
తన పై వస్తున్న ఆరోపణలపై యాంకర్ ప్రదీప్ మాచిరాజు స్పందించారు.రాష్ట్రంలో సంచలనంగా మారిన యువతిపై 143 మంది అత్యాచారం కేసులో ప్రదీప్ పేరు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
ఆ ఆరోపణలపై యాంకర్ ప్రదీప్ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అత్యాచారం కేసులో తన పేరు ఉందంటూ సోషల్ మీడియాతో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లు ఇష్టం వచ్చినట్లు తన పేరుతో అసత్య కథనాల్ని ప్రసారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజానిజాలు తెలుసుకోకుండా కొంతమంది తనని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. అలా చేయడం వల్ల తన కుటుంబం ఎంతమానసిక క్షోభకు గురవుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. ఓ మంచి పనికోసం సోషల్ మీడియా ఉందని, కానీ దాన్ని ట్రోల్ చేసేందుకు ఊపయోగిస్తున్నారని మండిపడ్డారు.
నా పేరు వినపడగానే న్యూస్ లు, మెసేజ్ లు పెట్టడం, పర్సనల్ గా కాల్ చేసి మా కుటుంబంలో కూడా ఆడవారి పట్ల ఇలాగే ప్రవర్తిస్తామని చెప్పడం దారుణమన్నారు. వ్యూస్ ల పేరుతో యూట్యూబ్ ఛానల్స్ క్రియేటర్స్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఓ విషయం తెలిస్తే చాలు మీరు అలా పెట్టండి.మేం ఇలా పెడతాం అంటూ మానసికంగా మానభంగం చేస్తున్నారన్నారు.
ఒకరికి న్యాయం చేయడానికి ఇంకొకరికి అన్యాయం చేస్తారా..? మీడియా వ్యూస్ కోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తాను. మీ ఆరోపణల కారణంగా నా కుటుంబం మానసికంగా ఎంత బాధపడుతున్నారో మీకు తెలుస్తోందా..?
నేేను మెట్టు మెట్టు ఎక్కుతూ వస్తే.. నన్ను కావాలని వివాదంలోకి లాగుతున్నారు. అనవసరమైన ఆరోపణలతో నా సన్నిహతులు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజనిజాలు ఖచ్చితంగా బయటకు రాబడతారు అని వీడియోలో ప్రదీప్ తెలిపారు.