కన్హయ్య లాల్ హంతకులకు బీజేపీతో లింకులు : అశోక్ గెహ్లాట్

  కన్హయ్య లాల్ హంతకులకు బీజేపీతో లింకులు : అశోక్ గెహ్లాట్

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలుచేశారు.  ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యలో హంతకులకు బీజేపీతో సంబంధం ఉందని ఆరోపించారు.  కన్హయ్య లాల్ హత్య  జరిగిన  కొద్ది రోజులకే  బీజేపీ వారిని మరో కేసు నుంచి విడిపించిందని, కొందరు బీజేపీ నేతలు వారిని స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారిని విడిపించుకుని వచ్చారంటూ గెహ్లాట్ చెప్పారు. 

 జోధ్‌పూర్‌కు ప్రచార యాత్రలో భాగంగా విలేకరులతో మాట్లాడిన రాజస్థాన్ సీఎం..   జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎకు బదులుగా రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజి) ఈ కేసును విచారణ చేసుంటే దోషులకు ఇప్పటికే శిక్ష పడేది అని అన్నారు.  ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మద్దతు తెలిపాడని గత ఏడాది జూన్ 28న పట్టపగలు ఇద్దరు దుండగులు ఉదయ్‌పూర్‌లోని తన షాపులో కన్హయ్య లాల్ ను నరికి చంపారు.  ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  

మరోవైపు రాజస్థాన్‌లో నవంబర్ 25న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 200 మంది సభ్యులున్న సభలో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు సాధించింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Also Read :- ఫ్రెండ్స్ను నమ్మి మోసపోయాడు.. ఆఫీసులోనే ఐటీ ఉద్యోగి ఆత్మహత్య..