నల్గొండ పోలీస్ స్టేషన్​లో గిరిజనుడు మృతి

నల్గొండ పోలీస్ స్టేషన్​లో గిరిజనుడు మృతి
  •     నల్గొండ జిల్లా చింతపల్లిలో ఘటన
  •      భూ వివాదం కేసులో విచారణకు తీసుకొచ్చిన పోలీసులు 
  •     ఎస్ఐ కొట్టడం వల్లే చనిపోయాడని బంధువుల ధర్నా

దేవరకొండ (నల్గొండ), వెలుగు: నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్​లో ఓ గిరిజనుడు చనిపోయాడు. భూ వివాదం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎస్ఐ సతీశ్ రెడ్డి విపరీతంగా కొట్టడంతోనే చనిపోయినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. చింతపల్లి మండలం పాలెం తండాకు చెందిన నేనావత్ సూర్య (60)కు తన సోదరుడితో భూ తగాదాలు ఉన్నాయి. దీంతో నేనావత్ సూర్యపై అతని సోదరుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో కేసు రిజిస్టర్ అయింది. ఎంక్వైరీ కోసం నేనావత్ సూర్యను ఎస్ఐ సతీశ్ రెడ్డి ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్​కు పిలిపించి సాయంత్రం దాకా కూర్చోపెట్టాడు.

తర్వాత సూర్యను సతీశ్​రెడ్డి లోపలికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సూర్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు, బయట ఉన్న అతని బంధువుల సాయంతో సూర్యను దేవరకొండ సర్కార్ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అయితే, అతను అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు కొట్టడంతోనే సూర్య చనిపోయాడంటూ మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డెడ్​బాడీని పోస్ట్​మార్టం కోసం తరలించకుండా అడ్డుకున్నారు. హాస్పిటల్ ఎదుట మెయిన్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. పోలీసు అధికారులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎస్​ఐ సతీశ్ రెడ్డిని హెడ్ క్వార్టర్​కు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.