
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. 'బ్రహ్మాండం' మూవీ డైరెక్టర్ సండ్రు నగేష్ అలియాస్ రాంబాబు మరణించారు. నాలుగు రోజుల క్రితం తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గు కథ నేపథ్యంలో తీసిన 'బ్రహ్మాండం' మూవీ ప్రివ్యూ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించారు.
ఈ మూవీ ప్రివ్యూను చూస్తుండగా.. డైరెక్టర్ సండ్రు రాంబాబుకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే చిత్రబృందం రాంబాబును ఆసుపత్రికి తరలించారు. తొలుత అపోలో ఆసుపత్రికి, తర్వాత నిమ్స్కు తరలించి వైద్యులు చికిత్స అందించారు. కానీ, రాంబాబు పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్థరాత్రి (జులై 8న) కన్నుమూశారు. ఆయన అంత్యక్రియల్ని మెదక్ జిల్లా స్వగ్రామం అల్లీపూర్లో బుధవారం (జూలై9న) పూర్తి చేశారు.
రాంబాబుకు భార్య సరిత ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మెదక్ జిల్లా శివ్వం పేట మండలం అల్లీపూర్ నివాసి. తాను స్వయంగా డైరెక్ట్ చేసిన ‘బ్రహ్మాండ’ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ క్రమంలోనే విడుదలకు ముందే రాంబాబు చనిపోవడం విషాదాన్ని కలిగిస్తుంది. ‘బ్రహ్మాండ’మూవీలో ఆమని ప్రధాన పాత్ర పోషించింది. దాసరి మమత సమర్పణలో సురేష్ నిర్మించారు.
రాంబాబు సినీ ఇండస్ట్రీలో ఎంతోకాలంగా కొనసాగుతున్నారు. దాదాపు 150 సినిమాలు, 60 సీరియళ్లకుపైగా సహాయ దర్శకుడిగా పనిచేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన ‘అంతరంగాలు’, ‘అన్వేషణ’ వంటి ప్రముఖ సీరియళ్లకు ఆయన కో-డైరెక్టర్‌గా వ్యవహరించారు.
ALSO READ : హీరోగా మై విలేజ్ షో అనిల్ జీలా..
ఇలా ఉన్నట్టుండి 47 ఏళ్ల వయసులోనే రాంబాబు చనిపోవడం ఆయన కుటుంబంలో విషాదం నింపింది. ఇండస్ట్రీలో రాంబాబు సుదీర్ఘంగా పనిచేసినందుకు గానూ.. గవర్నమెంట్ లేదా సినీ పెద్దలు స్పందిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.