశ్ కోసం గాలింపు చేపట్టారు. కాగా, రాకేశ్​ పోలికలతో  దిలీప్ శర్మ అనే పేరుతో ఓ వ్యక్తి హర్యానాలో ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా జంట హత్యల విషయం బయటపడింది. రాకేశ్​ ఇంట్లో బుధవారం తవ్వకాలు జరపగా రత్నేశ్, పిల్లల ఎముకలు బయటపడ్డాయి. ఈ మేరకు పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు.

Tagged murder, HOME, family, girlfriend, , Illicit relationship

Latest Videos

Subscribe Now

More News