- రాష్ట్రవ్యాప్తంగా 110 మందికి పదోన్నతులు వచ్చే చాన్స్
- ఎస్ఏలకు సూపరింటెండెంట్లుగా, జేఏలకు ఎస్ఏలుగా...
- 53 సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీలున్నా కదలని ఫైలు
- కమిషనరేట్‌లో తొక్కిపెడుతున్నారని ఆరోపణలు
మంచిర్యాల, వెలుగు: ఇటీవలే డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా రూపాంతరం చెందిన తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ)లో సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల ప్రమోషన్లు ఆలస్యమవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రమోషన్లకు సంబంధించిన ఫైలు కదిలినట్టే కదులుతూ టేబుళ్లకే పరిమితం కావడంతో ఎప్పుడు క్లియరెన్స్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కమిషనరేట్‌లో పనిచేసే కొంతమంది అధికారుల తీరుతోనే ప్రమోషన్ల ప్రక్రియ డిలే అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలయాపన కారణంగానే సమస్యలు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సుమారు 53 ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. అదే శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా ప్రమోషన్స్ కల్పించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఆ తర్వాత మరో 53 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలి. టీవీవీపీ కమిషనర్ ప్రమోషన్లకు సంబంధించిన ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టును గత నెలలోనే అన్ని జోన్లకు పంపినట్టు తెలిసింది.
సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా ప్రమోషన్లు కల్పించే ఫైలుపై కమిషనర్ ఇటీవల సంతకాలు కూడా పెట్టినట్టు సమాచారం. కానీ కమిషనరేట్‌లో పనిచేసే మినిస్టీరియల్ స్టాఫ్‌లో కొంతమంది లీవులు పెట్టుకొని ఆఫీసుకు రాకుండా కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రమోషన్లకు సంబంధించిన ఫైలు ముందుకు వెళ్లకుండా వారు తొక్కిపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి నిర్వాకం, కాలయాపన కారణంగా ఉద్యోగులు టీవీవీపీ కమిషనర్‌కు పలుమార్లు విన్నవించుకొంటున్నారు. ఎందుకంటే కొంతమంది ఉద్యోగులు ప్రమోషన్లు రాకుండానే రిటైర్ అవుతున్నారని వాపోతున్నారు.
పురోగతి లేక ఆందోళన
సీనియర్ అసిస్టెంట్లకు ఆఫీస్ సూపరింటెండెంట్లుగా ప్రమోషన్లు కల్పించేందుకు గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, కొత్త జోనల్ విషయమై కొందరు ఉద్యోగులు కోర్టులో కేసు వేశారు. నిరుడు జూలైలో ఈ కేసును కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ ప్రమోషన్ల విషయమై పురోగతి లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత సెక్షన్ అధికారుల నిర్లక్షం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 110 మంది ఉద్యోగుల ప్రమోషన్ల ఫైల్ ముందుకు కదలడం లేదంటున్నారు.
ఇతర కేడర్లకు ఇప్పటికే ప్రమోషన్లు ఇచ్చిన అధికారులు సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా ప్రమోషన్లు కల్పించకపోవడంతో పలు విమర్శలు వస్తున్నాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు రాక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు ప్రమోషన్ల విషయంపై స్పందించిన కమిషనర్ జోన్-1, జోన్4లకు ప్రొవిజన్ లిస్టులను పంపించినట్లు తెలుస్తోంది. మిగతా జోన్లకు 2026 లిస్టును కూడా పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా హెల్త్ మినిస్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
