U19 World Cup 2024 Final: 68 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా

U19 World Cup 2024 Final: 68 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా

టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనపరిచిన భారత యువ జట్టు ఫైనల్‌లో తడబడుతోంది. ఆసీస్ నిర్ధేశించిన 254 పరుగుల ఛేధనలో 68 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సౌతాఫ్రికాపై సెమీస్‌లో ఆదుకున్న ఉదయ్ సహారన్(8), సచిన్ దాస్(9)లు కూడా నిరాశ పరిచారు.

254 పరుగుల ఛేదనలో భారత జట్టు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న ఆర్షిన్ కులకర్ణి 3 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన ముషీర్ ఖాన్(22) కూడా స్ట్రైక్ రొటేట్ చేయడంతో ఇబ్బంది పడ్డాడు. స్వేచ్ఛగా పరుగులు చేయలేకపోయాడు. దీంతో పవర్ ప్లేలో భారత జట్టు వికెట్ నష్టానికి 28 పరుగులకే పరిమితమయ్యింది. ముషీర్ ఖాన్ క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా.. ధాటిగా ఆడే ప్రయత్నంలో బీర్డ్ మ్యాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 40 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది.

ఆ తరువాత వచ్చిన ఉదయ్ సహారన్(8), సచిన్ దాస్(9)లు త్వరగా ఔటయ్యారు. ఒక ఎండ్ నుంచి ఆదర్శ్ సింగ్(22 నాటౌట్) పోరాడుతున్నా.. అతనికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించడం లేదు. ప్రస్తుతం ఆదర్శ్ సింగ్(22 నాటౌట్), ప్రియాన్షు మొలియా(0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు హర్జాస్ సింగ్(55), వీబ్‌జెన్(48), డిక్సన్(42), ఆలివర్ పీక్(41) పరుగులు చేయడంతో ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.