వక్ఫ్ అనేది చారిటీ మాత్రమే .. ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదన్న కేంద్రం

వక్ఫ్ అనేది చారిటీ మాత్రమే .. ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదన్న కేంద్రం
  • అందుకే వక్ఫ్​ బోర్డుల్లో నాన్ ముస్లింలు ఉండొచ్చు
  • వక్ఫ్​ సవరణ చట్టంపై కేసులో సుప్రీంలో కేంద్రం వాదనలు 
  • వక్ఫ్​ బై యూజర్ అనేది ప్రాథమిక హక్కు కాదు 
  • గతంలో సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పు చెప్పిందని వెల్లడి

న్యూఢిల్లీ: వక్ఫ్​ విధానం అనేది ఇస్లాంలో ఒక కాన్సెప్ట్ అయినప్పటికీ.. అది కేవలం చారిటీ (దాతృత్వం) మాత్రమేనని, ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మతానికి సంబంధం లేని విధులను మాత్రమే వక్ఫ్​ బోర్డులు నిర్వహిస్తాయని, అందువల్ల ఆ​బోర్డుల్లో ముస్లింయేతర వ్యక్తులను సభ్యులుగా అనుమతించవచ్చని తెలిపింది. అలాగే ప్రభుత్వానికి చెందిన భూములు తమవేనని ఎవరూ ప్రకటించుకోలేరని స్పష్టంచేసింది. వక్ఫ్​ సవరణ చట్టం–2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మాసిహ్ తో కూడిన బెంచ్ వరుసగా రెండో రోజున బుధవారం విచారణ చేపట్టింది. 

మంగళవారం పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించగా.. బుధవారం కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ‘‘వక్ఫ్​అనేది ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదు. అది ఒక చారిటీ మాత్రమే. ఇస్లాంలోనే కాదు.. ప్రతి మతంలోనూ ఈ విధానం ఉంది. క్రిస్టియానిటీ, సిక్కు మతంలోనూ చారిటీ ఒక భాగం అని చెప్పిన జడ్జిమెంట్​లు ఉన్నాయి. హిందూ మతంలోనూ దానం అనే కాన్సెప్ట్ ఉంది. 

వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, ఆడిటింగ్ వంటి మతానికి సంబంధం లేని విధులనే వక్ఫ్​ బోర్డులు నిర్వహిస్తాయి. ఇద్దరు నాన్ ముస్లిం సభ్యులను నియమించినంత మాత్రాన ఈ బోర్డుల స్వభావం ఏమీ మారిపోదు. వక్ఫ్​ బోర్డు ఎలాంటి మతపరమైన కార్యకలాపాలను నిర్వహించదు. అందువల్ల ఈ బోర్డులో ముస్లింయేతర వ్యక్తులను అనుమతించడంలో ఎలాంటి అభ్యంతరాలు అవసరంలేదు” అని ఆయన స్పష్టం చేశారు.

బ్రిటిష్ కాలం నాటి సమస్యను పరిష్కరించాం..   

గవర్నమెంట్ భూమిపై హక్కులు తమవేనని ఎవరూ ప్రకటించుకోలేరని, ప్రభుత్వానికి చెందిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని తుషార్ మెహతా వాదించారు. ‘‘వక్ఫ్ విధానంలోని వివాదాస్పద ‘వక్ఫ్​ బై యూజర్’ నిబంధన ప్రకారం.. ప్రభుత్వ భూములను వక్ఫ్​ ఆస్తులుగా ప్రకటించినా, ఆ భూములను స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. దానిని వక్ఫ్​ఆస్తిగా ప్రకటించినా కూడా అది ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు కూడా గతంలో తీర్పు ఇచ్చింది” అని ఆయన వెల్లడించారు.  వక్ఫ్​ బై యూజర్ అనేది ప్రాథమిక హక్కు కాదని తేల్చిచెప్పారు.

 వక్ఫ్​సవరణ చట్టంలో వక్ఫ్​ బై యూజర్ నిబంధనను తొలగించడంతో ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా వక్ఫ్​ ఆస్తులుగా వినియోగిస్తున్న ప్రభుత్వ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. అయితే, వక్ఫ్ బోర్డులో ఉన్న ఈ లోపాన్ని బ్రిటిష్ కాలం నాటి 1923 నుంచి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాల వరకూ ఎవరూ సరి చేయలేదని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సవరణ చట్టంలో ఈ నిబంధనను తొలగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం 
సమస్యను పరిష్కరించిందని చెప్పారు.

పిటిషనర్లు మొత్తం ముస్లింలకు ప్రతినిధులు కారు..  

వక్ఫ్ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ప్రతి భాగస్వామ్య పక్షాన్నీ సంప్రదించామని, మొత్తం 96 లక్షల సూచనలు, సలహాలు స్వీకరించామని తుషార్ మెహతా తెలిపారు. ‘‘దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ 36 సార్లు సమావేశమైంది. అన్ని రాష్ట్రాల వక్ఫ్​బోర్డులు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అభిప్రాయాలనూ పరిశీలించాకే నివేదిక ఇచ్చింది. అందువల్ల కేవలం కొందరు పిటిషనర్లు చెప్పే అంశాలను మొత్తం ముస్లిం కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించినట్టుగా భావించరాదు” అని ఆయన విన్నవించారు.