RFCL కోసం వివేక్ వెంకటస్వామి చాలా కృషి చేశారు : కిషన్ రెడ్డి

RFCL కోసం వివేక్ వెంకటస్వామి చాలా కృషి చేశారు : కిషన్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చారని అన్నారు. ఆర్ఎఫ్ సీఎల్ ఏర్పాటుతో రైతులకు ఎరువుల కొరత తీరనుందన్నారు. ప్రతి యూరియా బస్తాపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందన్నారు. రామగుండంలో యూరియా పరిశ్రమ ఏర్పాటు కోసం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వెంకటస్వామి, తాను చాలాసార్లు ప్రధాని మోడీని కలిశామని కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలోనూ చాలాసార్లు ప్రధానిని తాము కలిశామని చెప్పారు.

సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేస్తారని వస్తున్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. సింగేరేణిని ప్రైవేటు పరం చేయమని క్లారిటీ ఇచ్చారు. సింగరేణి సంస్థలో మెజార్టీ వాటా రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉందన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ దేశంలోని బొగ్గు గనులను ప్రైవేటీకరించలేదని స్పష్టం చేశారు. 

కేంద్రం.. రైతుల ప్రభుత్వం

వరి ధాన్యం కొనేందుకు కేంద్రం వద్ద డబ్బులు లేవంటూ కొంతమంది ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం(కాంగ్రెస్) రాష్ర్టంలో వరిధాన్యం కొనుగోలుపై 3 వేల750 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని, నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక వరి ధాన్యం కొనుగోలుపై 26 వేల కోట్లకుపైగా ఖర్చుపెట్టారని చెప్పారు. ‘ఈ విషయంలో వరి ధాన్యం కేంద్రం కొంటుందో లేదో ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇది రైతులకు అనుకూల ప్రభుత్వమా కదా..? అనే విషయాన్ని ఆలోచించాలి’ అని అన్నారు. 2014 వరకూ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు 24 లక్షల టన్నుల వరకూ ఉండేవని, ఇవాళ మాత్రం ఎఫ్ సీఐ ద్వారా142 టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు ఉంటున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి ద్వారా కేంద్రం ప్రతి రైతుకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తోందన్నారు. 

ఈఎస్ఐ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదు

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మూడు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తోందన్నారు. రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. రామగుండంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచామన్నారు. NTPC ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల విద్యుత్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 800 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తైందని, మిగతా నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయని చెప్పారు. దీని కోసం కేంద్రం రూ.4000 కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రామగుండలో ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భూమి ఇవ్వడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం త్వరగా భూమి కేటాయిస్తే ఈఎస్ఐ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

రాష్ట్రాభివృద్ధికి మోడీ చాలా కృషి చేస్తున్నారు

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలను అభివద్ధి చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. గ్రామ పంచాయతీలకు కూడా కేంద్రమే నిధులు కేటాయిస్తోందన్నారు. కరోనా సమయంలో ప్రజలను మోడీ ప్రభుత్వం ఆదుకుందన్నారు. ఉచితంగా రేషన్ అందించిందన్నారు. ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లను అందించి.. కరోనా కట్టడికి ఎంతగానో కృషి చేసిందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం నరేంద్ర మోడీ అంకితభావంతో పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ఎవరు సహకరించినా... సహకరించకపోయినా రాష్ట్రాన్ని మాత్రం అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. తమకు రాజకీయాలు అవసరం లేదన్నారు. అభివృద్ధి విషయంలో తాము రాజకీయాలు చేయమని చెప్పారు. డెవలప్ మెంట్ కోసం బీజేపీ కమిట్ మెంట్ గా పని చేస్తోందన్నారు.