ముగిసిన టోక్యో ఒలింపిక్స్: ఎక్కువ మెడ‌ల్స్ అమెరికావే.. ఈసారి ఇండియా రికార్డ్

ముగిసిన టోక్యో ఒలింపిక్స్: ఎక్కువ మెడ‌ల్స్ అమెరికావే.. ఈసారి ఇండియా రికార్డ్
  • మెడ‌ల్ టేబుల్‌లో మ‌న ప్లేస్ డ‌బుల్ డిజిట్‌లోనే..

టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. వాస్త‌వానికి 2020లోనే జ‌ర‌గాల్సిన విశ్వ క్రీడ‌లు.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డి ఈ ఏడాది జులై 23న మొద‌ల‌య్యాయి. ఆగ‌స్టు 8 వ‌ర‌కు 17 రోజుల పాటు జ‌రిగి విశ్వ క్రీడ‌ల సంగ్రామంలో ఎన్నో కొత్త మెరుపులు, రికార్డులు, వంద‌ల దేశాల భావోద్వేగాల‌కు వేదికైంది జ‌పాన్ రాజ‌ధాని టోక్యో. ఈ రోజు జ‌రిగిన ఒలింపిక్స్ ముగింపు వేడుక‌ల్లో భార‌త్ టీమ్ ముందుండి మ‌న జాతీయ జెండా ప‌ట్టుకుని న‌డిచే అదృష్టం రెజ్లర్ బ‌జ్‌రంగ్ పునియాకు ద‌క్కింది. మొత్తంగా టోక్యో ఒలింపిక్స్ మ‌న దేశానికి ఎన్నో మ‌ధురానుభూతుల‌ను, రికార్డుల‌ను మిగిల్చింది.

మ‌న అథ్లెట్స్ స‌రికొత్త రికార్డులు

ఈ సారి మ‌న అథ్లెట్లు గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా అత్య‌ధికంగా ఏడు మెడ‌ల్స్ సాధించారు. అలాగే వందేడ్ల చ‌రిత్ర‌లో తొలిసారిగా ఫీల్డ్ అండ్ ట్రాక్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ గెలిచారు. జావెలిన్ త్రో గేమ్‌లో ఫైన‌ల్‌కు చేరిన 12 దేశాల్లోనూ అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచి మ‌న యువ అథ్లెట్ నీర‌జ్ చోప్రా ఈ తొలి గోల్డ్ ఘ‌న‌త‌ను  మ‌న దేశానికి తెచ్చిపెట్టాడు. ఇక ఒలింపిక్స్ ఓపెనింగ్ రోజునే వెయిట్ లిఫ్ట‌ర్ మీరాబాయి చాను సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచి మ‌న ప్లేయ‌ర్ల‌కు స్ఫూర్తిదాయ‌కంగా నిలిచింది. ఇక ఒలింపిక్స్ చ‌రిత్ర‌లో 41ఏండ్ల త‌ర్వాత ఇండియా మెన్స్ హాకీ టైమ్ ప‌త‌కం గెలుచుకొచ్చింది. సెమీ ఫైన‌ల్స్‌కు వెళ్లిన‌ప్ప‌టికీ ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే బ్రాంజ్ మెడ‌ల్ కోసం జ‌రిగిన మ్యాచ్‌లో తిరుగులేని ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించారు మ‌న ప్లేయ‌ర్స్. కాంస్య ప‌త‌కంతో టోక్యో నుంచి విజ‌య‌గ‌ర్వం వెనుదిరిగారు. మ‌హిళా హాకీ టీమ్ మెడ‌ల్ సాధించ‌న‌ప్ప‌టికీ ఒలింపిక్స్ చ‌రిత్ర‌లోనే స‌రికొత్త రికార్డు సృష్టించారు. తొలిసారిగా ఇండియా విమెన్ హాకీ టీమ్ సెమీ ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లింది. అక్క‌డ ఓట‌మిని చ‌విచూసినా బ్రాంజ్ మెడ‌ల్ మ్యాచ్‌లో గెలుపు ఖాయ‌మ‌ని అనుకున్నారు. కానీ క‌సిగా పోరాడి కేవ‌లం ఒక్క గోల్ తేడాతో ఇంగ్లండ్ టీమ్ చేతిలో మ‌నోళ్లు ఓడిపోయారు. తీవ్ర‌మైన భావోద్వేగానికి లోనై మ‌న మ‌హిళా ప్లేయ‌ర్లు గ్రౌండ్‌లోనే కంట‌త‌డి పెట్టుకున్నారు. యావ‌త్ దేశం వాళ్ల ప‌ట్టుద‌ల‌, కృషిని, వాళ్లు సృష్టించిన కొత్త చ‌రిత్ర‌ను చూసి గ‌ర్వించింది. ఇక గోల్ఫ్‌లోనూ ఇదే ర‌క‌మైన ప‌రిస్థితి. మ‌న దేశం త‌ర‌ఫున తొలిసారి ఫైన‌ల్‌కు వెళ్లిన ప్లేయ‌ర్‌గా అదితి హిస్ట‌రీ క్రియేట్ చేసింది. ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ నాలుగో స్థానంలో నిలిచింది.

రెజ్లింగ్‌లో రెండు మెడ‌ల్స్.. న‌మ్మ‌కం నిల‌బెట్టిన సింధు

ఈసారి ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో మ‌న‌కు రెండు మెడ‌ల్స్ వ‌చ్చాయి. పురుషుల‌ 57 కిలోల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌లో ర‌వి కుమార్ ద‌హియా సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచాడు. ఇక పురుషుల 65కిలోల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో బ‌జ్‌రంగ్ పునియా కాంస్య ప‌త‌కం సాధించాడు. ఇక 2016 ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన  బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు ఈసారి భారీ అంచ‌నాల‌తో బ‌రిలో దిగింది. ఆమెపై యావ‌త్ దేశం పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిలబెట్టుకుంది. సెమీఫైన‌ల్‌కు చేరింది. కానీ చివ‌రికి కాంస్య ప‌త‌కంతో దేశంలో అడుగుపెట్టింది. వ‌రుస‌గా రెండు ఒలింపిక్స్‌లో మెడ‌ల్ సాధించిన తొలి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా సింధు రికార్డు సృష్టించింది. ఇక విమెన్స్ బాక్సింగ్‌లో ల‌వ్లీనా కాంస్య ప‌త‌కం సాధించింది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఒలింపిక్స్‌లో భార‌త్ ఏడు మెడ‌ల్స్ గెల‌వ‌డం ఇదే తొలిసారి.

కొత్త రికార్డులు సెట్ చేసిన అథ్లెట్స్

వంద‌లాది దేశాలు పాల్గొన్న టోక్యో ఒలింపిక్స్‌లో ఈ సారి అనేక దేశాలు కొత్త రికార్డుల‌ను నెల‌కొల్పాయి. ఎప్పుడూ లేనంత‌గా ఈసారి 83 దేశాలు వేర్వేరు ఈవెంట్ల‌లో ఫైన‌ల్స్‌కు వ‌చ్చాయి. అథ్లెట్లు మూడు కొత్త ప్ర‌పంచ రికార్డుల‌ను, 12 ఒలింపిక్ రికార్డుల‌ను, 28 ఏరియా రికార్డుల‌ను, 151 నేష‌న‌ల్ రికార్డుల‌ను పాత వాటిని బ్రేక్ చేస్తూ కొత్త రికార్డుల‌ను సెట్ చేశారు. 

టాప్ అమెరికా.. మ‌న ప్లేస్..

టోక్యో ఒలింపిక్స్‌లో అత్య‌ధిక మెడ‌ల్స్ గెలిచిన దేశంగా అమెరికా నిలిచింది. మొత్తం 113 ప‌త‌కాలు సాధించిన అగ్ర‌దేశం.. 39 బంగారు ప‌త‌కాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇక చైనా రెండో ప్లేస్‌లో నిలిచింది. మొత్తం 88 ప‌త‌కాల‌ను నెగ్గిన డ్రాగ‌న్ కంట్రీ, 38 గోల్డ్ కొల్ల‌గొట్టింది. ఏడు మెడ‌ల్స్ గెలిచిన భార‌త్ ఒలింపిక్స్ మెడ‌ల్స్ టేబుల్‌లో 48వ స్థానంలో నిలిచింది.