వరంగల్ లో 10 వేల మందితో నిరుద్యోగ మార్చ్: సంజయ్

వరంగల్ లో 10 వేల మందితో నిరుద్యోగ మార్చ్: సంజయ్

హైదరాబాద్, వెలుగు: ‘‘ఎన్నికల ఏడాదిలో ఉన్నాం. మీరంతా యుద్ధంలో పాల్గొనే గుర్రాల్లా మారాలి. అధికారమే లక్ష్యంగా పని చేయాలి’’ అని పార్టీ నాయకులకు బీజేపీ స్టేట్ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ దిశానిర్దేశం చేశారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో వివిధ మోర్చాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడారు. ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నందున పార్టీ కార్యక్రమాలను సీరియస్ గా తీసుకొని, రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

ఇందులో భాగంగా ఈనెల 9,10,11 తేదీల్లో వివిధ మోర్చాలు సమావేశం కావాలని ఆదేశించారు. ఇక నుంచి మోర్చాలు చేసే ప్రతి కార్యక్రమాన్ని సరళ్ యాప్ లో అప్ లోడ్ చేయాలన్నారు.  బీజేపీ స్టేట్ చీఫ్​ సంజయ్ మాట్లాడుతూ త్వరలో 10 వేల మందితో వరంగల్ లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్, బంగారు శ్రుతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, మనోహర్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.

‘‘నిరుద్యోగ  మార్చ్’’ నిర్వహణ కమిటీ


త్వరలో అన్ని జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించిన బీజేపీ.. అందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, గంగిడి మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ, రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్, దరువు ఎల్లన్న, పుల్లారావు యాదవ్ ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు.