
- కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం, బీఆర్ఎస్కు సవాల్
- అధికారమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్న సీపీఐ
- క్యాంపెయినింగ్ లో సంఘాల ఎత్తులు, పైఎత్తులు
భద్రాద్రి కొత్తగూడెం/కోల్‌బెల్ట్, వెలుగు : ఈనెల 27న సింగరేణిలో ఏడోసారి జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం కోసం కార్మిక సంఘాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. కార్మికులను ఆకట్టుకోవడానికి ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. ఈసారి ఎలాగైనా గుర్తింపు హోదా దక్కించుకోవాలని కోల్‌బెల్ట్‌లో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ గుర్తింపు సంఘం ఎన్నికలు అధికార కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు సవాల్‌గా మారాయి. అధికారమే లక్ష్యంగా సీపీఐ ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా.. ఇతర సంఘాలు కూడా దీటుగా ముందుకు సాగుతున్నాయి. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనుండడంతో సింగరేణి వ్యాప్తంగా మైన్స్, డిపార్ట్మెంట్లలో ప్రచారం రోజురోజుకు హోరెత్తుతోంది. కోల్ మైన్లలో ఎక్కడచూసినా గుర్తింపు సంఘం ఎన్నికలపైనే చర్చ సాగుతోది.
గెలుపు జోష్ లో ఐఎన్ టీయూసీ
సింగరేణి వ్యాప్తంగా 39,809 మంది ఎన్సీడబ్ల్యూఏ కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించి 84 పోలింగ్ కేంద్రాలు, 11 చోట్ల కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ఉధృతం అవుతున్న వేళ సింగరేణి ఆస్తులపై ఇష్టారాజ్యంగా పోస్టర్లు వేయడం, పెయింటింగ్స్ రాయడం వంటివి నిషేధమని యాజమాన్యం సోమవారం సర్క్యులర్ జారీ చేసినా కార్మిక సంఘాలు పట్టించుకోవడం లేదు. సింగరేణిలో ఇప్పటి వరకు జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో మూడుసార్లు ఏఐటీయూసీ, రెండుసార్లు టీబీజీకేఎస్, ఒకసారి ఐఎన్టీయూసీ విజయం సాధించాయి.
ఈసారి జరిగే ఎన్నికల్లో కార్మికులు ఎవరికి గుర్తింపు ఇవ్వనున్నారో మరో రెండు వారాల పాటు వేచి చూడాలి. నిన్న మొన్నటి వరకు సింగరేణిలో గుర్తింపుసంఘంగా ఉన్న బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ను ఈ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, దాని అనుబంధ ఐఎన్టీయూసీతో పాటు ఇటు సీపీఐ, దాని అనుబంధ ఏఐటీయూసీ, ఇతరత్రా యూనియన్లు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్ ఏరియాలో కాంగ్రెస్ కు ప్రజలు భారీ విజయం అందించి, బీఆర్ఎస్ కు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తన అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించి సత్తా చాటాలని చూస్తోంది.
బెల్లంపల్లి ప్రాంతంలో సింగరేణిలో అత్యధిక సింగరేణి కార్మిక ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో విజయం కోసం ఐఎన్టీయూసీ నేతలు.. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు గుర్తింపుసంఘంగా ఉన్న బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకుంది.
అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. కనీసం సింగరేణిలో గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్ ను గెలిపించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత ఇటీవలి కాలంలో ఏరియాలవారీగా యూనియన్ నేతలతో హైదరాబాద్ లో మీటింగ్ నిర్వహించారు. యూనియన్ గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని కార్మిక సంఘం నేతలకు ఆమె సూచించారు. ఇక రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సింగరేణి ప్రధాన కార్యాలయం ఉన్న కొత్తగూడెం నియోజకవర్గాన్ని గెలుచుకున్న సీపీఐ తమ అనుబంధ సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ను గెలిపించి కోల్ బెల్ట్ లో పట్టు నిలుపుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది.
కొత్తగూడెం ఎమ్మెల్యే సీటును గెలుచుకున్న ఊపులో ఏఐటీయూసీకి సింగరేణిలో పూర్వ వైభవం తేవడమే తమ ప్రధాన లక్ష్యమని సీపీఐ నేతలు పేర్కొంటున్నారు. మరో వైపు సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కూనంనేని సాంబశివరావు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా కూడా ఉండడంతో ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
ఎవరికి వారే ప్రచారం
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకున్నాయి. పొత్తు కలిసొచ్చిందంటూ ఇరు పార్టీల నేతలు పేర్కొంటున్న వేళ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు గుదిబండగా మారాయి. ఆ రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా, వేర్వేరుగానా అన్న చర్చ సింగరేణి వ్యాప్తంగా జరుగుతోంది. ప్రస్తుతం కార్మిక సంఘాలు ఇండిపెండెంట్‌గా ఎవరికి వారే బొగ్గు గనులపై ప్రచారం చేస్తున్నాయి. ఇరు పార్టీల అనుబంధ సంఘాలైన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ వేర్వేరుగా ప్రచారం నిర్వహిస్తుండడంతో సింగరేణి ఎన్నికల్లో పొత్తు ఉంటుందా లేదా అన్న అనుమానం కార్మికుల్లో నెలకొంది.
అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం కలిసి పనిచేసిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ లీడర్లు గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో మాత్రం పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇతర సంఘాలు సొంత అజెండాతో ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే సమస్యలన్నీ తీరుస్తామని ఎదుటి పక్షంలో ఉన్న లోపాలను ఎకరవు పెడుతు ముందుకు సాగుతున్నాయి. ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. ఆదివారం వచ్చిందటే గనుల వారీగా కార్మికులను సమీకరించి సమావేశం పేరిట ఒక్కో గనిలో ఒక్కో సంఘం విందు ఏర్పాటు చేయడం మొదలైంది. ఖర్చు భరించలేని సంఘాలు ప్రచారంలో వెనుకబడిపోతున్నాయి