అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా నుంచి క్రూడ్, యురేనియం కొంటున్న దేశాలపై 500 శాతం వరకు టారిఫ్స్ విధించే బిల్లుకు ఆమోదం తెలపడం ప్రపంచ వాణిజ్య రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే కీలక రంగాలపై ఇది 'టారిఫ్ బాంబు'లా మారనుందనే భయాలు పెరిగాయి. రష్యా ఇంధనంపై ఆధారపడుతున్నందుకు భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇది పెద్ద ప్రమాదంగా మారనుంది.
కీలక రంగాలపై ప్రభావం:
భారతదేశం నుంచి అమెరికాకు భారీగా ఎగుమతి అయ్యే టెక్స్‌టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ వంటి రంగాలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తాజా టారిఫ్స్ బిల్లు కోలుకోలేని దెబ్బని చెప్పుకోవాలి. అమెరికా మార్కెట్‌లో భారతీయ వస్త్రాలు, ఆభరణాల ధరలు విపరీతంగా పెరగడం వల్ల అక్కడి వినియోగదారులు ఇతర దేశాల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంది. అలాగే లెదర్, ఫుట్‌వేర్, మెరైన్ ప్రొడక్ట్స్, సీ ఫుడ్స్ ఎగుమతి చేసే వేలాది భారతీయ ఎంఎస్ఎంఈల మనుగడ ప్రశ్నార్థకంగా మారవచ్చని నిపుణులు అంటనా వేస్తున్నారు.
పారిశ్రామిక రక్షణ రంగాలపై ఎఫెక్ట్:
అమెరికా తన సప్లై చైన్ కోసం భారత్‌పై ఆధారపడే ఆటోమొబైల్ కాంపోనెంట్స్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్ రంగాలపై కూడా ఈ సుంకాల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా జనరిక్ మందుల సరఫరాలో భారత్ అగ్రగామిగా ఉన్నందున.. టారిఫ్స్ పెంపు అమెరికా ఆరోగ్య రంగంపై కూడా భారం మోపుతుంది. భవిష్యత్ అవసరాలైన సెమీకండక్టర్లు, క్రిటికల్ మినరల్స్ విషయంలో భారత్-అమెరికా మధ్య ఉన్న భాగస్వామ్యానికి ఈ తాజా నిర్ణయం పెద్ద అడ్డంకిగా మారవచ్చని నిపుణులు అంటున్నారు. అలాగే రబ్బర్, పేపర్, గ్లాస్, ఫర్నిచర్, పాల ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వంటి ఇతర భారత ఉత్పత్తులపై కూడా కొత్త టారిఫ్స్ బిల్ ప్రతికూల వ్యాపార వాతావరణాన్ని సృష్టించవచ్చనే భయాలు పెరిగిపోతున్నాయి.
ట్రంప్ టారిఫ్స్ 500 శాతానికి పెంచితే.. భారతీయ ఎగుమతిదారులు అమెరికా మార్కెట్‌లో పోటీ పడటం అసాధ్యంగా మారవచ్చు. ఇది ఇప్పటికే బలహీనంగా మారిన రూపాయిన నీరస పరిచి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ప్రభావం చూపనుంది. దీంతో దేశీయంగా తయారీ రంగంలో లేఆఫ్స్ రావొచ్చు. మెుత్తానికి క్రూడ్ ఆయిల్, సహజ వాయువు వంటి ఇంధన వనరుల కోసం రష్యాపై ఆధారపడటం వల్ల భారత్ ఇప్పుడు అమెరికా ఆగ్రహానికి గురవటం మరింతగా పరిస్థితులను దిగజార్చనుంది.
ట్రంప్ ప్రభుత్వం ఈ సుంకాలను కేవలం వాణిజ్య పరంగానే కాకుండా.. ఒక 'దౌత్య ఆయుధం'గా వాడుతోందని తాజా బిల్లు స్పష్టం చేస్తోంది. ప్రధాని మోడీతో స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ.. అమెరికా ప్రయోజనాలే తన ప్రయారిటీ అంటూ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. భారత్ ఇప్పుడు తన ఎగుమతి మార్కెట్లను వైవిధ్యపరచుకోవడమా లేదా అమెరికాతో చర్చల ద్వారా సుంకాలను తగ్గించుకోవడమా అన్న క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ టారిఫ్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సరికొత్త సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తోంది. చూడాలి భారత్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో అన్నది.
