మ్యూజిక్ ఫౌంటెయిన్ చూసేదెన్నడో?.. ప్రారంభించిన కొద్దిరోజులకే బంద్

మ్యూజిక్ ఫౌంటెయిన్ చూసేదెన్నడో?.. ప్రారంభించిన కొద్దిరోజులకే బంద్
  • ముందుకు సాగని తరలింపు పనులు
  • 10 నెలల కిందట హుస్సేన్​సాగర్​లో ప్రారంభం
  • రూ. 21 కోట్లతో ఏర్పాటు చేసిన హెచ్ఎండీఏ
  • సందర్శకుల రద్దీ కారణంగా ట్రాఫిక్ ​ప్రాబ్లమ్స్
  • పీపుల్స్​ప్లాజా వద్దకు తరలించేందుకు నిర్ణయం
  • ఇంకా పనులు చేపట్టకపోగా పర్యాటలకు నిరాశ
  • కొత్త ప్రభుత్వమైనా త్వరగా ప్రారంభించాలంటున్న అధికారులు, సందర్శకులు

హైదరాబాద్, వెలుగు: హుస్సేన్​సాగర్​లో అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెయిన్ మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. దేశంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద ఫౌంటెయిన్​ను రూ.17.2 కోట్లతో హెచ్ఎండీఏ కొనుగోలు చేసింది.  గత ఫిబ్రవరిలో  సాగర్ లో అమర్చడానికి మరో రూ. 3 కోట్లు ఖర్చు చేసి ప్రారంభించింది. దీంతో పండగలు, సెలవు రోజుల్లో ట్యాంక్ బండ్ కు వచ్చే పర్యాటకులను మ్యూజిక్ ​ఫౌంటెయిన్​ ఎంతో ఆకట్టుకుంది. పిల్లలు, పెద్దలు కేరింతలు కొడుతూ ఆనందించేవారు. దాన్ని చూసేందుకే భారీగా సందర్శకులు తరలివచ్చేవారు. కొద్ది రోజులకే ఫౌంటెయిన్​ను అధికారులు తొలగించారు. కిలో మీటరు దూరంలోని పీపుల్స్ ​ప్లాజా వద్ద ఏర్పాటుకు నిర్ణయించారు. అయినా.. ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ట్యాంక్ బండ్ కు వచ్చే సందర్శకులు హెచ్ఎండీఏ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్​ జామ్ ​పేరుతో తొలగింపు

సెక్రటేరియట్​ఎదురుగానే లుంబినీ పార్క్​ఉండడంతో మ్యూజికల్​ ఫౌంటెయిన్​ను  చూసేందుకు వేలల్లో  సందర్శకులు వస్తుండగా తీవ్ర ట్రాఫిక్ ​జామ్​ అవుతోంది. దీంతో  ఫౌంటెయిన్​ను ఇక్కడి నుంచి తరలించి నెక్లెస్​రోడ్​లోని పీపుల్స్​ ప్లాజా వద్ద ఏర్పాటుకు నిర్ణయించారు. దీనికి మరో రూ. 5 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. దాదాపు పది నెలలుగా పనులను ప్రారంభించడం లేదు.

దేశంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్

ఐకానిక్ ఫీచర్‌తో దేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద ఫౌంటెయిన్ ఇది. అద్భుతమైన టెక్నాలజీతో నిర్మించారు. ఫౌంటెయిన్‌ 180మీ పొడవు, 10మీ వెడల్పు, 90మీ ఎత్తు ఉంటుంది.  ఫౌంటెయిన్‌లో 3 సెట్ల లేజర్ ఉండి వివిధ థీమ్‌లను చూపుతుంది.  ఫౌంటెయిన్‌లో పొగమంచు ఫెయిరీ ఫాగ్ కూడా అమర్చారు. మ్యూజిక్​తో  ప్రతిరోజూ  రాత్రి 7 నుంచి 10 గంటల వరకు ఫౌంటెయిన్ లైటింగ్​తో ప్రతి 20 నిమిషాలకు3 షోలు వేసేవారు.  వీకెండ్ , పబ్లిక్ హాలిడేల్లో సందర్శకులను ఆకర్షించేది. ప్రస్తుతం మ్యూజిక్​ ఫౌంటెయిన్ ​మూలన పడింది.

మళ్లీ ప్రారంభిస్తే ..

రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడగా.. టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.  ట్యాంక్ బండ్, ఎన్టీఆర్​గార్డెన్, లుంబినీ పార్క్​ వంటి ప్రాంతాలను  చూసేందుకు ప్రతి రోజూ భారీగా పర్యాటకులు వస్తుంటారు. మ్యూజికల్​ ఫౌంటెయిన్​ను ​తిరిగి పునరుద్ధరిస్తే సందర్శకుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని అధికారులు చెబుతున్నారు.  దీనిపై కొత్త ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేయాలని సందర్శకులు కూడా కోరుతున్నారు.