ట్యాంక్ బండ్ చెప్పని కథలు-10

ట్యాంక్ బండ్ చెప్పని కథలు-10

తెలంగాణ పోరాటానికి పునాది పాట. నాటి పోరాటాల పాటకు నిలువెత్తు రూపం... సుద్దాల హనుమంతు. గడ్డి పోచను కూడా కదిలించి సమరానికి ఉరికేలా తన పాటలతో స్ఫూర్తినింపిన జానపద యోధుడు సుద్దాల. 1908 డిసెంబర్లో నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పాలడుగులో లక్ష్మీనరసమ్మ, బుచ్చిరాములు దంపతులకు హనుమంతు పుట్టారు. బుచ్చిరాములు ఆయుర్వేద వైద్యం చేసేవారు. వారిది చేనేత కుటుంబం. నిజానికి వారి ఇంటి పేరు గుర్రం. గుండాల మండలం సుద్దాల గ్రామంలో ఆ కుటుంబం స్థిరపడడంతో ఆ ఊరి పేరే వారి ఇంటిపేరుగా మారింది. నాటకాలు, పాటలను చిన్నతనం నుంచి ఇష్టపడే హనుమంతు అప్పటి హరికథ కళాకారుడు అంజనదాసు శిష్యుడిగా మారారు. వీధిబడి వరకే చదువుకున్నా సాహిత్యం, పాటలు కట్టడం, పాడడంలో మంచి పట్టు సంపాదించారు. 

బతుకుతెరువు కోసం హనుమంతు హైదరాబాద్ లో నిజాం ప్రభుత్వ ఆఫీస్ లో చిన్న కొలువులో చేరారు. ఆర్యసమాజం ప్రభావంతో అందులో చేరి పనిచేశారు. హనుమంతు 20వ ఏటనే యదార్థ భజనమాల అనే పాటల పుస్తకం రాశాడు. అది అచ్చు కాకముందే అందులోని పాటలు ఊరూరా మారుమోగాయి. సుద్దాల చేస్తున్న సాహితీ పోరాటంపై పోలీసులు నివేదిక ఇవ్వడంతో నిజాం ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో కొలువు వదిలిపెట్టి ప్రజా ఉద్యమంలోకి వచ్చారు. హరికథ, బుర్రకథ, యక్షగానం లాంటి కళారూపాల్లో జనాన్ని కదిలించేలా ప్రదర్శనలు ఇచ్చేవాడు. హనుమంతు పాటగడితే అది విన్న గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమవుతుందంటూ అప్పట్లో ఆయన గురించి చెప్పుకునేవారు. దొరల దౌర్జన్యాలపై గొల్లసుద్దులు, లత్కోరుసాబ్, ఫకీరువేషం లాంటి కళారూపాలను ప్రదర్శించారు. 

భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభకు హనుమంతు వలంటీర్ గా పనిచేశారు. సంఘం పెట్టి జనాన్ని రెచ్చగొడుతున్నారని నిజాం సర్కార్ కేసు పెట్టడంతో ఆయన అజ్ఞాతంలోకి పోయారు. కమ్యూనిస్ట్ యోధులయిన గుర్రం యాదగిరిరెడ్డి, కాశీ రామస్వామి, గడ్డమీది రామయ్యలతో కలిసి సాయుధపోరులోనూ పాల్గొన్నారు హనుమంతు. దొరల కింద వెట్టిచాకిరిలో తెలంగాణ బిడ్డల బాల్యం ఎట్లా నిలిపోయిందో చెబుతూ పల్లెటూరి పిలగాడా.. పసులగాసే మొనగాడా అంటూ హనుమంతు రాసిన పాట ఊరూరా మారుమోగింది. జనం బతుకుల నుంచే రాసిన ఇట్లాంటి పాటలు వింటుంటే జనం ఉద్వేగంతో ఊగిపోయేవారు. సంఘం వచ్చిందిరో రైతన్నా.. మనకు బలం చాన తెచ్చిందిరో కూలన్నా అంటూ హనుమంతు పాడుతుంటే జనంలో స్ఫూర్తి రగిలేది. సుద్దాల రాసిన గొల్లసుద్దులు నాటకం తెలంగాణ అంతటా మారుమోగింది. ఎక్కడ సభ జరిగినా సుద్దాల పొల్గొని ఐదుగంటల పాటు సమరగీతాలు వినిపించేవాడు. అన్యాయాన్ని ఎదిరించాలంటే చదువు ఉండాలనీ, అందరూ చదువుకోవాలని హనుమంతు ప్రచారం చేశారు. సుద్దాలలో బడి లేదని తన ఇంట్లోనే పిల్లలకు పాఠాలు చెప్పారు. అందుకే హనుమంతును పంతులు అని పిలిచేవారు. 

1948లో పోలీసు యాక్షన్ తర్వాత హనుమంతు అనారోగ్యం కారణంగా అజ్ఞాతం నుంచి వచ్చి బొంబాయిలో కొంతకాలం ఉన్నారు. 1952లో తిరిగి వచ్చారు. అప్పట్లో పార్లమెంటు ఎలక్షన్లో పోటీచేసిన సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి గెలుపుకోసం ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో రావి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 

ప్రజల్ని మేల్కొలిపే నిజమైన సాహిత్యాన్ని రాయడానికి యతిప్రాసలతో పనిలేదని తన పాటలతో సుద్దాల నిరూపించారు. పోరాటానికి, ప్రజలకే జీవితం అంకితం చేసిన సుద్దాల హనుమంతు 1982 అక్టోబర్ 10న కన్నుమూశారు. సుద్దాల కుమారుడు అశోక్ తేజ కూడా కవిగా, సినీ పాటల రచయితగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తల్లిదండ్రుల పేరు మీద ఏటా పురస్కారాలు అందిస్తున్నారు. ప్రజాకవిగా సుద్దాల హనుమంతు తెలంగాణ సమాజానికి చేసిన సేవలకు తగిన గౌరవం దక్కలేదు. ఆయన పాటలు చెరగని ముద్ర వేసినా ఆయన గుర్తులను కాపాడుకునే ప్రయత్నం మాత్రం జరగలేదు. నాటి నుంచి నేటి వరకు మన ప్రభుత్వాలు ఆయన్ను గుర్తించలేదు.