మామూలోడు కాదు : ట్రాఫిక్ జాం అయ్యిందని.. నదిలో నుంచి వెళ్లిన కారు

మామూలోడు కాదు : ట్రాఫిక్ జాం అయ్యిందని.. నదిలో నుంచి వెళ్లిన కారు

ట్రాఫిక్ జాం అయితే ఏం చేస్తాం.. వెయిట్ చేస్తాం.. అవకాశం ఉంటే గల్లీల నుంచి వెళతాం.. అదీ కుదరకపోతే ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు అలాగే రోడ్డుపై వెయిట్ చేస్తాం.. ఈ కారోడు మాత్రం అస్సలు తగ్గలేదు.. గంటలకొద్దీ ట్రాఫిక్ జాం అయ్యిందని.. ఏ మాత్రం వెయిట్ చేయలేకపోయాడు.. పక్కనే ఉన్న నదిలో నుంచి వెళ్లిపోయాడు.. అవును.. మీరు ఇప్పటి వరకు ఊహించి ఉండరు.. వీడు మాత్రం ఇలాగే చేశాడు.. హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

వరస సెలవులు కారణంగా పర్యాటక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కిటకిటలాడింది. వాహనాలతో ట్రాఫిక్ జాం అయ్యింది. డిసెంబర్ 22 నుంచి ఇదే పరిస్థితి.. ఈ క్రమంలోనే ఓ SUV వాహనదారుడు.. ట్రాఫిక్ నుంచి తప్పించుకుని.. తాను వెళ్లాలనుకున్న ప్రదేశానికి వెళ్లటానికి చంద్ర నది దాటితే సరిపోతుంది అనుకున్నాడు.. నదిలో నీళ్లు కూడా తక్కువగా ఉన్నాయి.. ప్రవాహం చాలా చిన్నగా ఉంది. ఇంకేముందీ.. తన కారును నదిలోకి దించేశాడు. నదిలోనే అర కిలోమీటర్ జర్నీ చేసి.. ట్రాఫిక్ రద్దీని తప్పించుకుని వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

లాహౌల్, స్పితి కొండ ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేయటానికి స్థలం లేక.. రోడ్లపైనే కార్లు, బస్సులను నిలిపివేశారు. దీంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ క్రమంలోనే ఈ వాహనదారుడు ఈ పని చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. వీడియో ఆధారంగా కారును గుర్తించామని.. చలానా విధించినట్లు వెల్లడించారు ఆ జిల్లా ఎస్పీ మయాంక్. ఇలాంటి ప్రయోగాలు ఎవరు చేసినా కఠినంగా శిక్షిస్తామని.. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఇలాగే వ్యవహరించే అవకాశం ఉందని.. వాహనదారులు ఇలాంటి పనులు చేస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.