చైనా వాళ్ల‌పై వ‌రుస అటాక్స్

 చైనా వాళ్ల‌పై వ‌రుస అటాక్స్

క‌రాచీ: పాకిస్థాన్, చైనా ఎప్పుడూ మంచి దోస్తులుగా చెప్పుకొంటాయి. కానీ పాకిస్థాన్‌లో చైనా దేశస్తుల‌పై వ‌రుస‌గా అటాక్స్ జ‌రుగుతున్నాయి. బ‌స్సుపై బాంబు దాడి జ‌రిగి 9 మంది చైనీయులు మ‌ర‌ణించిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో అటాక్ జ‌రిగింది. బుధ‌వారం క‌రాచీలో కారులో వెళ్తున్న ఇద్ద‌రు చైనీయుల‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు బైక్‌పై వ‌చ్చి కాల్పులు జ‌రిపారు. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన ఇద్ద‌రిని లోక‌ల్ పోలీసులు క‌రాచీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దాడి చేసిందెవ‌ర‌నే దానిపై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి ఝ‌వో లిజియాన్ స్పందించారు. దీనిని వేరే ఘ‌ట‌న‌గానే చూస్తామ‌ని, గ‌తంలో జ‌రిగిన దాడుల‌తో క‌లిపి చూడ‌లేమ‌న్నారు. పాకిస్థాన్‌లో ఉన్న చైనా పౌరుల‌కు, చైనా ఆస్తుల‌ను కాపాడేందుకు పాక్ ప్ర‌భుత్వం స‌రైన ర‌క్ష‌ణ ఇస్తుంద‌ని త‌మ‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని చెప్పార‌ని రాయిట‌ర్స్ సంస్థ పేర్కొంది.

రెండు వారాల క్రిత‌మే చైనా ఇంజనీర్ల‌పై అటాక్

క‌రాచీలో జ‌రిగిన దాడికి కేవ‌లం రెండు వారాల క్రిత‌మే పాక్‌లోని అప్ప‌ర్ కొహిస్తాన్ ప్రాంతంలో చైనా ఇంజ‌నీర్లు వెళ్తున్న బ‌స్సుపై బాంబు దాడి జ‌రిగింది. ఈ నెల 14న‌ దాసు డ్యామ్ నిర్మాణం జ‌రుగుతున్న ప్రాంతానికి వెళ్తున్న బ‌స్సుపై ఐఈడీ బాంబు అటాక్ జ‌ర‌గ‌డంతో 13 మంది మ‌ర‌ణించారు. అందులో 9 మంది చైనాకు చెందిన వాళ్లే ఉన్నారు. గ‌తంలోనూ పాకిస్థాన్‌లో ఉంటున్న చైనా వాళ్లు టార్గెట్‌గా అనేక దాడులు జ‌రిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో క్వెట్టాలో చైనా రాయ‌బారి ఉన్న టాప్ హోట‌ల్‌లో బాంబు పేలుడు జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మ‌ర‌ణించారు. 2019లో చైనా పాకిస్థాన్ ఎక‌న‌మిక్ కారిడార్ ప‌నులు చూస్తున్న చైనా అధికారులు ఉన్న ల‌గ్జ‌రీ హోట‌ల్‌పై కొంద‌రు తుపాకీల‌తో దాడి చేసి 8 మందిని చంపేశారు.