V6 News

గూగుల్ లో 75 శాతం కోడింగ్ AI రాస్తుంది : సీఈవో సుందర్ పిచాయ్ వ్యాఖ్యలతో ఉద్యోగులు గజ గజ

 గూగుల్ లో 75 శాతం కోడింగ్ AI రాస్తుంది  : సీఈవో సుందర్ పిచాయ్ వ్యాఖ్యలతో ఉద్యోగులు గజ గజ

గూగుల్ తెలుసు కదా.. అయినా గూగుల్ తెలియని వాళ్లు ఎవరుంటారండీ.. మొన్నటి వరకు గూగుల్ కోడింగ్ అంతా ఉద్యోగులు చేసే వాళ్లు.. అదేనండీ మనుషులు.. ఇప్పుడు AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తోంది. ఇప్పుడు.. ఇవాల్టికి అంటే.. 2026, ఏప్రిల్ 23వ తేదీ నాటికి.. గూగుల్ లో 75 శాతం కోడింగ్ రాస్తుంది ఎవరో తెలుసా.. AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. AI రాస్తున్న కోడింగ్ ను ఉద్యోగులు జస్ట్ చెక్ చేస్తున్నారు.. కరెక్టా కాదా అని వెరిఫై చేస్తున్నారంట.. ఇది చెప్పింది ఎవరో కాదు.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. సీఈవో వ్యాఖ్యలతో ఉద్యోగులు గజగజ వణుకుతున్నారు. ఎందుకో తెలుసా.. గూగుల్ మొత్తంలో కోడింగ్ ఉద్యోగుల సంఖ్య 30 శాతం.. ఇందులో 75 శాతం AI చేస్తే.. కోడింగ్ ఉద్యోగులు పరిస్థితి ఏంటీ రాబోయే రోజుల్లో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది...

గత 18 నెలల్లో గూగుల్ సంస్థలో ఒక ఊహించని మార్పు వచ్చింది. ఒకప్పుడు ఇంజనీర్లకు కేవలం సహాయకారిగా ఉన్న ఏఐ (AI), ఇప్పుడు గూగుల్‌లో కోడ్ రాసే రైటర్ గా మారిపోయింది. లాస్ వెగాస్‌లో జరిగిన గూగుల్ క్లౌడ్ నెక్స్ట్ 2026 సదస్సులో సీఈఓ సుందర్ పిచాయ్ ఈ సంచలన విషయాలు వెల్లడించారు. గూగుల్‌లో ఇప్పుడు తయారవుతున్న కొత్త కోడ్‌లో 75 శాతం ఏఐ ద్వారానే రూపొందుతోంది. గత ఏడాది (2025) ఏప్రిల్‌లో ఇది కేవలం 30 శాతంగా ఉండగా, ఏడాది తిరగక ముందే 75 శాతం వరకు చేరుకోవడం విశేషం.

ఇప్పుడు గూగుల్ ఇంజనీర్లు కూర్చుని కోడ్ రాయడం కంటే, ఏఐ రాసిన కోడ్‌ను చెక్ చేయడం, అది సరిగ్గా ఉందో లేదో చూడటం వంటి పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అంటే, ఏఐ ఇప్పుడు ఒక 'ఇంజిన్' లాగా పని చేస్తుంటే, మనుషులు దానిని నడిపే 'డ్రైవర్లు'గా మారుతున్నారు.

ఈ కొత్త పద్ధతి వల్ల పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒక విధంగా గతంలో ఏడాది పట్టే ఒక క్లిష్టమైన ప్రాజెక్టును, ఇప్పుడు ఏఐ సాయంతో ఆరు రెట్లు వేగంగా పూర్తి చేశారు. యాపిల్ కంప్యూటర్ల (MacOS) కోసం జెమిని యాప్‌ను కేవలం కొన్ని రోజుల్లోనే ప్రోటోటైప్ రూపంలో రెడీ చేశారు.

ఇంజనీర్ల భవిష్యత్తు ఏంటి 
ఇంతలా ఏఐ కోడ్ రాస్తుంటే ఇంజనీర్ల అవసరం ఇక ఉండదా ? అన్న ప్రశ్నకు పిచాయ్ సానుకూలంగా స్పందించారు. ఏఐ అనేది ఇంజనీర్ల ఉద్యోగాలను తీసేయదని, కానీ వారి పని చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంజనీర్లు ఇప్పుడు చిన్న చిన్న కోడింగ్ లైన్లు రాయడం కంటే, పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఎలా నడిపించాలనే దానిపై దృష్టి పెడుతున్నారన్నారు.

సెర్చ్, యూట్యూబ్, ఆండ్రాయిడ్ వంటి ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్లను తయారు చేసే గూగుల్ సంస్థలోనే 75 శాతం కోడ్ ఏఐ రాస్తుందంటే, రాబోయే రోజుల్లో మొత్తం టెక్నాలజీ రంగం ఏ స్థాయిలో మారబోతుందో ఊహించవచ్చు.