
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే దేశంలో నిరుద్యోగం పెరగడానికి ప్రధాన కారణమని ఆక్స్ ఫామ్ ఇండియా వెల్లడించింది. మరింతమంది కార్మికులకు ఉపాధి కలిగించే రంగాలను ఇండియాలో ప్రోత్సహించడం ద్వారానే, ఉద్యోగకల్పన పెరుగుతుందని అభిప్రాయపడింది. దేశంలోని ఉద్యోగ కల్పన మీద ఆక్స్ ఫామ్ ఇండియా ఒక నివేదికను గురువారం ప్రకటించింది. నాణ్యమైన ఉపాధి కల్పన పెరగడం లేదని, అదేవిధంగా ఉపాధి అవకాశాలు స్త్రీ, పురుషులకు సమానంగా ఉండటం లేదని ఈ నివేదిక అభిప్రాయపడింది.దేశంలోని ఉద్యోగ కల్పన నిరుత్సాహం కలిగించేలా ఉందని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం అనుసరిస్తున్నవిధానాలలో వ్యవస్థాగతమైన లోపాలున్నాయని తేలినట్లు ఆక్స్ ఫామ్ ఇండియా సీఈఓ అమితాబ్‌బేహార్ వెల్లడించారు.
దేశంలో నిరుద్యోగం ఎక్కువవడానికి ప్రభుత్వ విధానాలే కారణమని చెబుతూ,సోషల్ సెక్యూరిటీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో పెట్టు బడులు పెంచకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అభిప్రాయపడ్డారు. ఇరుగుపొరుగు దేశాలతోపాటు, అంతర్జాతీయంగానూ పోటీకి నిలబడాలంటే, ఇండియా ఉద్యోగ కల్పనలో సరయిన దిశలోచర్యలు తీసుకోవడం ఆవశ్యకమని వ్యాఖ్యానించారు. పన్నుల విధానాల్లోనూ మార్పులు అవసరమని,కార్పొరేట్ పన్ను తగ్గించే విషయంలో దూకుడు పనికిరాదని పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల వచ్చే అదనపుఆదాయంతో సామాజిక భద్రత, ఆరోగ్యం , విద్యవంటి అత్యవసర సేవల మీద వెచ్చించాలని రిపోర్టుసూచించింది. మన దేశంలోని కార్మిక వనరులప్రకారం, ఇతర దేశాలలోని మోడల్స్ అనుసరించడానికి మనకు అనువైనవి కావని పేర్కొంది. మనదేశానికి అనువైన విధానాలను మనం రూపొందించుకోవాలని అభిప్రాయపడింది. మానవ వనరులుఎక్కువగా ఉన్న మన దేశంలో, యాంత్రీకరణ (మెకనైజేషన్ ) ప్రోత్సహించడం సరైనది కాదని రిపోర్టుఅభిప్రాయపడింది. కార్మికులకు ఎక్కువ మందికి ఉపాధి దొరికేలా అభివృద్ధి విధానాలు ఆవశ్యకమని తెలిపింది.