- తాగుడుకు నా కొడుకు బలైండు: కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్
- తాగుడు అలవాటున్న ఆఫీసర్‌కంటే.. ఓ కూలీకి అమ్మాయినివ్వడం మేలు
- తాగేటోళ్ల జీవితకాలం చాలా చిన్నదని కామెంట్
సుల్తాన్‌పూర్: ‘‘లిక్కర్ తాగే అలవాటు ఉన్న ఆఫీసర్ కంటే.. ఏ అలవాటు లేని రిక్షా కార్మికుడికి లేదా కూలీకి మీ బిడ్డనిచ్చి పెండ్లి చేయడం మేలు’’ అని ప్రజలకు కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ విజ్ఞప్తి చేశారు. మంచి ఉద్యోగం ఉందనో, ఆస్తిపరుడనో తాగుబోతుకు అమ్మాయిని కట్టబెట్టొద్దని, లిక్కర్‌కు బానిసైనోళ్లకు పిల్లనివ్వద్దని కోరారు. ఆదివారం యూపీలోని లాంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన డీఅడిక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన కొడుకు మరణం గురించి ఆయన చెప్పుకొచ్చారు. తాను ఎంపీగా, తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా మద్యానికి బానిసైన తమ కొడుకు ప్రాణాలను కాపాడుకోలేకపోయామని, ఇక సామాన్య ప్రజలు తమ పిల్లలను ఎలా కాపాడుకోగలరని అన్నారు. ‘‘నా కొడుకు (ఆకాశ్ కిషోర్) తన ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగేవాడు. దీంతో ఓ డీ అడిక్షన్ సెంటర్‌లో జాయిన్ చేశాం. లిక్కర్‌ను మానేస్తాడని భావించి.. ఆరు నెలల తర్వాత పెండ్లి చేశాం. కానీ పెండ్లి అయినంక తాగడం మళ్లీ మొదలుపెట్టాడు. రెండేండ్ల కిందట ఆకాశ్ చనిపోయాడు. అప్పటికి అతడి కొడుకు వయసు రెండేండ్ల లోపే” అని కేంద్ర మంత్రి కిశోర్ చెప్పారు. ‘‘నా కొడుకును కాపాడుకోలేకపోయా.. నా కోడలు వితంతువుగా మారింది. మీరు మీ బిడ్డలు, అక్కాచెల్లెళ్లను కాపాడుకోండి” అని విజ్ఞప్తి చేశారు.
ఏటా 20 లక్షల మంది చనిపోతున్రు
లిక్కర్ తాగే వాళ్ల జీవిత కాలం చాలా తక్కువ అని కేంద్ర మంత్రి కిశోర్ అన్నారు. ‘‘స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాడుతూ 90 ఏండ్ల కాల వ్యవధిలో 6.32 లక్షల మంది చనిపోయారు. కానీ మద్యానికి బానిసలై.. ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారు. 80 శాతం క్యాన్సర్ మరణాలు.. పొగాకు, సిగరెట్, బీడీ అలవాటు వల్లనే నమోదవుతున్నాయి’’ అని వివరించారు. సుల్తాన్‌పూర్‌ను వ్యసనరహిత జిల్లాగా మార్చేందుకు డీ అడిక్షన్ క్యాంపెయిన్‌ను అన్ని స్కూళ్లలో చేపట్టాలని, ఉదయం ప్రార్థన సమయంలోనే పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు.

