భారతదేశ పార్లమెంటరీ లక్షణాలు..పార్లమెంటరీ ప్రభుత్వం 

భారతదేశ పార్లమెంటరీ లక్షణాలు..పార్లమెంటరీ ప్రభుత్వం 

భారత రాజ్యాంగాన్ని అరువుల మూట అంటారు. దీనికి ప్రధానంగా ఆధారమైన చట్టం 1935 భారత సమాఖ్య చట్టం. ఇందులో నుంచి సుమారు 75శాతం అంశాలను స్వీకరించారు. 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, సమాఖ్య విధానం, గవర్నర్ వ్యవస్థ, బ్రిటన్ రాజ్యాంగం నుంచి వెస్ట్ మినిస్టర్ తరహా పద్ధతి, పార్లమెంటరీ పద్ధతి, సమన్యాయ పాలన, ఏక పౌరసత్వం, ఒక ఓటు పద్ధతి, అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష అధికారం, రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారం, ఉప రాష్ట్రపతి పదవి, రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం, రాజ్యాంగ ప్రవేశికను స్వీకరించారు.

ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి నిర్దేశిక నియమాలు, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేసే పద్ధతి, సోవియెట్ రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులు, జర్మనీ వైమర్ రాజ్యాంగం నుంచి రాష్ట్రపతి అత్యవసర అధికారాలు, ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా, సహకార సమాఖ్య, వర్తకం, వాణిజ్యం, అంతర్ రాష్ట్ర రవాణా, పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక హక్కులు తీసుకున్నారు. కెనడా రాజ్యాంగం నుంచి యూనియన్ ఆఫ్​ స్టేట్స్, అవశిష్ట అధికారాలు, జపాన్ రాజ్యాంగం నుంచి జీవించే హక్కు, చట్టం నిర్దేశించిన పద్ధతిని స్వీకరించారు. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ విధానాన్ని స్వీకరించారు. గణతంత్ర వ్యవస్థను ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు.

అదృఢ, దృఢ రాజ్యాంగాల సమ్మేళనం 

అమెరికా రాజ్యాంగం దృఢ రాజ్యాంగం, బ్రిటన్ రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం, భారతదేశ రాజ్యాంగం దృఢ, అదృఢ రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని 368వ అధికరణం ప్రకారం, 3 పద్ధతుల ద్వారా సవరణ చేస్తారు. 

సాధారణ పద్ధతి: అంటే పార్లమెంట్​ సాధారణ సవరణ జరిగే పద్ధతి. పార్లమెంటులోని రెండు సభలు ఈ బిల్లు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తారు. కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం,  రాష్ట్రాల సరిహద్దులను మార్చడం, పౌరసత్వ నియమాలు,  పార్లమెంటు సభ్యుల జీతాలు, విధాన మండలి రద్దు, ఏర్పాటు, అధికార భాషా వ్యవహారాలు.

పాక్షిక కఠిన పద్ధతి: పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరణ జరిగే పద్ధతి. పార్లమెంటు ఉభయ సభలు వేరువేరుగా 2/3వ వంతు మెజారిటీతో ఈ బిల్లును ఆమోదించాలి. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు సవరించడం

దృఢ పద్ధతి: పార్లమెంటు ఉభయసభలు వేర్వేరుగా 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించి, సగానికంటే ఎక్కువగా రాష్ట్రాల ఆమోదం పొందాలి.

ఉదాహరణ: భారత రాష్ట్రపతి అధికారాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాలు సవరించడం, ఏక కేంద్ర లక్షణాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. భారత రాజ్యాంగంలో 'సమాఖ్య' అనే పదం లేదు. రాజ్యాంగం ప్రకారం భారత్ అంటే 'రాష్ట్రాల యూనియన్'. ఎ.వి. డైసీ ప్రకారం సమాఖ్య రాజ్యానికి లిఖిత రాజ్యాంగం,  కేంద్ర,రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, అత్యున్నతమైన న్యాయస్థానం(స్వతంత్రప్రతిపత్తి),  ఎగువ సభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం, ద్వంద్వ పౌరసత్వం, దృఢమైన రాజ్యాంగం లక్షణాలు ఉండాలి.

రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య లక్షణాలు: 
కేంద్ర, రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వాలు, ద్విసభా విధానం, ఎగువ సభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన.

రాజ్యాంగములో పొందుపర్చిన ఏకకేంద్ర లక్షణాలు: 

ఏక పౌరసత్వం, అఖిల భారత సర్వీసులను కేంద్రం నియమిస్తుంది, గవర్నర్లను నియమించే అధికారం కేంద్రానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల కంటే కేంద్ర ప్రభుత్వం బలమైంది. రాష్ట్రాల పేర్లు, సరిహద్దులను మార్చే అధికారం కేంద్రానికి ఉంది. అత్యవసర పరిస్థితిని కేంద్రం విధిస్తుంది. ఒకే రాజ్యాంగం, రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనం చేసే హక్కు కేంద్రానికి ఉంది. కేంద్రం ఎన్నికల, ఆర్థిక సంఘం, కేంద్ర - రాష్ట్రాల ఖాతాలను కంట్రోలర్, ఆడిటర్ జనరల్ నిర్వహిస్తారు. భారత రాజ్యాంగం పూర్తి సమాఖ్య కాదు. పూర్తి ఏక కేంద్ర వ్యవస్థ కాదు. కే.సీ.వేర్ భారత రాజ్యాంగాన్ని ‘అర్థ సమాఖ్య'(క్వాజి ఫెడరల్)అని అభివర్ణించారు. గ్రాన్ విల్లే ఆస్టిన్ 'సహకార సమాఖ్య' అని, డి.ఎన్.బెనర్జీ సహకార సమాఖ్య అని తెలిపారు. భారత రాజ్యాంగం కేంద్రీకృత లక్షణాలు కలిగిన సమాఖ్య వ్యవస్థ అని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్  అభివర్ణించారు.

పార్లమెంటరీ ప్రభుత్వం 

పార్లమెంట్ ల మాత అని బ్రిటన్ పార్లమెంట్ ను అంటారు. పార్లమెంటరీ వ్యవస్థను బ్రిటన్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు.

భారతదేశ పార్లమెంటరీ లక్షణాలు

భారతదేశ కార్యనిర్వాహక వర్గంలో నామమాత్రపు, వాస్తవ కార్యనిర్వాహణ అధికారులు ఉంటారు. మెజారిటీ పార్టీ సూత్రం. మంత్రిమండలి ప్రధానమంత్రి నేతృత్వంలో సమష్టిగా పార్లమెంట్ కు బాధ్యత వహిస్తుంది.

సార్వజనీక వయోజన ఓటు హక్కు

రాజ్యాంగంలోని 326 అధికరణ ప్రకారం జాతి, కుల, మత, లింగ, వర్ణ వివిక్ష లేకుండా 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ సార్వజనీక వయోజన ఓటు హక్కు కల్పించింది. 1988  లో  రాజీవ్ గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. 18 సంవత్సరాలకు ఓటుహక్కు వినియోగించుకున్న మొదటి రాష్ట్రం  ఆంధ్రప్రదేశ్.

- బి.ఎన్.రావు, నాలెడ్జ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్, మిర్యాలగూడ