Today OTT Movies: అఖండ 2 వాయిదాతో బోసిపోయిన థియేటర్స్.. ఓటీటీలో మాత్రం కొత్త సినిమాల హంగామా

Today OTT Movies: అఖండ 2 వాయిదాతో బోసిపోయిన థియేటర్స్.. ఓటీటీలో మాత్రం కొత్త సినిమాల హంగామా

ఈ శుక్రవారం (డిసెంబర్ 5) అఖండ 2 రిలీజ్ వాయిదా.. సినీ అభిమానులకి తీవ్ర నిరాశ మిగిల్చింది. చివరి నిమిషంలో సినిమా వాయిదా పడిందనే ప్రకటన.. బాలయ్య ఫ్యాన్స్ గుండెలని పిండేసింది. అప్పటివరకు బాలయ్య పోస్టర్స్, కటౌట్స్తో కళకళ మెరిసిన థియేటర్స్ ముఖాలు.. ఇప్పుడు పూర్తిగా బోసిపోయి కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో సగటు సినీ అభిమానులు కొత్త సినిమాలు లేక డిస్సపాయింట్ అవుతున్నారు. ఈ క్రమంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ మేమున్నాం అంటూ కొత్త సినిమాలను తీసుకొచ్చి కూల్ చేసే పనిలో పడింది. వీకెండ్ సందర్భంగా ఓటీటీలో కొత్త సినిమాలు దర్శనం ఇచ్చాయి. మరి ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమ్ అవుతున్నాయనేది ఓ లుక్కేద్దాం. 

రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీ:

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి కలిసి నటించిన చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్‌'. నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విభిన్నమైన ప్రేమకథగా ప్రశంసలు అందుకుంది. నవంబర్‌ 7న థియేటర్లలోకి వచ్చిన ఈమూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఇవాళ (డిసెంబర్‌ 5) నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. కేవలం తెలుగులోనే కాకుండా, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఇది అందుబాటులోకి వచ్చింది. 

కథేంటంటే?

పురుడుపోసుకోగానే తల్లిని పోగొట్టుకుంటుంది భూమా దేవీ (రష్మిక మందన్న). అమ్మప్రేమ తెలియని అన్నీ తానై నడిపిస్తాడు నాన్న (రావు రమేష్). తల్లిలేని బిడ్డ కావడంతో.. అడిగింది కాదనకుండా ఎంతో ప్రేమతో పెంచుతాడు తండ్రి రావు రమేష్. భూమా దేవీ కూడా చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా పెరుగుతుంది.

అలా థియేటర్ ఆర్ట్స్, లిటరేచర్‌పై భూమా దేవీ మక్కువ పెంచుకుంటుంది. దీంతో ఎప్పుడూ తండ్రి దగ్గరే ఉండే భూమా దేవీ ఫస్ట్ టైం తండ్రిని వదిలి పట్నం వస్తుంది. రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పీజీ MA లిటరేచర్లో జాయిన్ అవుతుంది.

ఈ క్రమంలోనే అదే కాలేజీలో ఉండే విక్రమ్ (దీక్షిత్ శెట్టి)తో భూమా ప్రేమలో పడాల్సి వస్తుంది. చదువు తప్ప వేరే ధ్యాస లేని భూమాదేవి.. అనూహ్య పరిస్థితుల్లో విక్రమ్తో ఎలా ప్రేమలో పడింది? ప్రేమలో పడటం వల్ల ఎలాంటి విక్రమ్తో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది?  వీరి మధ్య దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) పాత్ర ఏమిటీ?

ఒక ముద్దుతో మొదలైన విక్రమ్- భూమా దేవీల ప్రేమ.. హద్దులు ఎలా దాటింది? భూమాదేవి స్వేచ్ఛను హరించే ఆ ప్రేమ ఎలాంటిది? అసలు టాక్సిక్ రిలేషన్ అంటే ఏమిటీ? కూతురు భూమా దేవీ చేసే తప్పుడు పనితో.. తండ్రిగా రావు రమేష్ ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడు? చివరికి భూమా దేవి-విక్రమ్‌ల ప్రేమ కథ ఏమైంది? అనే తదితర విషయాలు తెలియాలంటే ‘ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌’ థియేటర్లో చూడాల్సిందే. 

'జటాధర' ఓటీటీ:

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, బాలీవుడ్ నటి  సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటించిన చిత్రం 'జటాధర'. ఈ డివోషనల్ హారర్ థ్రిల్లర్ నవంబర్ 7న విడుదలై నిరాశపరిచింది. నిధుల కోసం లంకె బిందెలు, వాటికి రక్షణగా 'పిశాచ బంధనం' అనే క్షుద్రశక్తి అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ ముందుకు వచ్చారు. కానీ, ఈ క్షుద్ర శక్తుల పోరాటం ఆడియన్స్కు ఏ మాత్రం థ్రిల్ ఇవ్వలేకపోయింది.

ఈ క్రమంలో 'జటాధర' నెలరోజుల లోపే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ (డిసెంబర్ 5) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి వచ్చింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది

కథాంశం..

దెయ్యాలు, ఆత్మలు లేవని, వాటిని కేవలం సైన్స్‌తోనే నమ్మాలని వాదించే ఘోస్ట్ హంటర్‌ శివ (సుధీర్‌ బాబు) చుట్టూ కథ తిరుగుతుంది. రుద్రారం అనే గ్రామంలో అనుమానాస్పద మరణం గురించి తెలుసుకున్న శివ, పరిశోధన కోసం అక్కడికి వెళ్తాడు. దెయ్యాలున్నాయని ప్రచారం జరిగే ఆ గ్రామానికి వెళ్లవద్దంటూ అతని తల్లిదండ్రులు (రాజీవ్ కనకాల, ఝాన్సీ) అడ్డుకుంటారు.

రుద్రారం గ్రామానికి, శివకి ఉన్న సంబంధం ఏమిటి? ఆ గ్రామంలో తిష్టవేసిన ధన పిశాచి (సోనాక్షి సిన్హా) ఎవరు? ఆమె వల్ల శివ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటి? తన గతం తెలుసుకున్న శివ, తన తల్లిదండ్రుల ఆత్మలకు శాంతి కలిగించడానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనేది కథాంశం.

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ OTT:

మసుధ ఫేమ్’తిరువీర్ హీరోగా రాహుల్ శ్రీనివాస్‌‌‌‌ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. టీనా శ్రావ్య హీరోయిన్‌‌‌‌గా నటించింది. '90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'లో నటించిన 'మాస్టర్' రోహన్ క్రేజీ పాత్ర పోషించాడు. సందీప్ అగ‌‌‌‌రం, అష్మితా రెడ్డి నిర్మించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా నవంబర్ 7న థియేటర్లోకి వచ్చి సూపర్ సక్సెస్ అయింది.  కమర్షియల్ హంగుల కోసం కాకుండా, మనిషి జీవితాల్లోని డ్రామా, కామెడీ, భావోద్వేగాల్లోని నిజాయతీ కలయికగా ఈ సినిమా రూపొంది బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్ 5న) మూవీ జీ5 ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. 

కథేంటంటే:

శ్రీకాకుళంలోని ఓ మారుమూల పల్లెటూరు. ఆ గ్రామంలో రమేష్ (తిరువీర్), జిరాక్స్ సెంటర్‌తో పాటు ఫోటో స్టూడియో నడిపిస్తుంటాడు. అలా ఆ ఊర్లో జరిగే పెళ్లిళ్లు, పేరంటాలు, ఫంక్షన్లకు ఫోటోలు, వీడియోలు తీస్తుంటాడు. ఇక అదే ఊర్లో, తన ఫోటో స్టూడియోకి ఎదురుగా  పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. అక్కడ పంచాయితీ సెక్రటరీగా ఉద్యోగం చేస్తున్నహేమ (టీనా శ్రావ్య)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. హేమకు కూడా రమేష్ అంటే ఇష్టమే ఉంటుంది. కానీ, ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకోకుండా ప్రేమించుకుంటారు.

అలా ఒకరోజు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఆనంద్ (నరేంద్ర రవి) రమేష్‌ను కలుస్తాడు. ఈ క్రమంలో తనకు సౌందర్య (యామిని నాగేశ్వర్)తో పెళ్లి సెట్ అయిందని చెబుతాడు. ఇందుకోసం తన పెళ్లికి ప్రీ వెడ్డింగ్ షూట్‌ను గ్రాండ్‌గా తీయాలని రమేష్ను ఆనంద్ కోరుతాడు. వెంటనే ఒకే చెప్పి.. దాదాపు రెండు లక్షలు ఖర్చుపెట్టించి గ్రాండ్గా ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు రమేష్. అయితే, ఆ ఫుటేజ్‌ అంత ఉన్న చిప్‌ను కాపీ చేయమని తన దగ్గర పనిచేసే అబ్బాయి (రోహన్ రాయ్)కి ఇస్తాడు. కానీ, అతను ఆ చిప్‌ను ఎక్కడో పొగొడతాడు.

ఊర్లో రాజకీయ బలగం ఉన్న ఆనంద్‌కి.. చిప్ పోయిందనే విషయం తెలిస్తే, తనని ఏదైనా చేస్తాడని రమేష్ భయపడుతాడు. ఈ క్రమంలో ఆనంద్‌కి ఏం చెప్పాలో తెలియక, తప్పించుకుంటూ ఉంటాడు. కాల్స్ చేసిన కట్ చేస్తుంటాడు. ఎలాగైనా ఈ గండం నుంచి బయటపడాలని ఒక ఉపాయం ఆలోచిస్తాడు. కానీ, అంతలోనే ఆనంద్ మ్యారేజ్ ఆగిపోయిందనే వార్తా వినిపిస్తుంది. అసలు చిప్ ఎలా మిస్ అవుతుంది? సడెన్గా పెళ్లి ఎందుకు ఆగిపోతుంది? రమేష్ ఆలోచించిన ఆ ఉపాయం ఏంటీ? రమేష్, హేమల లవ్ మ్యాటర్ ఎంతవరకు వస్తుంది? చివరకు ఆనంద్-సౌందర్యల పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే!!