
నిర్మల్, వెలుగు: జర్నలిస్టులందరికీ వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని టీయూడబ్ల్యూజే ఐజేయూ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య డిమాండ్ చేశారు. సోమవారం నిర్మల్ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. రూరల్ తాహసీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు. భూమయ్య మాట్లాడుతూ.. ప్రజలు, ప్రభుత్వాలకు వారధిగా జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని, నిత్యం ప్రజాసేవలో ఉన్నప్పటికీ.. ప్రభుత్వాలు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు.
రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఇప్పటికే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చారని, నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ఈ నెల 29న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని, జిల్లాలోని జర్నలిస్టులు పాల్గొని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా కన్వీనర్ డి.యోగేశ్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి జల్ధ మనోజ్, సభ్యులు మధు, శివరాజ్ కుమార్, లింగేశ్వర్, వరప్రసాద్, రమణ తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్ లో..
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఖానాపూర్ పట్టణంలో స్థానిక జర్నలిస్టులు, యూనియన్ నాయకులు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ సుజాతారెడ్డికి వినతిపత్రం అంద జేశారు. ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు గండ్ల రాజశేఖర్, జిల్లా నాయకులు తన్వీర్, రాజు, స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
కుంటాల, వెలుగు: అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కుంటాల తహసీల్దార్ కమల్ సింగ్‌కు మండల జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) పిలుపు మేరకు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులు బోయిన్పల్లి రవికుమార్, గడ్డం రాజేందర్ రెడ్డి, ఎగ్గం సాయిబాబా, దాసరి రాజు, కుర్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.