
కేరళలో సేమ్ సెక్స్ మ్యారేజ్ జరిగింది. కేరళకు చెందిన ఆంటోనీ చుల్లికల్ మరియు అబ్దుల్ రహీమ్‌లు డిసెంబర్ 29న బెంగళూరులోని చిన్నప్పనహళ్లి సరస్సు దగ్గర వివాహం చేసుకున్నట్లు ఆంటోనీ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. కేరళలో ఇది రెండవది. ఐదేళ్లపాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొచ్చికి చెందిన నికేష్ మరియు సోను అనే ఇద్దరు ఐటీ ప్రొఫేషనల్స్ గత సంవత్సరం జూలైలో వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి వారి వివాహబంధాన్ని రహస్యంగా ఉంచారు. స్వలింగ సంబంధాలను సుప్రీంకోర్టు చట్టబద్ధం చేసిన తర్వాత ఈ ఏడాది ఆగస్టులో వారి వివాహం గురించి ప్రపంచానికి తెలియజేశారు. వీరిదే కేరళలో జరిగిన మొదటి స్వలింగ వివాహంగా నమోదయింది.
వీరి తర్వాత ఆంటోని మరియు రహిమ్‌లు కూడా అదే దారిలో వెళ్లారు. భారతదేశంలో స్వలింగ సంబంధాలను చట్టబద్ధం చేస్తూ సుప్రీంకోర్టు సెక్షన్ 377ను కొట్టివేసినప్పటికీ, ఈ వివాహాలను మాత్రం ఇంకా చట్టం ప్రకారం నమోదు చేయడంలేదు. అయినా కూడా ఆంటోని మరియు రహిమ్‌లు ఏమాత్రం ఆలోచించకుండా తమ వివాహాన్ని చేసుకున్నారు. ఆదివారం పెళ్లి ప్రమాణాలు చేసుకున్నతరువాత ఆంటోని మరియు రహిమ్‌లు స్వలింగ వివాహం చేసుకున్న రెండవ జంటగా నమోదు అయ్యారు. వీరి వివాహానికి ముందు వారి ఫోటోషూట్ వైరల్ అయ్యింది. తమలాంటి జంటలందరికీ తాము మద్దతు ఇస్తామని ఈ జంట ప్రకటించింది.
ఆంటోని మాట్లాడుతూ.. ‘నేను నా ప్రియుడిని వివాహం చేసుకోవాలనుకున్నాను. దానికన్నా ముందు మేం ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను తీసుకున్నాము. అది బాగా వైరల్ అయింది. అందుకే తమ వివాహాన్ని రహస్యంగా చేసుకోవాలనుకున్నాం. మా పెళ్లి కూడా ఇతర పెళ్లిళ్లలాగే జరిగింది. తమలాంటి వారికి మా పెళ్లి స్ఫూర్తిగా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా మందికి నేను ప్రేరణగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఒక సంవత్సరం క్రితం వరకు స్వలింగ సంపర్కుడిగా ఉండటం కూడా నేరమే. గత సంవత్సరం సెక్షన్ 377 డిక్రిమినలైజ్ చేయబడింది. రాబోయే ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో స్వలింగ వివాహాలు కూడా చట్టబద్ధం కావచ్చు. మీరు స్వలింగ వివాహం లేదా లెస్బియన్ వివాహం చేయాలనుకుంటే వెంటనే చేసుకోండి. చట్టం వచ్చే వరకు వేచిచూస్తామంటే, మీరు చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుంది’అని అన్నారు. ఈ జంట పెళ్లి తర్వాత స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించబడిన విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆ తర్వాత ఇండియాలోనే ఉండి.. ఇలా ఎందుకు పెళ్లి చేసుకోకూడదని ఆలోచించి పెళ్లి చేసుకున్నారు.
ఇంతకుముందు కొచ్చికి చెందిన ఐటీ నిపుణులు నికేష్ ఉషా పుష్కరన్ మరియు సోనూ ఇద్దరూ జూలై 2018లో గురువాయూర్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. గుళ్లో దేవుడి ముందు ఉంగరాలు మార్చుకొని వివాహం చేసుకున్నట్లు, అప్పటినుండి కలిసి జీవిస్తున్నామని నికేష్ తెలిపారు. ‘మా తల్లిదండ్రులు మొదట మా వివాహానికి అంగీకరించలేదు. అందుకే పెళ్లి చేసుకున్న తర్వాత వారికి ఈ విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాము. మేం పెళ్లి చేసుకున్నప్పుడు మాతో ఎవరూ లేరు. మేము గుళ్లో ఉంగరాలు మార్చుకున్నాము. ఆ సమయంలో గుళ్లో ఎక్కువ రద్దీగా ఉన్నందున, మమ్మల్ని ఎవరూ గమనించలేదు. ఆ తర్వాత మేం మా కారు దగ్గరికి వెళ్లి తులసి దండలు మార్చుకున్నాము’అని నికేష్ తెలిపారు.
For More News..