కేంద్ర ఎన్నికల సంఘంపై ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ఎన్నికల సంఘంపై ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ఎన్నికల సంఘంపై మహరాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికే శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కేటాయించడంపై సీఈసీని తప్పుపట్టారు. ఎన్నికల సంఘాన్నే రద్దు చేయాలని ఠాక్రే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఎన్నికల కమిషనర్లను కూడా ప్రజలే ఎన్నుకోవాలన్నారు. శివసేన సస్పెండ్‌ చేసిన ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున పార్టీ పేరు, గుర్తు కేటాయింపుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినా పట్టించుకోలేదన్నారు.  తాము అభ్యర్థించినా త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఈసీకి ఏమొచ్చిందని ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు.

ఎన్నికల సంఘం నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని..మంగళవారం విచారణ జరుతుందని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. తమ ఆశలు సుప్రీంకోర్టు తీర్పుపై ఆధార పడి ఉన్నాయన్నారు. రాజ్యాంగబద్ద సంస్థలతో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని ఠాక్రే మండిపడ్డారు. శివసేను లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేసిందని..అందులో భాగంగానే పార్టీ పేరు, గుర్తును లాక్కున్నారని విమర్శించారు. తమ నుంచి అన్నీ దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ, గుర్తును లాక్కున్నా..ఠాక్రే పేరు మాత్రం లాక్కోలేరని తెలిపారు.  ఇప్పుడు శివసేనకు జరిగినట్లే..భవిష్యత్ లో మరో పార్టీకి ఇదే జరగొచ్చని..ఇలాగే కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం గానీ..ఎన్నికలు గానీ ఉండవని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.