ఏపీలో ఒమిక్రాన్ వ్యాప్తి.. మరో ఇద్దరికి పాజిటివ్

ఏపీలో ఒమిక్రాన్ వ్యాప్తి.. మరో ఇద్దరికి పాజిటివ్

ఏపీలో కొత్త వైరస్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరింది. తాజాగా నమోదైన రెండు కేసులు కూడా విదేశాల నుంచి వచ్చినవారికేనని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన 48ఏళ్ల వ్యక్తి కొద్దీ రోజుల క్రితం దక్షిణాఫ్రికా నుంచి వచ్చాడు. అతడికి చేసిన టెస్టుల్లో ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అనంతపురంకు చెందిన 51 ఏళ్ల వ్యక్తి కూడా ఒమిక్రాన్ బారిన పడ్డారు. యూకే నుంచి ఇండియాకు వచ్చిన అతడికి పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ నిర్దారణ అయింది. దీంతో వీరిద్దరిని ఆసుపత్రికి తరలించారు. వీరి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని తేలింది.

ఇక దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 417కి చేరింది. తెలంగాణలో 41 కేసులు ఉండగా...  మహారాష్ట్రలో అత్యధికంగా వందకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ ఉన్నాయి. తాజాగా ఒడిశాలో కూడా  కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. నైజీరియా నుంచి వచ్చిన ఇద్దరికీ, యూఏఈ, సౌదీ అరేబియా నుంచి వచ్చిన మరో ఇద్దరికి చేసిన వైద్య పరీక్షల్లో ఒమిక్రాన్ నిర్థారణ అయ్యింది. దీంతో ఒడిశాలో మొత్తం కేసుల సంఖ్య 8కు చేరింది. 

మరోవైపు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర, యూపీ,మధ్యప్రదేశ్,హర్యానాలో నైట్ కర్ఫ్యూ అమలు చేశారు. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అటు కేంద్రప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. బూస్టర్ డోస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ముందుగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఇక 15 నుంచి 18 ఏళ్ల మధ్య టీనేజర్లకు టీకా కార్యక్రమం ప్రారంభించనున్నారు.

ఇవి కూడా చదవండి:

ఆ దీక్ష పచ్చి అవకాశవాదం

డెలివరీ తర్వాత అతుక్కోని కుట్లు.. బాధ భరించలేక సూసైడ్