కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణిలో వరుసగా అండర్గ్రౌండ్బొగ్గు గనులు మూతపడుతున్నాయి. ప్రతిపాదనలోని కొత్త గనుల పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని భూసేకరణ దశలో ఉండగా మరికొన్ని పర్యావరణ పర్మిషన్ల వద్ద నిలిచిపోయాయి. వేలాది వర్కర్స్కు ఉపాధినిచ్చే అండర్గ్రౌండ్బొగ్గు గనులు మూతపడుతుండగా.. ఉపాధి అవకాశాలు ఏ మాత్రం పెంచుకునే చాన్స్ లేనప్పటికి బొగ్గు ఉత్పత్తే ధ్యేయంగా యూజీలు మూస్తూ ఓసీపీలుగా మార్చుతున్నారు. రానున్న రెండు నెలల్లో మందమర్రి ఏరియాలో రెండు అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు మూతపడనున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం 24 యూజీలు, 18 ఓసీపీలున్నాయి.
బొగ్గు నిల్వలున్నప్పటికీ..
మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో రానున్న రెండు నెలల్లో ఆర్కే1ఏ, కేకే1 అండర్ గ్రౌండ్బొగ్గు గనులను సింగరేణి యాజమాన్యం మూసివేయనుంది. గనుల్లో బొగ్గు నిక్షేపాలున్నప్పటికి ఉత్పత్తి వ్యయం పెరుగుతోందనే సాకుతో మూసివేస్తున్నారని కార్మికులు, కార్మిక సంఘాలు ఫైర్అవుతున్నాయి. రెండు గనుల్లో పనిచేసే సుమారు 900 మంది సింగరేణి వర్కర్స్‌ను బదిలీ చేయనుంది. బొగ్గు ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడం, పని స్థలాల్లో తక్కువ మందం బొగ్గు సీమ్‌లు ఉండటంతో ఆర్కే1ఏ మైన్‌ను మూసివేస్తూ యాజమాన్యం 2022–-23 ఆర్థిక సంవత్సరంలోనే బొగ్గు టార్గెట్ నిలిపివేసింది. 1984లో ఆర్కే1ఏ గనిని ప్రారంభించి మొత్తంగా 7.85 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు తీశారు. మరో ఐదేళ్లపాటు వెలికితీసేందుకు అవసరమైన బొగ్గు నిక్షేపాలున్నా యాజమాన్యం హడావిడిగా గనిని మూసివేస్తోంది. ఏడాది కాలంలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ కోసం భూగర్భంలో ఉన్న సామగ్రిని మొత్తంగా గనిపైకి తీసుకువచ్చింది. మరోవైపు బొగ్గు నిక్షేపాలు పూర్తిగా అంతరించాయంటూ కల్యాణిఖని 1 యూజీ గనిని కూడా మూసివేస్తోంది. 1956లో ప్రారంభమైన కేకే1 మైన్ నుంచి 10.16 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. మరో ఐదేళ్ల వరకు ఉత్పత్తి చేసేందుకు ఇంకా 0.154 మిలియన్ టన్నుల నిల్వలున్నా రూల్స్ప్రకారం, భూ ఉపరితలంపై ఉన్నటువంటి పరిస్థితుల వల్ల బొగ్గును వదలాల్సి వస్తోందని ఆఫీసర్లు చెబుతున్నారు. రెండు గనుల్లోని ఎంప్లాయీస్ ను ఏరియాలోని కాసీపేట- 1ఏ ఎక్స్టెన్షన్, కాసీపేట1, 2, శాంతిఖని గనులకు ట్రాన్స్ఫర్చేయనున్నారు. మూతపడనున్న ఆర్కే1ఏ, కేకే1 అండర్గ్రౌండ్గనులు బొగ్గు ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. రెండు మైన్లు మూసివేస్తుండగా మందమర్రి ఏరియాలో మరో4 అండర్ గ్రౌండ్ మైన్లు మనుగడలో ఉండనున్నాయి.
కొత్తగా ఐదు ఓసీపీలు
2023-–24 ఆర్థిక సంవత్సరంలో 75 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌ను చేరుకోవడం కోసం కొత్తగా ఐదు ఓపెన్‌కాస్ట్ గనులను ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. వీటి ద్వారా 134 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తామని పేర్కొంటోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చే ఐదు ఓసీపీల్లో ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్ ఓసీపీ మైన్ఒకటి. గడిచిన ఏడేండ్లుగా గని నుంచి బొగ్గు ఉత్పత్తి కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులోంచి 60 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయనున్నారు. మరోవైపు సింగరేణిలో కొత్తగా అండర్ గ్రౌండ్ మైన్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం నడుస్తున్న యూజీల్లో మిగిలి ఉన్న బొగ్గును పూర్తిస్థాయిలో వెలికితీసేందుకు విస్తరణ పేరుతో వాటిని ఓసీపీలుగా మారుస్తున్నారు. ఇందులో కొత్తగూడెంలోని వీకే ఓసీపీ నుంచి 30 లక్షల టన్నులు, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటీ ఓసీపీ నుంచి 4 లక్షల టన్నులు, ఇల్లందులోని జేకే ఓసీపీ మైన్నుంచి 10 లక్షల టన్నులు, రామగుండం కోల్‌మైన్ నుంచి 30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని కొత్తగా తీసేందుకు సింగరేణి ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో ఆర్కే1ఏ, కేకే1యూజీ మైన్లు మూసివేస్తుండగా రానున్న మూడేండ్లలో గౌతమిఖని ఓసీపీ, జవహర్‌ఖని 5 ఓసీపీ, రామగుండం ఓసీపీ1, ఫేజ్-2, శ్రీరాంపూర్1ఇంక్లైయిన్ యూజీ, రవీంద్రఖని 5 యూజీ, మణుగురూ ఓసీపీ, రవీంద్రఖని 6 యూజీ, కళ్యాణిఖని 5 యూజీ, ఆర్కేపీ ఓసీపీ మూతపడనున్నాయి.
