తెలంగాణ వచ్చినా మారని వర్సిటీల స్థితిగతులు

తెలంగాణ వచ్చినా మారని వర్సిటీల స్థితిగతులు

తెలంగాణ ఉద్యమంలో విశ్వవిద్యాలయాలే కేంద్రంగా విద్యార్థులు, అధ్యాపక మేధావులు కలిసి అనేక రకాల ఉద్యమాలు నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే యూనివర్సిటీలు బాగుపడుతాయని, వర్సిటీల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుతుందని అంతా అనుకున్నారు. కానీ తెలంగాణ వచ్చినా.. వర్సిటీల స్థితిగతులు మారలేదు సరికదా.. మరింత దారుణంగా తయారయ్యే స్థితిలో ఉన్నాయి. ఎనిమిదేండ్ల స్వరాష్ట్ర పాలనలో ప్రభుత్వం యూనివర్సిటీలకు సరిపోను నిధులు ఇవ్వడం లేదు. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. త్వరలోనే రిక్రూట్​మెంట్​చేపడుతామని కాలయాపన చేసిన సర్కారు.. ఇప్పుడు యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతీసేలా.. వర్సిటీల్లో టీచింగ్, నాన్- టీచింగ్ నియామకాలపై కామన్ రిక్రూట్​మెంట్ బోర్డు ఏర్పాటును తెరమీదకు తెచ్చింది. 

కొత్త సమస్యలతో కాలయాపన..

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చే ఈ కామన్ ​రిక్రూట్​మెంట్ ​బోర్డు విధానం 1991 ఆంధ్రప్రదేశ్ విశ్వ విద్యాలయాల చట్టానికి విరుద్ధం. యూనివర్సిటీ గ్రాంట్స్ ​కమిషన్(యూజీసీ) నిబంధనలకు కూడా వ్యతిరేకం. ఈ విధానంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉండటంతోపాటు ఉద్యోగార్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. నియామక బోర్డులో వీసీలను, ప్రొఫెసర్లను కమిటీ మెంబర్లుగా తీసుకోకపోవడం సరికాదు. బోర్డులో కేవలం ఐఏఎస్​ ల నియామకం ద్వారా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసి, వాటిన తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. వర్సిటీల స్వతంత్రతను పక్కకు పెట్టి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్​ ఇచ్చింది. కాగా కోర్టు ఆదేశాలతో ఆ నోటిఫికేషన్ రద్దు చేయాల్సి వచ్చింది. ఒడిశాలోనూ ఇలాంటి సమస్యే ఎదురైంది. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ సెలక్షన్ బోర్డు ద్వారా చేపట్టిన నియామక ప్రక్రియపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.  కాంట్రాక్టు అధ్యాపకులు ఒక వైపు పెర్మినెంట్ చేయాలని కోరుతున్నారు,  పార్ట్ టైం టీచర్స్ వెయిటేజ్ అడుగుతున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం కామన్ రిక్రూట్ మెంట్ పేరుతో మళ్లీ కోర్టు కేసులతో కాలయాపన చేస్తుందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే గ్రూప్ 1, 2 కోర్టు కేసుల అనుభవాలు ఉన్నాయి. మళ్లీ ఇలాంటి సమస్యలు ఎదురైతే 8 ఏండ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతుంది. 

పాత పద్ధతిలోనే చేపట్టాలె..

వర్సిటీల అకడమిక్ స్వేచ్ఛను దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు కనబడుతున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీసీ నియమ, నిబంధనలకు అనుగుణంగా అప్లికేషన్లను ఒక పద్ధతి ప్రకారం స్క్రూటినీ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. యూనివర్సిటీ స్వతంత్రతను గానీ, సాధికారతను గానీ ప్రశ్నించే పరిస్థితులు అక్కడ ఉండవు. ఇలాంటి వాటిని పట్టించుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీల ప్రాతినిధ్యం లేకుండా కామన్​ రిక్రూట్​మెంట్ ​బోర్డు విధానం తీసుకురావాలని చూస్తోంది.  యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా యూనివర్సిటీలు చేసిన పనులను గతంలో అనేక సందర్భాల్లో కోర్టులు వ్యతిరేకించాయి. వీసీల నియామకంలో ప్రభుత్వం యూజీసీ రూల్స్ బ్రేక్ చేసిందని, ఓ వర్సిటీకి అర్హత లేని వ్యక్తిని వీసీగా నియమించిందన్న ఆరోపణలు ఉన్నాయి. దానిపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. వీసీల విషయంలోనే ఇలాంటి ధోరణి అవలంబించిన ప్రభుత్వం.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో ఎలా పారదర్శకంగా ఉంటుందన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్టపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నియామకాలు చేపడతామని ప్రభుత్వం చెబుతున్నా.. అది ఎంత వరకు ఆచరణలోకి వస్తుందనేది చూడాలి. వర్సిటీ చట్టాల్లో సవరణలు తీసుకొచ్చిన తర్వాతే, పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. పాతపద్ధతిలోనే రిక్రూట్​మెంట్ ​విధానం కొనసాగించి, తెలంగాణ అధ్యాపక, అధ్యాపకేతర ఆశావహులకు ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా పారదర్శకత చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

- శ్రీశైలం వీరమల్ల, రిసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ