- ఐదేండ్లకు పర్మిషన్ ఇచ్చి మూడేండ్లు పన్ను మినహాయింపు
- విదేశీ మద్యం అమ్మకాలకే అనుమతులున్నా లోకల్ లిక్కర్ కూడా సేల్
- అనుమతి లేకున్నా నేరుగా విదేశాల నుంచి లిక్కర్ దిగుమతులు
- అక్రమాలపై కూపీలాగుతున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు : టానిక్ లిక్కర్ మార్ట్ అక్రమాలు తవ్విన కొద్దీ బయట పడుతున్నాయి. గత పదేండ్లలో బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తున్నది. రాత్రికి రాత్రి చీకటి జీవోలు జారీ చేసి.. రాష్ట్రంలో ఏ వైన్ షాపుకు లేనివిధంగా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేని పర్మిషన్లు ఇచ్చింది. ఈ విషయంలో గత ప్రభుత్వం రూల్స్‌కు పాతరేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టానిక్కు మూడేండ్లు పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి100 కోట్లకు పైగా గండి పడింది.
టానిక్ అక్రమాల బాగోతంలో గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వానికి రిపోర్టులు అందుతున్నాయి. టానిక్ లిక్కర్ మార్ట్‌కు పర్మిషన్ల వ్యవహారాన్ని మొత్తం గత సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించినట్లు ప్రస్తుత సర్కార్ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌రావు, ఆయన దూరపు బంధువు నవీన్‌రావు కూడా ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నట్లు ప్రభుత్వానికి రిపోర్టులు అందుతున్నాయి. ఓ ఐఏఎస్ఆఫీసర్, ఎక్సైజ్ మాజీ అధికారులు కూడా ఇందులో కీలకమైన వ్యక్తులుగా ఉన్నట్లు ఎక్సైజ్ ఆఫీసర్లు కొందరు తెలిపారు. అలాగే పలువురు బడాబాబుల వారసులు టానిక్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తున్నదని అన్నారు. అడ్డదారుల్లో గత బీఆర్ఎస్ సర్కార్ టానిక్ లిక్కర్ మార్ట్‌కు ఏ4 ఎలైట్ లైసెన్స్, పన్ను మినహాయింపులు ఇవ్వడంపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఫోకస్పెట్టింది. ఈ అక్రమాల్లో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై విచారణ జరిపి, చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది.
లైసెన్స్ ఫీజు దగ్గర్నుంచీ..!
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి ఆదాయం కోసం లిక్కర్‌పైనే ఆధారపడిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే 2016లో విదేశీ మద్యం అమ్మకాలపై కొత్త పాలసీని అప్పటి సీఎం కేసీఆర్ తయారు చేయించారని ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే, సాధారణ వైన్స్ షాపులకు టెండర్లను పిలిచినట్టుగా కాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఏ4 ఎలైట్ షాప్ లైసెన్సులను అప్పటి ప్రభత్వం ఇచ్చేసింది. సాధారణ వైన్స్‌కు లైసెన్స్ ఫీజు రూపంలో రూ.1.10 కోట్లు వసూలు చేయగా.. టానిక్కు కేవలం రూ.1.25 కోట్లు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించింది. అర్ధరాత్రి 2 గంటల వరకు సేల్స్‌కు అనుమతిచ్చి.. లైసెన్స్ ఫీజును ఇంత తక్కువగా పెట్టడం గమనార్హం. వైన్‌షాపులకు ప్రతి రెండేండ్లకోసారి రెన్యువల్ చేస్తుంటారు కానీ... టానిక్కు మాత్రం ప్రత్యేకంగా ఐదేండ్లకు అనుమతులు ఇచ్చారు.
పన్నుల్లోనూ మినహాయింపులు
ఆదాయం పెంపు పేరిట ఏ4 ఎలైట్షాప్ పర్మిషన్లు ఇచ్చామన్న గత సర్కార్.. వాస్తవంలో టానిక్కు మూడేండ్ల పాటు పన్ను మినహాయించింది. సాధారణ వైన్‌షాపులకు లైసెన్స్ ఫీజుపై ఏడు రెట్ల మద్యం అమ్మకాలు జరిగితే.. మరో 13.6 శాతం అదనపు ట్యాక్స్ వసూలు చేస్తారు. టానిక్కు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి టానిక్ దాదాపు రూ.వంద కోట్ల దాకా గండి కొట్టేలా సహకరించారు. అయితే, టానిక్ సంస్థకు మాత్రం ఆరేండ్లలోనే రూ.వెయ్యి కోట్ల దాకా ఆదాయం సమకూరిందని ఐటీ రెయిడ్స్‌లో తేలినట్లు సమాచారం. విదేశీ మద్యాన్ని నేరుగా ఇంపోర్ట్ చేసుకునే అనుమతులు టానిక్కు లేవు. కానీ, టానిక్ మార్ట్ మాత్రం నేరుగా విదేశీ మద్యాన్ని దిగుమతి చేసుకుని అమ్మకాలు జరిపింది. ఈ వెసులుబాటు కేవలం అనుమతి ఉన్న కొన్ని స్టార్ హోటళ్లకు ఉంటుందని కొందరు నిపుణులు చెప్తున్నారు. రిటెయిల్గా అమ్మాలనుకునేటోళ్లు మాత్రం కచ్చితంగా బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ రూల్‌ను టానిక్ మార్ట్ తుంగలో తొక్కింది. ఇక విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్మాల్సి ఉన్నా.. లోకల్ లిక్కర్ కూడా సేల్చేశారు. వైన్ షాప్ ఉన్న డిపో పరిధి నుంచే మద్యాన్ని తెచ్చుకోవాల్సి ఉన్నా.. 18 డిపోల నుంచీ లిక్కర్‌ను తెచ్చుకునే వెసులుబాటునూ టానిక్కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించడం గమనార్హం.
రెండని.. ఒక్కదానికే పర్మిషన్
విదేశీ మద్యం అమ్మకానికి సంబంధించి పాలసీని రూపొందించేటప్పుడు రెండు ఏ4 ఎలైట్ వైన్ మార్ట్‌లకు అనుమతులివ్వాలని గత బీఆర్ఎస్ సర్కార్‌లో అధికారులు నిర్ణయించారు. కానీ, అప్పటి ప్రభుత్వ పెద్ద ప్రమేయంతో ఒక్క టానిక్కు మాత్రమే అనుమతులిచ్చారు. రెండో షాపుకు అనుమతులివ్వడానికే సంకోచించిన గత ప్రభుత్వం.. టానిక్ పలు చోట్ల సబ్ మార్ట్లను తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ‘క్యూబై టానిక్’ పేరిట 11సబ్ మార్టులను టానిక్ తెరిచింది. వాటికి టానిక్‌లో పనిచేసే ఉద్యోగుల పేరిట లైసెన్సులను తీసుకున్నట్టుగా తెలుస్తున్నది.
ప్రశ్నిస్తే గొంతు నొక్కేసిన్రు
టానిక్ మార్ట్‌లో బడాబాబులు, వారి వారసులు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తున్నది. ఎంపీ సంతోష్ రావు, నవీన్‌రావుకు టానిక్‌లో పెట్టుబడులున్నాయని ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వారికి తోడు ఓ ఐఏఎస్ ఆఫీసర్ కూతురు కూడా టానిక్‌లో పెట్టుబడి పెట్టినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఎక్సైజ్ అధికారి, ఓ పోలీసు అధికారి పాత్ర కూడా ఉందని తెలుస్తున్నది. టానిక్కు అడ్డగోలు పర్మిషన్లపై గతంలో ప్రశ్నించిన వైన్స్ డీలర్ అసోసియేషన్ నాయకులను అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు వ్యక్తులు బెదిరించినట్లు సమాచారం. చీకటి జీవోలతో అక్రమంగా అనుమతులిచ్చారంటూ కోర్టుకు వెళ్తే.. అలా వెళ్లిన వారి వైన్ షాపులను మూసివేయించినట్లు బయటకు వస్తున్నది. ప్రశ్నించినందుకు కొందరి వైన్ షాపులను మూసివేయడమే కాక.. ఇంకొందరికి అదనపు ట్యాక్స్‌లు వేయడం, జరిమానాలు విధించడం వంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డట్టు తెలుస్తున్నది. టానిక్‌లో అప్పటి అధికార పార్టీకి కావాల్సిన నేతలుండడం వల్లే.. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని తెలుస్తున్నది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తాము చేశాం తప్ప సొంతంగా పాలసీ డెసిషన్ తీసుకోలేదని ఎక్సైజ్ శాక మాజీ అధికారులు చెప్తున్నారు.
కోర్టుకెళ్లినందుకు వేధించిన్రు
టానిక్ లిక్కర్ మార్ట్ వ్యవహారంలో అడుగడుగునా అక్రమాలు జరిగాయి. లైసెన్స్ ఫీజు మామూలు వైన్స్ ఫీజు కన్నా కేవలం రూ.15 లక్షలే ఎక్కువ పెట్టారు. ఆ సంస్థకు మూడేండ్లు పన్ను మినహాయింపు ఇచ్చారు. అర్ధరాత్రి 2 గంటల దాకా సేల్స్‌కు అనుమతులిచ్చి.. పైగా ఇలాంటి మినహాయింపులివ్వడం ఏమిటి? మాకేమో రెండేండ్లకే రెన్యువల్.. టానిక్కు మాత్రం ఐదేండ్ల వరకు అనుమతులా? దీనిపై మేము అప్పటి ఎక్సైజ్ అధికారులను కలిస్తే ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారన్నారు. కోర్టుకెళ్లిన వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. సోమేశ్ కుమార్ సహా కొందరు అధికారులు మాపై కక్షగట్టారు. లేనిపోని కేసులు పెట్టి కొన్నాళ్లు షాపులను మూయించారు.
-వెంకటేశ్వర్ రావు, వైన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
