జార్ఖండ్​లో పట్టాలు తప్పిన రైలు: ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు

జార్ఖండ్​లో పట్టాలు తప్పిన రైలు: ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు
  •   హౌరా నుంచి ముంబై వెళ్తుండగా ప్రమాదం
  •   చక్రధర్​పూర్ ​రైల్వే డివిజన్​లో ఘటన
  •   కొద్ది దూరంలోనే పట్టాలు తప్పిన మరో గూడ్స్ ​రైలు

రాంచీ: జార్ఖండ్​లో జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు చనిపోగా, 20 మంది వరకు గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో సెరైకెలా – ఖర్సవాన్ జిల్లాల మధ్య ఈ ఘటన జరిగింది. హౌరా నుంచి ముంబై వెళ్తున్న ట్రైన్ పట్టాలు తప్పింది. దీంతో 18 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. 

వీటిలో 16 బోగీలు ప్రయాణికులవి అని, ఒకటి ప్యాంట్రీ కార్, మరొకటి పవర్ కార్ కోచ్​లు అని రైల్వే అధికారులు ప్రకటించారు. చక్రధర్​పూర్ డివిజన్​లోని బరంబంబూ వద్ద ట్రైన్ పట్టాలు తప్పింది. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని సౌత్ ఈస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. 

ఈ ఘటనపై ఎంక్వైరీకి ఆదేశించామన్నారు. ప్రమాదానికి గురైన ట్రైన్​లోని ప్రయాణికులను బస్సుల్లో చక్రధర్​పూర్ రైల్వే స్టేషన్​కు తరలించామని చెప్పారు. కాగా, ఘటనా స్థలానికి కొంతదూరంలో గూడ్స్‌‌ ‌‌   రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు ప్రమాదాలూ ఒకేసారి జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని చెప్పారు. రైలు ప్రమాదం హౌరా–టిట్లాగఢ్‌‌ ‌‌  –కాంటాబాంజీ ఇస్పత్‌‌ ‌‌   ఎక్స్‌‌ ‌‌  ప్రెస్‌‌ ‌‌  , హౌరా–బార్బిల్ జనశతాబ్ది ఎక్స్​ప్రెస్​ను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అదేవిధంగా, పలు రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. 

మృతుల కుటుంబాలకురూ.10లక్షల ఎక్స్​గ్రేషియా

రైల్వే అధికారులతో జార్ఖండ్​ సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రైల్వే శాఖ రూ.10లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు అందిస్తామని తెలిపింది. ప్రమాదానికి గురైన ట్రైన్​లోని ప్రయాణికుల కోసం చక్రధర్​పూర్ స్టేషన్ నుంచి స్పెషల్ రైలు ఏర్పాటు చేసి ముంబైకి పంపించామని వివరించింది.