రికార్డులు సృష్టించిన యునైటెడ్​ పార్సిల్​ సర్వీస్

రికార్డులు సృష్టించిన యునైటెడ్​ పార్సిల్​ సర్వీస్

ఇప్పుడైతే కూర్చున్న చోటికే మనకు కావాల్సిన పార్సిల్స్​ వచ్చేస్తున్నాయ్​. దానికోసం ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. పోస్టాఫీస్​లు, ఎ.ఎన్​.ఎల్​, అమెజాన్​, ఫ్లిఫ్​కార్ట్​... ఇలాంటివే. కానీ, వందేండ్ల కిందట ఇలాంటి సర్వీస్​ ఇచ్చే కంపెనీలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ‘యునైటెడ్​ పార్సిల్​ సర్వీస్’ అలాంటిదే. దాదాపు 120 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ పార్సిల్స్​ డెలివరీలో ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని పార్సిల్​ డెలివరీ కంపెనీల్లో ఇది నెం.1 అనొచ్చు. అలాంటి ఈ కంపెనీని పెట్టింది ‘జిమ్ కేసీ’.  ఆయన కష్టాలు, శ్రమ, పట్టుదల, పోరాటాలే ఈ స్టోరీ​.  

అమెరికాలోని కాండ్లేరియాలో మార్చి 29, 1888లో పుట్టాడు జేమ్స్​ ఎమ్మెట్​ కేసీ(జిమ్​ కేసీ). తల్లిదండ్రులు యానీ సీహాన్​, హెన్రీ కేసీ. వీళ్లు ఐర్లాండ్​ నుంచి అమెరికాకు వలస వచ్చినవాళ్లు. సెలూన్​ నడుపుతూ బతికేవాళ్లు. వీళ్లకు జిమ్​ తర్వాత మరో ఇద్దరు కొడుకులు, ఒక కూతురు పుట్టారు.

పదకొండేండ్లకే పనిలోకి..

సెలూన్​ వల్ల వచ్చే సంపాదన చాలకపోవడంతో దగ్గరలోని గనుల్లో పనికి వెళ్లేవాడు హెన్రీ. అయినా డబ్బు సరిపోయేది కాదు. దాంతో1897లో సీటెల్​ సిటీకి కుటుంబాన్ని మార్చాడు. అదే టైంలో కెనడాలోని క్లోండికె ప్రాంతంలో బంగారు గనులు బయటపడ్డాయి. ఆ బంగారం కోసం వేలాది మంది బయల్దేరారు. వాళ్లలో హెన్రీ కూడా ఉన్నాడు. అయితే, వీళ్లు వెళ్తున్న ఓడ ప్రమాదంలో దెబ్బతింది. హెన్రీ ఆరోగ్యం పాడైంది. తిరిగి ఇంటికి ఎలాగోలా చేరుకున్నా అనారోగ్యంతో మంచానికే పరిమితం అయ్యాడు. అప్పటికి జిమ్​కు పదకొండేండ్లు. కుటుంబం పరిస్థితి బాగలేకపోవడంతో స్కూలు మానేశాడు జిమ్​​. సీటెల్​లోని ఒక డిపార్ట్​మెంటల్​ స్టోర్​లో డెలివరీ డ్రైవర్​కు అసిస్టెంట్​గా చేరాడు. అక్కడ వారానికి 2.50 డాలర్లు ఇచ్చేవాళ్లు. రోజూ డెలివరీకి తిరగడం వల్ల జిమ్​కు సిటీపై పూర్తి పట్టు వచ్చింది. సందుగొందులన్నీ తెలిశాయి. మరోవైపు జిమ్​తోపాటు ఇద్దరు తమ్ముళ్లు కూడా పనికి వెళ్లడం మొదలుపెట్టారు.  

మెసెంజర్​ బాయ్​గా...

1901లో ఒక టీ స్టోర్​లో వారానికి ఐదు డాలర్ల జీతానికి చేరాడు జిమ్.  అక్కడ కొన్ని రోజులు పనిచేశాక, తిరిగి స్కూల్​కు వెళ్లాలనుకున్నాడు. టీ స్టోర్​లో జాబ్​ వదిలేసి, అమెరికన్​ డిస్ట్రిక్​ టెలిగ్రాఫ్​(ఏడీటీ) కంపెనీలో ‘మెసెంజర్​ బాయ్’​గా నైట్​ డ్యూటీకి చేరాడు. పగలు స్కూల్​కు వెళ్తూ, రాత్రిళ్లు జాబ్​ చేసేవాడు. అక్కడే అతనికి క్లాడ్​ రియాన్ ఫ్రెండ్​ అయ్యాడు. అత్యవసరంగా రిపేర్​ చేయాల్సిన రోడ్ల గురించి సమాచారం అందించడం, పేరెంట్స్​ సినిమాకు వెళ్తే వాళ్ల పిల్లలను ఆడించడం, నిందితుల కోసం వచ్చే బెయిల్​ ఆర్డర్స్​ పంపిణీ చేయడం, మద్యం, డ్రగ్స్​, ఓపియం సరఫరా చేయడం వంటి పనులు చేసేవాళ్లు జిమ్​, క్లాడీ. అయితే, మంచాన ఉన్న తండ్రి చనిపోవడం, ఖర్చులు పెరగడం, కంపెనీలో పని ఎక్కువ కావడంతో మళ్లీ స్కూల్​ మానేశాడు జిమ్​.

ఫస్ట్​ కంపెనీ

అప్పట్లో సీటెల్​లో కేవలం కొన్ని ఇండ్లలో మాత్రమే టెలిఫోన్​లు ఉండేవి. అందువల్ల ఎవరికైనా సమాచారం పంపాలంటే ఇబ్బంది పడేవాళ్లు. దీన్ని గమనించాడు జిమ్​. దాంతో మెసెంజర్​ కంపెనీ పెట్టాలనుకున్నాడు. జాబ్​కు వెళ్తూ సంపాదించిన 30 డాలర్లు జిమ్​ దగ్గర ఉండేవి. మరో ఇద్దరు ఫ్రెండ్స్​ తోడు కావడంతో 1903లో ‘సిటీ మెసెంజర్​ సర్వీస్​’ కంపెనీ పెట్టాడు. ఇందులో రెండు టెలిఫోన్​లు ఉండేవి. వీటి ద్వారా సిటీలో ఎవరికైనా ఏదైనా మెసేజ్​వస్తే దాన్ని డెలివరీ చేసేవాళ్లు. అలాగే వాళ్లు అడిగిన పని చేసిపెట్టేవాళ్లు. అయితే, కంపెనీ సక్సెస్​ కాలేదు. దాంతో రెండేండ్లకే దాన్ని అమ్మేశారు. ఆ టైంలో తండ్రి లాగా మైనింగ్​ చేయాలని అనుకున్నాడు జిమ్​. ఫ్రెండ్స్​లో ఒకరు సరే అనడంతో నెవడాలోని బంగారు గనులకు వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ గని మూతపడింది. చేసేది లేక అక్కడే పరిచయమైన జాన్​ మోరిట్జ్​తో కలిసి మళ్లీ మెసెంజర్​​ సర్వీస్​ మొదలుపెట్టాడు. ముగ్గురూ కలసి లోకల్​ టెలిఫోన్​, టెలిగ్రాఫ్​ ఆఫీస్​ నుంచి వచ్చే మెసేజ్​లను డెలివరీ చేస్తూ నెలకు 50 డాలర్ల చొప్పున సంపాదించేవాళ్లు. ఈ బిజినెస్​ సక్సెస్​ అయింది. కానీ, డబ్బు కోసం జాన్​ హౌరిట్జ్​ను ఒక దొంగ కాల్చి చంపడంతో కంపెనీ మూసేసి ఫ్రెండ్​తో కలిసి తిరిగి సీటెల్​ చేరుకున్నాడు.    

అమెరికన్ మెసెంజర్​

 సీటెల్​కు వచ్చాక​ పాత ఫ్రెండ్​ క్లాడ్​ రియాన్​ను కలిశాడు. ఇద్దరూ కలిసి మళ్లీ మెసెంజర్​ కంపెనీ పెట్టాలనుకున్నారు. కానీ, అవసరమైన డబ్బు వాళ్ల దగ్గర లేదు. ఎవరిని అడిగినా అప్పు పుట్టలేదు. ఆ టైంలో రియాన్​ మేనమామ వాళ్లకు అండగా నిలిచాడు. వంద డాలర్లు అప్పు ఇచ్చాడు. ఆ డబ్బుతో ఆగస్ట్​ 28, 1907లో ‘అమెరికన్​ మెసెంజర్​ కంపెనీ’ పెట్టారు జిమ్​, క్లాడీ. అప్పటికి జిమ్​కు 19 ఏండ్లు. కంపెనీ కోసం రెండు టెలిఫోన్​లు, రెండు సైకిళ్లు కొన్నారు. అలాగే ఆరుగురు డెలివరీ బాయ్స్​ను చేర్చుకున్నారు. ​దూరాన్ని బట్టి ఒక్కో మెసేజ్​కు 15 నుంచి 65 సెంట్​లు తీసుకునేవాళ్లు. తక్కువ డబ్బు తీసుకోవడం, చెప్పిన టైంకు మెసేజ్​ డెలివరీ  చేయడం జనాల్ని ఆకట్టుకుంది.  కంపెనీ 24 గంటల సర్వీస్​ అందించేది. వీకెండ్​ సెలవు కూడా ఉండేది కాదు. జిమ్, క్లాడీ ఒక్కోసారి ఆఫీస్​లోనే నిద్రపోయేవాళ్లు. అంత పని ఉండేది వాళ్లకు.  

మర్చంట్స్​ పార్సిల్​ డెలివరీ

అమెరికన్​ మెసెంజర్​ కంపెనీ సూపర్​ సక్సెస్​ కావడంతో సీటెల్​లోనే మరో బ్రాంచ్​ పెట్టారు. జిమ్​ తమ్ముడు జార్జ్​ కూడా కంపెనీలో జాయిన్​ అయ్యాడు. అయితే, క్రమంగా టెలిఫోన్​, పోస్టాఫీస్​ల సంఖ్య పెరగడంతో ఆర్డర్స్ తగ్గడం మొదలైంది. దాంతో డిపార్ట్​మెంటల్​ స్టోర్స్​ నుంచి నేరుగా కస్టమర్స్​కు ప్రొడక్ట్స్​ డెలివరీ చేసేలా డీల్​ కుదుర్చుకున్నారు. కంపెనీ తిరిగి నిలదొక్కుకుంది. ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అదే టైంలో ‘మెకాబే మోటార్​ సైకిల్​ డెలివరీ కంపెనీ’తో​ కంపెనీని మెర్జ్​ చేశారు. కంపెనీ పేరును ‘మర్చంట్స్​ డెలివరీ పార్సిల్​ సర్వీస్’​గా మార్చారు. డెలివరీల కోసం ఆరు మోటార్​సైకిల్స్​​, ఒక కారు తీసుకున్నారు. ఈ కారుకు వెనక భాగాన్ని కొద్దిగా మార్చి వ్యాన్​లా చేశారు. 1915 కల్లా సీటెల్​లో అతిపెద్ద డెలివరీ సర్వీస్​ కంపెనీగా మారింది.

యూపీఎస్​ 

1917లో కంపెనీని క్లాడీ వదిలిపెట్టాడు. తన వాటా తీసుకొని వెళ్లిపోయాడు. ఆ తర్వాత జిమ్​, అతని తమ్ముడు పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ఉద్యోగుల సంఖ్య పెంచారు. పార్సిళ్లకు ఎలాంటి డ్యామేజీ జరగకుండా, టైంకు డెలివరీ చేయడంలో కంపెనీని తీర్చిదిద్దారు. అలాగే నెమ్మదిగా కంపెనీ బ్రాంచ్​లను ఇతర నగరాల్లో కూడా స్టార్ట్​ చేయడం మొదలుపెట్టారు. శాన్​ఫ్రాన్సిస్కోలో కంపెనీని పెట్టినప్పుడు పేరుతో సమస్య వచ్చింది. అక్కడ ‘మర్చంట్స్​ పార్సిల్స్’తో​ మరో కంపెనీ ఉంది. దాంతో జిమ్​ తన కంపెనీ పేరును 1919లో ‘యునైటెడ్​ పార్సిల్​​ సర్వీస్​(యూపీఎస్​)’గా మార్చాడు. బిజినెస్​​ డెవలప్​ కావడంతో అమెరికాలోని అన్ని నగరాల్లోనూ బ్రాంచ్​లు తెరిచాడు. అలాగే పార్సిల్స్​ డెలివరీ కోసం విమానాలు కొన్నాడు. వాటికోసం ఏకంగా కెంటకీలో అతిపెద్ద విమానాశ్రయం కూడా కట్టాడు. ఈ విమానాల ద్వారా విదేశాలకు కూడా పార్సిల్స్​ డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. కంపెనీ అవసరాలను బట్టి హెడ్డాఫీస్​ను 1920లో లాస్​ఏంజిలెస్​కు,1930లో న్యూయార్క్​కు,1975లో కనెక్టికట్​కు మార్చాడు. కంపెనీని బిలియన్​ డాలర్ల బ్రాండ్​గా మార్చిన జిమ్​ కేసీ 1983లో చనిపోయాడు. ఇప్పుడు యుపిఎస్​లో సుమారు 5లక్షల 34వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ బ్రాండ్​ విలువ 13.3 బిలియన్​ డాలర్లు.​ యూపీఎస్​ హెడ్డాఫీస్​ ఇప్పుడు అట్లాంటాలో ఉంది. 

లోగో కథ ఇదీ

యుపిఎస్​ మొదటి లోగో 1916లో వచ్చింది. ఇందులో  బంగారు అంచు ఉన్న బ్రాంజ్​ షీల్డ్​పై​ అమెరికా జాతీయ పక్షి అయిన ‘బాల్డ్​ ఈగిల్​’ మాదిరి గద్ద ఉండేది. ఈ గద్ద కాళ్లకు పార్సిల్​ చేసిన ప్యాకేజీ ఉండేది. ఈ లోగోకు ఎలాంటి స్లోగన్​ లేదు. అయితే, ‘సేఫ్​(రక్షణ), స్విఫ్ట్​(వేగం), ష్యూర్​(కచ్చితం)’ అనేది బ్రాండ్​ స్లోగన్​గా ప్రచారమైంది. 1937లో రెండో లోగో వచ్చింది. ఇందులో గోల్డ్​, బ్రౌన్​ కలర్​తో షీల్డ్​ ఉండేది. అలాగే గద్దకు బదులు ‘యుపిఎస్’​, పైభాగంలో ‘ది డెలివరీ సిస్టమ్​ ఫర్​ స్టోర్స్​ ఆఫ్​ క్వాలిటీ’, కింది భాగంలో ‘సిన్స్​ 1902’ అని రాశారు. ​1961లో మూడో లోగో వచ్చింది. ఇందులో షీల్డ్​ రెండు భాగాలుగా కనిపిస్తుంది. పై భాగాన్ని ప్యాక్​ చేసిన పార్సిల్​లా మార్చారు. కింది భాగంలో ‘యుపిఎస్’ అక్షరాలు ఉంచారు. మిగతావి తీసేశారు. గోల్డ్​, బ్రౌన్​ కలర్​ కూడా లేవు. మనం ఇప్పుడు చూస్తున్న లోగో 2003లో వచ్చింది. ఇందులో షీల్డ్​కు మళ్లీ గోల్డ్​, బ్రౌన్​ కలర్​ అద్దారు. మధ్యలో ‘యుపిఎస్’​ అక్షరాలు ఉంచారు.