నీట మునిగిన నౌక..22 మంది మృతి

నీట మునిగిన నౌక..22 మంది మృతి
  • మరో 51 మంది ఆచూకీ గల్లంతు
  • మరో 185 మందిని కాపాడిన నావికాదళం
  • తౌక్టే తుపాను తీరం దాటుతున్న సమయంలో లంగరు ఊడి సముద్రంలో కొట్టుకుపోయిన నౌక
  • పి.305 వ్యాపార నౌకలో 261 మంది సిబ్బంది ఉండగా ఘటన
  • ముంబైకి 35 నాటికల్ మైళ్ల దూరంలో మునుగుతూ కనిపించిన నౌక
  • రంగంలోకి దిగి 185 మందిని కాపాడిన నావికాదళం
  • 22 మృతదేహాలను ఒడ్డుకు చేర్చిన నావికాదళం
  • గల్లంతైన మరో 51మంది కోసం కొనసాగుతున్న గాలింపు

  ముంబయి: తౌక్టే తుపాన్‌ తీరం దాటుతున్న సమయంలో కొట్టుకుపోయిన రెండు నౌకల్లో ఒక నౌక ముంబయి తీర ప్రాంతంలో మునిగిపోయింది. ఈ నౌక సముద్రంలోకి కొట్టుకుపోయిన సమయంలో నౌకలో 261 మంది ఒఎన్‌జిసి ఉద్యోగులు ఉన్నారు. వెంటనే రంగంలోకి దిగన నావికా దళం నౌకలో ఉన్న 185 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా మరో 51 మంది ఆచూకీ కనిపించడం లేదు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా 22 మంది మృతదేహాలను సముద్రంలో నుండి ఒడ్డుకు తీసుకొచ్చారు. తౌక్టే తుపాను నిన్న సాయంత్రం ముంబయి తీర ప్రాంతానికి సమీపం నుండి వెళ్లడంతో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీగా అలలు ఎగసిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో అలల ఉధృతి గంటకు 180 కిలోమీటర్లుగా నమోదైంది. ఈ ప్రభావంతో బాంబే హై ప్రాంతంలోని ఓఎన్జీసీ చమురు క్షేత్రం వద్ద పి.305 అనే భారీ నౌకతోపాటు మరో రెండు నౌకలు, ఒక ఆయిల్ రిగ్ లంగరు ఊడిపోయి సముద్రంలోకి కొట్టుకుపోయాయి. అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో నావికాదళం యుద్ధ నౌకలతో సహాయక చర్యలు చేపట్టింది. 

ముంబైకి 35 నాటికల్ మైళ్ల దూరంలో పి.305 బార్జ్‌ మునుగిపోతున్న దశలో కనిపించింది. దీంతో బలగాలన్నీ పంపి 185 మందిని హుటాహుటిన ఒడ్డుకు చేర్చారు. 22 మంది చనిపోవడంతో వారి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మరో 51 మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నామని, తుపాను ప్రభావంతో సముద్రంలో వాతావరణం కఠినంగా ఉండడం వల్ల సహాయక చర్యల్లో ఒకింత ఆలస్యం అవుతోందని   పశ్చిమ నావల్‌ కమాండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ చీఫ్‌ మెహుల్‌ కర్ణిక్‌ తెలిపారు. తేగ్‌, బెత్వా, బియాస్‌ నౌకలు, పి8ఐ విమానం, సీ హెలికాఫ్లర్లతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని ఆయన చెప్పారు.