అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారత్, చైనా వంటి దేశాలకు పెద్ద షాక్‌గా మారింది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలను "శిక్షించే" ఉద్దేశంతో రూపొందించిన ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ పచ్చజెండా ఊపారు. దీనివల్ల వచ్చే వారం నుండే భారత్, చైనా నుంచి అమెరికాకు వెళ్లే ఉత్పత్తులపై టారిఫ్స్ ఏకంగా 500 శాతం వరకు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వాషింగ్టన్ ఈ కఠిన చర్యలకు సిద్ధమైందని తెలుస్తోంది.
రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం, డెమొక్రాట్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ సంయుక్తంగా రూపొందించిన ఈ బిల్లు, రష్యా నుంచి క్రూడ్, యురేనియం కొనుగోలు చేసే దేశాలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురానుంది. రష్యా ఇంధనంపై ఆధారపడే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలకు రాయితీతో కూడిన చమురు కంటే అమెరికా విధిస్తున్న పెనాల్టీలే భారంగా మారేలా ఈ చట్టం రూపొందించబడింది. ఇప్పటికే గతేడాది భారత్ నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్ 25 శాతం రెసిప్రోకల్ టారిఫ్, రష్యా చమురు కొనుగోలు చేసినందుకు మరో 25 శాతం అదనపు పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తీసుకొస్తున్న బిల్లుతో కొన్ని ఉత్పత్తులపై ఈ డ్యూటీలు ఊహించని స్థాయికి చేరుకోనున్నాయని తెలుస్తోంది.
ALSO READ : అమెరికా మహిళను.. అమెరికా పోలీసులే కాల్చి చంపారు
భారత ప్రధాని మోడీతో తనకున్న వ్యక్తిగత స్నేహాన్ని ప్రస్తావిస్తూనే.. వాణిజ్య విషయంలో తాను అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తనను సంతోష పెట్టాలంటూ ట్రంప్ బహిరంగంగానే దీనిపై కామెంట్స్ కూడా చేశారు. మోడీ మంచి వ్యక్తి, కానీ నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. వారు వాణిజ్యం చేస్తున్నారు, వారిపై టారిఫ్‌లను చాలా వేగంగా పెంచగలనంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు ఇటీవల. కేవలం క్రూడ్ ఆయిల్ మాత్రమే కాకుండా, భారతీయ బియ్యం అమెరికా మార్కెట్‌లో తక్కువ ధరకు 'డంపింగ్' అవుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో బియ్యంపై కూడా అదనపు సుంకాలు విధించే అవకాశం ఉంది.
