డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపైన సప్పుడు లేదు

డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపైన సప్పుడు లేదు
  • కేబినెట్ మీటింగ్‌‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోలే
  • రూ.3 లక్షలు ఇస్తమని చెప్పి..ఇంకా గైడ్‌‌లైన్స్ కూడా ఇయ్యలే
  • సగం మంది రైతులకు  రుణమాఫీ కాలే.. రైతుబంధు పైసలు ఇంకింత ఆలస్యం
  • ఈ అంశాలపై చర్చించేందుకే కేబినెట్‌‌ మీటింగ్‌‌ అని.. ఉద్యోగాల భర్తీపై చర్చకే పరిమితమైన భేటీ

హైదరాబాద్‌‌, వెలుగు: ఏడేండ్లుగా డబుల్ బెడ్రూం​ఇండ్ల ముచ్చటతోనే మురిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు సొంత జాగాల్లో ఇండ్లు కట్టుకునే స్కీమ్‌‌కు అదే సాగదీతను ఎంచుకుంది. ఖాళీ జాగా ఉన్న పేద కుటుంబాలు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తమని ఊరిస్తున్న ప్రభుత్వ పెద్దలు గైడ్‌‌లైన్స్ మాత్రం రిలీజ్ చేస్తలేరు. మొన్నటి కేబినెట్​భేటీలో ఈ స్కీమ్‌‌పై కీలక నిర్ణయాలు ఉంటాయని అందరూ భావించగా.. కనీసం చర్చ కూడా జరగలేదు.

డిపార్ట్‌‌మెంట్ రెడీ చేసిన గైడ్‌‌లైన్స్‌‌కు ఆమోదం లభించలేదు. ఉద్యోగ ఖాళీల భర్తీపైనే ఎక్కువ సేపు చర్చించిన మంత్రివర్గం.. డబుల్ బెడ్రూం​ఇండ్ల పంపిణీ, ఖాళీ జాగాలు ఉన్నోళ్లు ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేసే పథకాన్ని దాదాపు పక్కనపెట్టిందని తెలిసింది. దీంతో ఈ స్కీమ్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పే పరిస్థితి లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూం ఇండ్ల తరహాలోనే ఈ స్కీమ్ లేటవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎలక్షన్లు వచ్చే దాకా ఆగి.. అప్పుడు పైలెట్‌‌ ప్రాజెక్టుగా ఏదో ఒక నియోజకవర్గంలో అమలు చేయాలనేది ప్రభుత్వ యోచనగా కనిపిస్తున్నదని ఒక ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ఈ స్కీమ్​అమలు చేయాలంటే భారీగా నిధులు అవసరమవుతాయి. బడ్జెట్‌‌ సపోర్ట్‌‌ చేసే అవకాశం లేకపోవడంతో వీలైనంత కాలం సాగదీయాలనేది సర్కారు ధోరణిగా కనిపిస్తున్నది. దళితబంధు, రుణమాఫీ, రైతుబంధు సాయం పంపిణీ కూడా లేట్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తున్నది. ఈనెల 7న జగిత్యాల బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. 10 రోజుల్లోనే మరో విడత రైతుబంధు పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు.

ఇటీవలి కేబినెట్‌‌‌‌‌‌‌‌ సమావేశంలో రైతుబంధుకు నిధుల విడుదలపైనా చర్చించాల్సి ఉన్నా.. నిధుల లేమితో ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలిసింది. యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో 68.94 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద రూ.7,654.43 కోట్లు అవసరమని లెక్కగట్టారు. నిధుల లేమితో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడంలో కొంత ఆలస్యం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈనెలాఖరులో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ప్రారంభించే అవకాశమున్నట్టు సమాచారం.

దళితబంధు ఒక్కరికీ ఇయ్యలే

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్‌‌‌‌‌‌‌‌, చారగొండ మండలాల్లోని దళితులందరితోపాటు మిగతా నియోజకవర్గాల్లో వంద మందికి చొప్పున దళితబంధు అందజేసే ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఒక్కరికీ దళితబంధు ఇవ్వలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 1,500 మందికి చొప్పున దళితబంధు ఇవ్వడానికి రూ.17,700 కోట్లను బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో కేటాయించారు.

డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోగా మొదటి విడతలో నియోజకవర్గానికి 500 మంది చొప్పున స్కీం వర్తింపజేసి, మార్చిలోగా మిగతా వెయ్యి మందికి ఇస్తామని సీఎం కేసీఆర్ టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సంయుక్త సమావేశంలో ప్రకటించారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేయలేదు. ఇప్పుడు నియోజకవర్గానికి 200 మందికే దళితబంధు వర్తింపజేసే ప్రయత్నాల్లో సర్కారు ఉంది. ఈ స్కీంకు రూ.2 వేలకు కోట్లకు మించి ఇవ్వలేమని ప్రభుత్వ పెద్దలు తేల్చిచెప్పారని అధికారవర్గాలు చెప్తున్నాయి.

‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి సొంత స్థలాల్లో డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి రూ.మూడు లక్షల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతున్నది. నియోజకవర్గానికి మూడు వేల ఇండ్ల చొప్పున కేటాయిస్తుంది. వీటిలో 3.57 లక్షల ఇండ్లు ఎమ్మెల్యేల పరిధిలో ఉంటాయి. ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వాసితులకు, వివిధ ప్రమాద బాధితులకు కేటాయించడానికి వీలుగా 43 వేల ఇండ్లు సీఎం పరిధిలో ఉంటాయి’’

రుణమాఫీపై బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ఇలా..

‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత 35.52 లక్షల మంది రైతులకు చెందిన రూ.16,144 కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ దఫా రుణమాఫీలో భాగంగా ఇప్పటి వరకు 5.12 లక్షల మంది రైతులకు చెందిన రుణాలు మాఫీ చేసింది. రూ.50 వేల లోపు రుణాలు ఈ మార్చిలోపు మాఫీ అవుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.75 వేల లోపు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది’’. 

వాస్తవ పరిస్థితి ఇదీ..

సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 28 లక్షల మందికి ఇండ్లు లేవని గుర్తించారు. తెలం గాణ ఏర్పడిన తర్వాత హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలో లక్ష ఇండ్లు, రాష్ట్రవ్యాప్తంగా ఇంకో లక్ష డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టారు. వాటి లో హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలో 67వేల నిర్మా ణాలు పూర్తయ్యాయి. వచ్చే ఏడాదిలో పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తయిన 49వేల ఇండ్లను పంపిణీ చేసేందుకు అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలు పెట్టారు.

ఈ 2లక్షల ఇండ్లు లబ్ధిదారులకు అందజేసినా ఇంకో 26 లక్షల మంది ఇండ్లు లేని వాళ్లుంటారు. 2015 తర్వాత ఇప్పటిదాకా ఇంకో 14 లక్షల కుటుంబాలు పెరిగాయని అంచనా. అంటే రాష్ట్రంలో ఇండ్లు లేని కుటుంబాల సంఖ్య 40 లక్షల దాకా ఉంటుంది. వీళ్లందరికీ రూ.3 లక్షల చొప్పున సాయం అందించాలంటే రూ. 1.20 లక్షల కోట్లు అవసరం. బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో చెప్పినట్టుగా 4 లక్షల మందికి రూ.3 లక్షలు ఇవ్వాలన్నా.. రూ.12 వేల కోట్లు కావాలి. నిధులు సర్దు బాటయ్యే పరిస్థితి లేకపోవడంతో ఈ స్కీంను డై లీ సీరియల్‌‌‌‌‌‌‌‌లా లాగాలని ప్రభుత్వం చూస్తున్నది.