ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తడిసిన ధాన్యం.. మునిగిన రైతులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తడిసిన ధాన్యం.. మునిగిన రైతులు
  • కల్లాలు, ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద తడిసి ముద్దయిన వడ్లు, జొన్నలు
  • నష్టపోయామని రైతుల ఆవేదన
  • తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్

వెలుగు, నెట్​వర్క్: అకాల వర్షం ఉమ్మడి జిల్లా రైతన్నను అతలాకుతలం చేసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం దంచికొట్టింది. ఫలితంగా ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద ఆరబెట్టిన, బస్తాల్లో నింపిన వడ్లు  తడిసి ముద్దయ్యాయి. నిర్మల్ ​జిల్లా కేంద్రంతోపాటు కుంటాల, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంతో పాటు బేల, జైనథ్, తలమడుగు, తాంసి, భీంపూర్​ మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బేల మండల కేంద్రంలోని మార్కెట్​ యార్డులో ఉన్న జొన్నలు తడిసిపోయాయి. 

కొనుగోళ్లు ఆలస్యంతోనే తిప్పలు 

దండేపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో కళ్లాల్లో ఉన్న వరి కుప్పల్లోకి నీరు చేరింది. కుప్పలపై ప్లాస్టిక్ కవర్స్ కప్పినా వరద కుప్పల్లోకి చేరింది. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవడంతోనే సెంటర్ల వద్ద ఉన్న వడ్లు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయయకపోవడంతో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయిందని ఆరోపిస్తున్నారు.

 లారీల కొరత కారణంగా తూకం వేసిన బస్తాలను రైస్ మిల్లులకు చేర్చకుండా కేంద్రాల్లోనే ఉంచడంతో అవి తడిసిపోయాయి. ఈదురు గాలులకు జన్నారం మండలంలో మండలంలోని తపాలపూర్ లో పలువురి ఇండ్ల రేకులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయి కరెంట్ సరఫరలో అంతరాయం ఏర్పాడింది. సిర్పూర్ టీ లోని సీడం రుకుంబాయి అనే మహిళ ఇంట్లోకి వరద చేసి వస్తువులు తడిసిపోయాయి. దహెగాం మండలంలో గాలివానకు కల్లాల్లోని వడ్లకుప్పలపై కప్పిన కవర్లు కొట్టుకుపోయి వడ్లు తడిసిపోయాయి.