వికారాబాద్ జిల్లా జీడిగడ్డ తాండా దగ్గర ఉద్రిక్తత

వికారాబాద్ జిల్లా  జీడిగడ్డ తాండా దగ్గర ఉద్రిక్తత

వికారాబాద్ జిల్లా పరిగి మండలం జీడిగడ్డ తాండా దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.భూమిని పరిశీలించేందుకు రాత్రి సమయంలో వచ్చిన ఆర్డీవో, ఎమ్మార్వోలను గిరిజనులు అడ్డుకున్నారు. గిరిజన మహిళలు కర్రలతో వచ్చి ఆర్డీవో, ఎమ్మార్వో వాహానాలకు అడ్డుగా నిలబడ్డారు. రాత్రివేళ వచ్చి భూములు పరిశీలించడంపై తాండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ భూములను ఎలా పరిశీలిస్తారని రైతులు నిలదీశారు. కొన్నేళ్లుగా ఇవే భూముల్లో వ్యవసాయం చేస్తున్నామని.. రాత్రి పూట వచ్చి వేరొకరివి అని ఎలా చెబుతారని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు గంటసేపు రెవెన్యూ అధికారుల వాహానాలను కదలనివ్వకుండా అడ్డుగా నిలబడ్డారు. 

సర్వే నంబర్ 51,62 లోని సుమారు 10 ఎకరాల భూమి విషయంలో కోర్టు కేసు ఉందని  రెవిన్యూ అధికారులు తాండావాసులకు వివరించే ప్రయత్నం చేశారు. కేవలం భూమిని పరిశీలించేందుకు మాత్రమే వచ్చామని....రేపు కోర్టు వాదనలు ఉన్నందున హడావుడి గా రావలసి వచ్చిందని స్పష్టం చేశారు. తమ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదంటూ గిరిజనులు హెచ్చరించించారు.