చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, వెలుగు :  రాష్ట్రంలో చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకువస్తామని, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర చేనేత, జౌళి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం హైదరాబాద్ నారాయణగూడ​లో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర నూతన అధ్యక్ష, కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. 

నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం జిల్లాకు చెందిన కమర్తపు మురళి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని తెలిపారు. దేశంలో తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత రంగమని చెప్పారు. అన్ని రంగాలలో పద్మశాలీలు రాణించాలని, వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.

గద్వాల, పోచంపల్లి తదితర ప్రాంతాలలో ఉన్న చేనేత పార్కులను సందర్శించి అభివృద్ధి పరుస్తామన్నారు. కార్యక్రమంలో భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, ఎమ్మెల్సీ ఎల్.రమణ , మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచందర్ రావు పాల్గొన్నారు.