టీఆర్​ఎస్​ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య

టీఆర్​ఎస్​ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య
  • ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో టీఆర్​ఎస్​ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య
  • ఆధిపత్య పోరు, పాత కక్షలే కారణం
  • కత్తులతో నరికి చంపిన దుండగులు
  • హత్య వెనుక తమ్మినేని వీరభద్రం తమ్ముడు కోటేశ్వరరావు ఉన్నారని స్థానికుల ఆగ్రహం
  • కోటేశ్వరరావు ఇంటిపై దాడి.. 
  • కారు, బైక్​, ఇంట్లోని వస్తువుల ధ్వంసం
  •  వీరభద్రానికి మృతుడు బాబాయి కొడుకు

ఖమ్మం / ఖమ్మం రూరల్, వెలుగు: ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో నడిరోడ్డుపై దుండగులు టీఆర్ఎస్​ నేత, టేకులపల్లి సహకార సంఘం డైరెక్టర్​ తమ్మినేని కృష్ణయ్యను నరికి చంపారు. సోమవారం ఉదయం పొన్నేకల్ నుంచి టూవీలర్​ మీద ఇంటికి వెళ్తున్న కృష్ణయ్యను ఆటోతో ఢీకొట్టారు. బైక్​ పైనుంచి పడిన ఆయనను ఆటోలో వచ్చిన వ్యక్తులు కత్తులు, తల్వార్లతో  హత్యచేశారు. తెల్దారుపల్లి.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంతూరు. ఆయనకు కృష్ణయ్య స్వయాన బాబాయి కొడుకు. హత్యకు కారణమనే అనుమానంతో వీరభద్రం సొంత తమ్ముడు తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై స్థానికులు దాడి చేసి కారు, బైక్​, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు.  

చేతులను నరికి వెంట తీసుకెళ్లిన దుండగులు

తన కారును బంధువులు తీసుకెళ్లడంతో కృష్ణయ్య సోమవారం డ్రైవర్​ కొప్పుల ముత్తేశం అలియాస్​ ముత్తయ్యతో కలిసి టూవీలర్​పై బయటకు వెళ్లారు. పొన్నెకల్లు రైతు వేదిక దగ్గర జాతీయ జెండా ఆవిష్కరించి, గుర్రాలపాడులో ఓ కుటుంబాన్ని పరామర్శించి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. మద్దులపల్లి డబుల్ బెడ్రూం ఇండ్ల దగ్గర వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది. కృష్ణయ్య, ముత్తయ్య కిందపడగా, దుండగులు కత్తులు, వేటకొడవళ్లు, తల్వార్లతో తెగబడ్డారు. ముఖానికి కృష్ణయ్య చేతులు అడ్డుపెట్టుకోవడంతో రెండు చేతులను  మణికట్టు వరకు నరికేశారు. నరికిన చేతులను తీసుకొని దుండగులు అదే ఆటోలో పారిపోయారు. డ్రైవర్​ ముత్తయ్యను కూడా చంపుతామని బెదిరించడంతో అక్కడి నుంచి ఆయన ఊర్లోకి పరిగెత్తి, కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకోగా రక్తపుమడుగులో కృష్ణయ్య అప్పటికే చనిపోయారు. ఆటోలో ఆరుగురు వచ్చారని, అందులో నలుగురు ఆటో దిగి దాడి చేశారని ప్రత్యక్ష సాక్షి ముత్తయ్య పోలీసులకు చెప్పారు. 

గతంలో కూడా ... 

దాదాపు 20 ఏండ్ల కింద తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు యేగినాటి వెంకటయ్య ఊరి చౌరస్తాలో టీడీపీ జెండా దిమ్మెను ఏర్పాటుచేయగా.. ప్రత్యర్థులు అతడ్ని  నరికిచంపారు. టీఆర్ఎస్​లో చేరిన తర్వాత  తమ్మినేని కృష్ణయ్యకు కూడా పలుసార్లు బెదిరింపులు వచ్చాయి. తనపై దాడి జరిగితే అది సీపీఎం గూండాల పనేనని కృష్ణయ్య చాలా సార్లు కామెంట్ చేశారు. తనకు సెక్యూరిటీ ఇవ్వాలని ఆయన ఆరునెలల కింద పోలీసులను కోరినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు.  రాజకీయ విభేదాలు తీవ్రంగా ఉన్న తెల్దారుపల్లిలో ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో మెయిన్​ రోడ్డు మీద నుంచే పారిపోయిన హంతకులను గుర్తించే అవకాశం లేకుండా పోయింది. హత్య తర్వాత పోలీసులు గంట ఆల్యసంగా ఘటనాస్థలానికి చేరుకోవడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్య వెనుక తమ్మినేని వీరభద్రం, ఆయన తమ్ముడు తమ్మినేని కోటేశ్వరరావు ప్రమేయం ఉందని మృతుడు కృష్ణయ్య భార్య మంగతాయి, కుమార్తె రజిత, కొడుకు నవీన్​ ఆరోపించారు. వీరభద్రం, కోటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే కృష్ణయ్యను కోల్పోయామన్నారు. షేక్రంజాన్, జక్కంపూడి కృష్ణ, గజ్జి కృష్ణస్వామి, నూకల లింగయ్య, బండ నాగేశ్వరరావు, బోడపట్ల శ్రీను, ఎల్లంపల్లి నాగయ్య హత్యలో పాల్గొన్నారని రూరల్​పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 6గంటల వరకు గ్రామంలో 144 సెక్షన్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ విష్ణువారియర్​చెప్పారు. దుండగుల కోసం నాలుగు పోలీస్  బృందాలు గాలింపు ప్రారంభించాయన్నారు. 

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన తుమ్మల 

తమ్మినేని కృష్ణయ్య హత్య గురించి తెలిసి  తుమ్మల ఖమ్మం జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహంతో పాటే తెల్దారుపల్లికి చేరుకుని.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ, జిల్లా టీఆర్ఎస్ధ్య అధ్యక్షుడు తాతా మధు కృష్ణయ్య ఫ్యామిలీని పరామర్శించారు.

ఆరుగురు కత్తులతో దాడిచేశారు: ముత్తయ్య, ప్రత్యక్ష సాక్షి 

బైక్​పై  వస్తున్నప్పుడు వెనుక నుంచి ఆటోలో వచ్చి మా బండిని ఢీకొట్టారు. ఆటోలో నుంచి నూకల లింగయ్య, బోడపట్ల శ్రీను ( మెంటల్​ శ్రీను) , గజ్జి కృష్ణస్వామి, చెవిటి నాగేశ్వరరావు కత్తులతో కృష్ణయ్యపై దాడి చేసి నరికారు. ఇంకో ఇద్దరు ఆటోలోనే ఉన్నారు. నన్ను కూడా చంపుతామని బెదిరిస్తూ, ఆటోలో ఎక్కి పారిపోయారు. 

తెల్దారుపల్లిలో ఆధిపత్య పోరు

తెల్దారుపల్లిలో 50 ఏండ్లుగా సీపీఎం ఆధిపత్యం కొనసాగుతున్నది. ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా సీపీఎం వాళ్లనే ఏకగ్రీవంగానే ఎన్నుకుంటారు. గత జీపీ ఎన్నికల్లో కృష్ఱయ్య సర్పంచ్​గా పోటీ చేయాలని భావించారు. తమ్మినేని వీరభద్రం సహా ఇతర లీడర్లు నచ్చజెప్ప డంతో మరొక వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి సీపీఎంపై అసంతృప్తిగా ఉన్న కృష్ణయ్య.. ఎంపీటీసీ ఎన్నికల్లో భార్య మంగ తాయిను ఇండిపెండెంట్​గా నిలబెట్టి గెలిపించుకున్నారు. ఆమె మీద పోటీ చేసిన సీపీఎం క్యాండిడేట్​ తమ్మినేని కోటేశ్వరరావు భార్య ఓడిపోయారు. అప్పటినుంచి వర్గవిభేదాలు పెరిగాయి. కృష్ణయ్యను పార్టీ నుంచి సస్పెండ్​ చేశారు. తర్వాత సహకార ఎన్నికల్లో సొసైటీ డైరెక్టర్​గా గెలిచిన కృష్ణయ్య .. టీఆర్​ఎస్​లో చేరి తుమ్మల అనుచరుడిగా కొనసాగుతున్నారు.